‘అడ్రెస్’ వెతుక్కుంటున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని
ఇది చాలా అరుదైన ఫోటో. ఎవరికీ తెలియని ఫోటో. 1864 నవంబర్ 1 రాత్రి వచ్చిన తుఫానులో బందరులో చనిపోయిన మృతుల సామూహిక సమాధి. ఫోర్ట్ ప్రాంతంలో తుప్పల్లో ఇరుక్కుని ఉంది.
నారా చంద్రబాబు నాయుడు రెండవ సారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక మరోసారి ‘అమరావతి’ రాజధాని చుట్టూ తిరుగుతున్నారు. ఈసారి దాన్ని శాశ్వత ‘ప్రాజెక్ట్’ చేస్తే, ఆ తర్వాత దాన్ని మరెవ్వరూ మార్చడం కుదరదు అన్నట్టుగా ఉంది ఆ తొందరబాటు. ఎన్నికల ముందు ప్రజలకు చేసిన వాగ్ధానాలను ఆ పార్టీ ఇప్పటికే గాలికి వదిలేసింది. ‘కొంత సమయం తీసుకుని వాటిని అమలుచేస్తాము,’ అని సంజాయిషీ రూపంగా కూడా వాటి గురించి మాట్లాడడానికి ఆ పార్టీ ఇష్టపడడం లేదు. కానీ రాజధాని ‘అమరావతి’ విషయంలో మాత్రం ఎక్కడలేని ఆసక్తిని చూపిస్తున్నారు. అక్టోబర్ మొదటి వారంలో ఆయన డిల్లీ వెళ్లి ‘రాజధాని’ హెడ్ లైన్ అయ్యేట్టుగా ఆయన చూసుకున్నారు.
ఈ రాజధాని నిర్మాణం లోతుల్లోకి గత ప్రభుత్వం వెళ్లి పరిశీలించి ఇది ఆచరణ సాధ్యం కాని ‘ప్రాజెక్టు’ అనే దాన్ని వదిలేసింది. దాని బదులు వికేంద్రీకరణను అది ప్రతిపాదించింది. గతంలోనూ ఇప్పుడు కూడా ‘అమరావతి’ విషయంలో బిజేపి ప్రభుత్వం వైఖరి ఏమిటి? అనేది మూడు సార్లుగా కేంద్ర ఆ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ వారి పట్టణాభివృద్ది శాఖ మంత్రి మాట్లాడరు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రభుత్వాల మధ్య ‘స్థలం’ వివాదంగా మారినప్పుడు, సాంకేతికంగా అది తన అంశం కానప్పటికీ, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం అందులో కలగచేసుకోవచ్చు. అయినా ఇప్పుడు కాదు, అది ఆ పని 2014-2019 మధ్య కాలంలోనే చేయలేదు. బిజేపికి మన ఖాతాలో పడాల్సిన మరొక రాష్ట్రం- ఏ.పి. అనే దృష్టి తప్ప మరొకటి కనిపించడం లేదు.
అయినా మొదటి నుంచి టి.డి.పి. ప్రభుత్వానిది హస్వదృష్టి, తరుచూ ‘విజన్’ అంటారు కానీ, వాళ్ళ ఆచరణలో అది కనిపించదు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ముందు అమలుచేసి అప్పుడు బాబు ‘అమరావతి’ కట్టుకుంటే, ‘మనల్ని వంచించి గెలిచాక ఈ ప్రభుత్వం ఏమి చేస్తున్నది?’ అనే ‘క్రిటికల్’ దృష్టి నుంచి ఈ ప్రభుత్వాన్ని చూడరు. కానీ వాటిని ఎగ్గొట్టి ఏమీ పట్టనట్టుగా నేనెటో ఆకాశంలోకి చూస్తాను ‘డ్రోన్స్ సమ్మిట్’ పెడతాను అంటే, మొదటి ఆరు నెలలకే అది అసంతృప్తి మూట కట్టుకోవడం అవుతుంది. అప్పుడే సముద్ర తీర పట్టణాల్లో ‘బీచ్ ఫెస్టివల్స్’ పెడతాం అంటున్నారు. గడచిన పదేళ్ళలో ఊళ్ళల్లో సామాన్య ప్రజలకు కూడా ‘ఇంటర్నెట్’ అందుబాటులోకి వచ్చాక, ‘సోషల్ మీడియా’ వల్ల పెరిగిన అవగాహనా స్థాయి ఏమిటో వీరికి అర్ధం కావడం లేదు. అందుకే ఇంకా పాత ‘మేనేజ్మెంట్ టెక్నిక్స్’ వీళ్ళు జనం మీద ప్రయోగిస్తున్నారు. నిజానికి ఇవి ఇరవై ఏళ్ళ క్రితం నాటి ‘ఈవెంట్స్’. ఇక్కడ 2001 నాటికే పర్యాటక అభివృద్దికి ‘కృష్ణా మహోత్సవ్’ పేరుతొ ప్రకాశం బ్యారేజి వద్ద నదీ ఉత్సవాలు జరిగాయి.
అయినా సెప్టెంబర్ మొదటి వారం ‘బుడమేరు’ అనుభవం తర్వాత ఆయారంగాల నిపుణులను రాష్ట్రానికి పిలిచి వారితో ప్రభుత్వం జరిపిన సమీక్ష ఏది? కొత్తగా 15 వేల క్యూసెక్కులు వరద వచ్చినా తట్టుకునే ఎత్తైన కరకట్ట కడతాము అంటున్నారు. అయినా ఇదేమీ నిన్నకాక మొన్న పుట్టిన ‘జాగ్రఫీ’ కాదు కదా. తూర్పు కనుమల్లో కురిసే వర్షం నీటి ప్రవాహానికి ఒక సహజ మార్గం ఉంది. ఈ ప్రాంతాన్ని ఒకప్పడు సర్కారు జిల్లాలు అనేవారు.
బ్రిటిష్ ప్రెసిడెన్సీ పాలనలో 200 ఏళ్ళపాటు వున్న ప్రాంతం. అప్పట్లోనే ప్రతిదానికి ఇక్కడ ‘సిస్టమ్స్’ ఏర్పడ్డాయి. అది ఎందుకో తెలియాలి. జిల్లా కేంద్రం బందరు పట్టణానికి 1864 నవంబర్ 1 రాత్రి వచ్చిన తుఫానులో ముప్పై వేలమంది చనిపోయిన విషయం ఇప్పుడు ఎవరికీ తెలియదు. బందరు జనాభాలో సగం మంది చనిపోయారట. అప్పటి మృతుల సామూహిక సమాధిపై కట్టిన జ్ఞాపకార్ధ కట్టడం ఇప్పటికీ బందరు ఫోర్ట్ ప్రాంతంలో తుప్పల్లో ఎవ్వరూ పట్టించుకోని స్థితిలో ఉంది.
అయినా ఇటువంటి విషయాల్లో మనం వెనక్కి చూడడం, వాటి నుంచి పాఠాలు నేర్చుకోవడం మర్చిపోయి చానాళ్లు అయింది. సందర్భం ప్రజాహితం అయినప్పుడు, మన ఇతిహాసాల్లో కూడా జలాలు పక్కకు తప్పుకుని మరి దారి ఇచ్చాయి. అలాగే అది ఉగ్రంగా ప్రకోపించిన సందర్భాలు ఉన్నాయి. శ్రీరామునికి లంకాపురం వెళ్ళడానికి సముద్రుడు త్రోవ ఇచ్చినట్టే, శిశువైన శ్రీకృష్ణునికి యమున దారి ఇచ్చింది. ఈజిప్టు ఫరో వద్ద బానిసలుగా బందీలో ఉన్న యూదు ప్రజలను విడుదల చేసి తీసుకువస్తున్న మోజెస్ కు ఎర్ర సముద్రం మధ్యకు చీలి మరీ దారి ఇచ్చింది, వాళ్ళను వెంటాడిన ఈజిప్టు సేనల్ని ముంచింది. అయినా జలాలు నుంచే సృష్టి పుట్టింది అనేది సైన్స్ కూడా అంగీకరిస్తున్న సూత్రం.
ఇప్పుడు బెజవాడ మునగడం అయ్యాక, బిక్కచచ్చి ఇంతకీ జరిగింది ఏమిటి? అని చూసుకుంటే, కొత్తగా జరిగింది ఏమీ లేదు. కురిసిన కుంభవృష్టితో ఎప్పటిలా కృష్ణానది దానికి ఇరువైపులా వున్న బుడమేరు తమ్మిలేరు కొండవీటి వాగు, పాలవాగు వంటివి ఇంకా ఎన్నో చిన్నచిన్న వాగులు తమ సహజ మార్గాల్లో మరోసారి ప్రయాణించి, పని పూర్తయ్యాక అవి నిష్క్రమించాయి. తెలుగువారు రెండుగా విడిపోయి ఈ భూమిపై ఒక రాజకీయ విభజన రేఖను గీచుకున్న విషయం ఈ ప్రవాహాలకు తెలియదు. ఇప్పుడు మనం చెప్పినా వాటికి అర్ధం కాదు కనుక సరిహద్దున ‘టోల్ గేట్లు’ వద్ద అది ఆగదు.
‘రిసీవింగ్ ఎండ్’
ఆంగ్లంలో ‘రిసీవింగ్ ఎండ్’ అనే పదప్రయోగం ఒకటి ఉంది. వాడుకలో దానికి సరైన తెలుగు లేదు. మనకంటే పైన ఉంటూ మనకు ఇచ్చేవాడి చేతుల క్రింద, దాన్ని దోసిలి పట్టేవాని చేతులు అనే అనివార్యతను సూచించే పద ప్రయోగమది. ఇండియా ‘మ్యాప్’లో నైసర్గికంగా తూర్పున సముద్రం తీరాన వున్న ఆంధ్రప్రదేశ్- నైరుతి, పశ్చమ, వాయువ్యం ఇలా ఈ మూడు దిక్కుల నుండి వర్షాకాలంలో వరద పేరుతొ జరుగుతున్న ‘డిశ్చార్జి’కి, మనకు ఇష్టం వున్నా లేకున్నా దోసిలి పట్టడం తప్ప మరొక ‘ఆప్షన్’ లేదు. దక్షణాన పెన్నా నుంచి ఉత్తరాన వంశధార వరకూ ఇదే వరస.
అందుకని రెండు తెలుగు రాష్ట్రాలు కృష్ణ-గోదావరి మొదలయ్యే మహరాష్ట్ర వంటి చోట జరుగుతున్న వాతావరణ మార్పులు వర్షపాత నమోదు వంటి ‘డేటా’ దగ్గర పెట్టుకుని, దాన్ని క్షుణ్ణంగా ‘స్టడీ’ చేసి అప్పుడు నగరాల నిర్మాణం వంటి శాశ్విత ప్రణాళికలు గురించి ఆలోచించాలి. సంపద సృష్టి మంచిదే, కానీ అది మన ప్రాధాన్యతలను హరించకూడదు. ఇటువంటి భౌగోళిక అనివార్యతల మధ్య జీవించవలసి ఉన్నప్పుడు, పాలకులకు నిజాయితీ అవసరం. అయితే, మన దృష్టి అందుకు భిన్నంగా ఉంది.
ఎపి రాజధాని ప్రాంతం కోసం ప్రత్యామ్నాయాలు సూచించడానికి విజయవాడ వచ్చిన శివరామ కృష్ణన్ కమిటి సభ్యులు ఇక్కడివాళ్ళు కాదు కనుక, ‘ఇండియా’ వొక యూనిట్, అందులో ‘ఎపి’ ఒక ఉప-యూనిట్ అనే ప్రాతిపదికన వాళ్ళు దీన్ని అంచనా వేసారు, అదే విషయం వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి తమ నివేదిక ద్వారా చెప్పారు. ఆ బృందంలో ప్లానింగ్, పాలసీ నిపుణులు కాకుండా డైరక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్మెంట్ ఆరోమర్ రెవి కూడా ఉండేట్టుగా అప్పట్లో కేంద్ర హోమ్ శాఖ జాగ్రత్తలు తీసుకుంది. మానవ జీవనానికి ప్రభుత్వం ఎటువంటి విలువ ఇవ్వాలో స్పష్టం చేసిన ఎంపిక ఇది.
ఇటీవల భారత ప్రభుత్వంలో కార్యదర్శిగా పనిచేసిన రిటైర్డ్ ఐ.ఏ.ఎస్. అధికారి ఇ.ఏ.ఎస్. శర్మ 2024 అక్టోబర్ మొదటివారంలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి పంపిన లేఖలో అదే విషయం రాసారు. మనం స్థానికులం కనుక, మన రాష్ట్రం పట్ల శ్రద్ద కొద్దీ ఇప్పటికీ ఇటువంటి బాధ్యత కలిగిన మాజీ అధికారులు ఇలా ప్రభుత్వాల వైఖరి పట్ల తమ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ‘రాబోయే ముప్పై నెలల్లో 50,000 కోట్లు అమరావతి కోసం ఖర్చు చేస్తున్నాము అంటూ మంత్రులు ప్రకటనలు ఇస్తున్నారు, అలాగైతే మరి మిగతా రాయలసీమ, ఉత్తరాంధ్ర పరిస్థితి ఏమిటి?’ అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. నిజానికి రాష్ట్ర విభజనకు దారితీసిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికలో ఈ రెండు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి విషయంలో ప్రత్యెక శ్రద్ద అవసరం అన్నారు.
అయినా విభజన జరిగిన ఆరు నెలల్లో రాజధాని స్థల ఎంపిక కోసం హోం శాఖ శివరామ కృష్ణన్ కమిషన్ వేస్తే, దాన్ని ఇప్పటివరకు అధికారంలో వున్న ఏ ప్రభుత్వం దాన్ని ఖాతరు చేయకపోవడం ఏమిటని? శర్మ ప్రశ్నిస్తున్నారు. ఇక్కడే గత వారం జైలుకు వెళ్ళిన సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్ ప్రస్తావన వస్తున్నది. ఆయన్ని ‘అమరావతి’ ప్రాజెక్టులో భాగస్వామి చేయడం ఎటువంటి తడబాటుతో ఇక్కడ మొదలయిందో, ఆయనకు సింగపూర్ లో జైలు శిక్ష పడిన తర్వాత అయినా మనం గుర్తు చేసుకోవడం అవసరం.
అందరూ మర్చిపోయిన ఈ సంగతి జరిగింది, 12 జనవరి 2015న. ఆ రోజు ఈశ్వరన్ హైదరాబాద్ సెక్రటేరియట్ లో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసారు. అక్కడ నుంచి ఇద్దరూ వైజాగ్ వెళ్ళారు. బాబుకు అప్పటికే ‘అమరావతి’ ప్రాంతంలో రాజధాని కట్టాలని ఉంది. ఆ ప్రాంతం ఈశ్వరన్ కు చూపించాలని బాబుకు బలంగా మనస్సులో ఉంది. కానీ దాన్ని ‘ఓపెన్’గా బయటకు చెప్పడానికి జంకు. దాంతో వైజాగ్ నుంచి గన్నవరం వచ్చి, తన మనస్సులో ఉన్నది ఎలా పూర్తిచేయాలా? అని ఆ రోజు బాబు పడిన మల్లగుల్లాలు, కృష్ణా గుంటూరు జిల్లాల కలెక్టర్లను ఆ రోజు ఆయన పరుగులు పెట్టించిన తీరు అప్పట్లో ఆశ్చర్యం కలిగించింది.
అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ సందర్శన అవలీలగా జరిపిన బాబు ‘అమరావతి’ భూముల్లోకి కాలుపెట్టడానికి ఎందుకు ఇంతలా సందేహంతో ఉన్నారు? అనేది పరిశీలకుల ద్వారా చరిత్రలో అయితే ‘రికార్డు’ అవుతుంది. ఆ రోజు ఒంటిగంటకు గన్నవరం వచ్చి ‘ఏరియల్ సర్వే’ అనుకున్నారు. విమానాశ్రయం, హోటల్ వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. తుళ్ళూరు గ్రామస్తులను కలిసి వాళ్ళతో ముచ్చటిస్తారు అన్నారు. నది వెంట కరకట్ట రోడ్డులో వెళుతూ చూస్తారు అన్నారు. బస్సు కాదు, మినీ వ్యానులు అన్నారు. కాదు కనకదుర్గ గుడి కొండమీద నుంచి ‘బైనాక్యులర్స్’తో ఆ ప్రాంతాన్ని చూస్తారు అన్నారు. చివరికి మధ్యాహ్నం 3-4 మధ్య గన్నవరం విమానాశ్రయంలో ఉదయం నుంచి కనిపెడుతున్న వారిని అక్కడే బాబు ఈశ్వరన్ బృందానికి పరిచయం చేసి, చంద్రబాబు అక్కణ్ణించి కుప్పం సంక్రాంతి పండగ చేసుకోవడానికి వెళ్ళిపోయారు. ఈశ్వరన్ సింగపూర్ వెళ్ళిపోయారు.
ఆ తరవాత శంకుస్థాపన జరిగినా ఇలా అప్పుడే పదేళ్ళు అయిపోయాయి. ఇన్నాళ్ళ తర్వాత కూడా తాత్కాలిక భవనాలు తప్ప అక్కడ ఏమీ లేవు. అయినా మరోసారి బాబు ‘అమరావతి’ అంటున్నారు. ఇంతలో ఒకప్పటి మన ‘వి.ఐ.పి.’ ఈశ్వరన్ జైలుకు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ మాత్రం తన రాజధాని ‘అడ్రెస్’ కోసం ఇంకా వెతుక్కుంటూనే వుంది.