
తెలుగు రాష్ట్రాల మీద చెన్నై డీలిమిటేషన్ మీటింగ్ ప్రభావం ఉంటుందా?
దక్షిణాది సీట్లపై పునర్విభజన కత్తి- చెన్నై సమావేశం
-తెలకపల్లి రవి
రాజ్యాంగ బద్దంగా జరగాల్సిన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన రాజకీయ విభజనగా మారిపోయిందా? ప్రధాని నరేంద్రమోడీ సర్కారు అంతా రాజ్యాంగబద్దంగా పద్ధతి ప్రకారమే జరుగుతున్నట్టు నమ్మించేందుకు చాలా ప్రయత్నాలు చేసినా ఫలితం కలగడం లేదా? వరుసగా జరిగే పరిణామాలు అదే చెబుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇప్పటికే దీనిపై రాష్ట్ర స్థాయి సమావేశం జరగ్గా తమిళనాడు ముఖ్యమంత్రి సా ్టలిన్ మార్చి 22న జాతీయ స్థాయిలోఅఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు.హోం మంత్రి అమిత్ షా ఎవరి సీట్లు తగ్గబోవని ప్రకటించారు గానీ సిఎంలు చాలామంది ్డ ఆ హామీని విశ్వసించడానికి సిద్ధంకాలేదు ఇది దక్షిణాదిపై బిజెపి కేంద్ర ప్రభుత్వ రాజకీయ కుట్రగా కొందరు ఆరోపించారు కూడా.
కేంద్రం ఏకపక్షంగా పునర్విభజన చేయడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతందనే ఆందోళన చాలా వుంది.కేరళ,తెలంగాణ,కర్ణాటక ముఖ్యమంత్రులు పినరాయి విజయన్, రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య స్టాలిన్ పిలిచే సమావేశానికి హాజరవుతున్నట్టు ప్రకటించారు. ప్రత్యేకత ఏమంటే వైఎస్‌ఆర్‌పార్టీ అధినేత జగన్‌నూ, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించడం. ఒరిస్సా బిజెపి ముఖ్యమంత్రి మాజీని, బెంగాల్ తృణమూల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఇంకా ఆప్ వంటి పలు రాజకీయ పార్టీల అధినేతలను కూడా కూడా పిలిచారని చెబుతున్నారు. ఇండియా వేదిక 2024 ఎన్నికలతో ముగిసిపోయిందని సిపిఎం సమన్వయ కర్త ప్రకాశ్ కరత్ చెప్పిన నేపథ్యంలో -రాజకీయ చర్చకాకపోయినా రాజ్యాంగ అంశంపై జరిగే ఒక విస్త్రతమైన రాజకీయ సమీకరణ వేదికగా ఈ సమావేశం దేశమంతటినీ ఆకర్షిస్తున్నది,
చెన్నై సమావేశం ఇంకా జరగకముందే బిజెపి, దాని భాగస్వాములైనజనసేన వంటివి ప్రత్యక్షంగా టిడిపి పరోక్షంగా దాడి చేస్తున్నాయి. బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపి లక్ష్మణ్ దేశాన్ని విభజించే రాజకీయాల కోసం చెన్నైలో కాంగ్రెస్ బిఆర్‌ఎస్ కలసి కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ఈ దేశం ఏమైనా కేక్‌లా కోసుకుతినడానికా అంటూ ఎపి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం జయకేతనం సభలో చేసిన వ్యాఖ్య ఇందుకు పరాకాష్ట. ముఖ్యమంత్రి చంద్రబాబు విషయానికి వస్తే నియోజకవర్గాలు తగ్గుతాయనేది కేవలం వూహాగానంగా వుందంటూ దాటవేశారు.మళ్లీ ఆయనే 2029 నాటికి మహిళా రిజర్వేషన్ కింద ఎపి శాసనసభలో 70 స్థానాలు పెరుగుతాయని సభ సాక్షిగావూహించి చెప్పారు. లోక్‌సభలో పెరగకుండా శాసనసభలో మాత్రమే పెరిగే అవకాశముండదని వేరే చెప్పనవసరం లేదు.దక్షిణాదికి ఒక్కసీటు కూడా త గ్గబోదని హోంమంత్రి అమిత్ షా మాటలను వారు ప్రస్తావిస్తున్నారు. కానీ ఇక్కడ తగ్గకపోయినా అ క్కడ పెరిగితే కథ మళ్లీ మొ దటికి వస్తుంది కదా?అన్నది ప్రశ్న. బిజెపితో అనుకూలంగా వుండే జగన్ కూడా తమ ఎంపిల సమావేశంలో ఈ అంశంపై పూర్తి చర్చ తర్వాతే నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.
చెన్నై సమావేశానికి తాము సీనియర్ నేతను పంపడమో లేదంటే మద్దతు తెల్పుతూ లేఖ రాయడమో చేస్తామని ఆ పార్టీ పార్లమెంటరీ నేత మిథున్‌రెడ్డి వెల్లడిరచారు.అదే సమయంలో అమిత్‌షా మాటలు సరైన దిశలో వున్నాయని కూడా ఆయన వ్యాఖ్యానించడం విశేషం! బిఆర్‌ఎస్ తాను హాజరవుతానని కెటిఆర్ ప్రకటించారు. ే రేవంత్ సర్కారుకు సంస్కారం లేదనీ, స్టాలిన్‌కు సంస్కారం వుంది గనక పిలిచారని మొ దట్లో వ్యాఖ్యానించారు. తర్వాత పిలిచిన సమావేశానికి మాత్రం రాకుండా డాటేశారు. ఈ అంశంపై రాష్ట్ర సర్కారుకు స్పష్టత లేదనీ, దాని పరిధిలోది కాదని తల్చేశారు, తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పరిస్థితి కూడా ఈ దక్షిణాది సమ్మేళనంలో ఎలా వ్యక్తమవుతుందనేది మరో కోణమైనా మాత్రం నియోజకవర్గాల పునర్విభజన ఎందుకు సమస్యగా మారిం దనేది కీలకాంశం.
1973 వరకూ జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన చేసేవారు. ఎమర్జన్సీలో తె చ్చిన 42వ రాజ్యాంగ సవరణలో నియోజకవర్గాల పునర్విభజన స్తంభింపచేసి ,జనాభా నియంత్రణపై ప్రత్యేక కేంద్రీకరణ పెట్టారు. జనాభాను తగ్గించే చర్యల కోసం రాష్ట్రాలను ప్రోత్సహించారు.అప్పటికి దక్షిణాది రాష్ట్రాలలో 6 నుంచి 10 శాతం పెరుగుదల వుంటే ఉత్తరాదిన మధ్య పదేశ్ రాజస్థాన్,యుపి బీహార్‌లలో 12 నుంచి పదిహేనుశాతం వుండిరది. కనుక జనాభా నియంత్రణ చర్యలు వేగవంతంచేయాలనీ ఇరవైఏళ్ల తర్వాతనే పునర్విభజన చేపట్టాలని నిర్ణయించారు.ఈ సమయంలో జనాభాతగ్గితే సీట్లు తగ్గించడం సరికాదు గనక పార్లమెంటుస్థానాల సంఖ్యను 2001వరకూ స్తంభింపచేశారు. కనుకనే సీట్ల స్వరూపంలో అనేక మార్పులు జరిగినా మొత్తం సంఖ్యలో మార్పు రాలేదు. మరోవైపున నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను 2026 వరకూ వాయిదా వేస్తూ 2002లలో 84వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొచ్చారు,ఈ కాలంలో ఉత్తర దక్షిణ రాష్ట్రాల జనాభాలో హెచ్చు తగ్గులు తీవ్రమైనాయి.
1976 తర్వాతకాలంలో దక్షిణాది రాష్ట్రాలైన కేరళ,తమిళనాడు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్, తర్వాత ఎపి తె లంగాణలు జనాభా తగ్గింపులో గణనీయమైన ముందంజ వేశాయి. తమిళనాడులో సంతానోత్పత్తి రేటు 2001 నాటికే 2.0గా వుంది.అంటే జనాభా స్థిరీకరణ దశకు చేరిందని అంచనా వేశారు. అదే బీహార్ యుపిలను తీసుకుంటే యుపిలో 30 శాతం, బీహార్‌లో 42శాతం పెరిగే అవకాశముంది. అమిత్ షా ప్రకటనను మేరకు ్త 2026లో పునర్విభజన ప్రక్రియ చేపట్టడం తథ్యంగా కనిపిస్తుంది.కానీ 2021లో జరగాల్సిన జనాభా లెక్కలూ తీయలేదు ఇప్పుడు జనాభాను బట్టి సీట్లు నిర్ణయించేట్టయితే తక్కువ జనాభావున్న దక్షిణాదిన సీట్లుతగ్గి, చాలాఎక్కువగా వున్న యుపి బీహార్ వంటివాటికి ఇంకా పెరుగుతాయి.
సగటు జనాభాను చూస్తే వేరే తేడాలుంటాయి. ఉదాహరణకు నాలుగు కోట్ల జనాభా వున్న తెలంగాణకు 17 లోక్‌సభ సీట్లున్నాయి. 12.6 కోట్ల జనాభా వున్న బీహార్‌కు 40 సీట్లున్నాయి. సగటున తెలంగాణకు 23లక్షలమందికి ఒక సీటు వుంటే బీహార్‌లో సగటున 32 లక్షల మందికి ఒక సీటువున్నట్టు లెక్క. జనాభా నుబట్టి దామాషా ప్రాతిపదికన పెంచేట్టయితే ఆ ఫార్ములాను బట్టి ఈ తేడా ఇంకా విపరీ తంగామారొచ్చు.అంటే ఇక్కడ ఒకటిపెరిగితే అక్కడ నాలుగు పెరుగుతాయి.
ఎపి తెలంగాణ విభజన తర్వాత తమిళనాడుకే దక్షిణాదిన అత్యధికంగా 39 స్థానాలున్నాయి.దేశ వ్యాపితంగా చూస్తే అది అయిదో స్థానంలో వుంది.ఏకపక్షంగా పునర్విభజన జరిపితే దానికి 7,8 స్థానాలు తగ్గిపోతాయి.11వరకూ తగ్గొచ్చని మరో లెక్క కూడా వుంది, జనాభాకు తగినట్టు సీట్లు పెంచాలంటే బీహార్,యుపి వంటిచోట్ల సంఖ్య రెట్టింపవుతుంది.ఈ పెంపు జనాభా తగ్గింపునకు కృషి చేయనందుకు బహుమానమా అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.సీట్లు తగ్గవని అమిత్ షా హామీ ఇస్తున్నారు గానీ అవతలివైపున పెరుగుదల ఏ స్థాయిలో వుండేది చెప్పడం లేదు, ఒక లెక్క ప్రకారం ఉత్తరాది రాష్ట్రాలకు 32 స్థానాలు పెరిగితే దక్షిణాదిన 24 తగ్గుతాయి.కేరళకు 20లో ఆరునుంచి ఎనిమిది కోల్పోవలసి రావచ్చంటున్నారు.ఉ త్తర ప్రదేశ్‌కు 80 నుంచి 91కి చేరతాయి.బీహార్‌కు పది పెరగ్గా ఎంపి,రాజస్థాన్ కూడా గణనీయమైన పెరుగుదల వుంటుంది.
1977లో సగటున ఒకో ఎంపి 10.11 లక్షల ఓటర్లకు ప్రాతినిధ్యంవహించేవారు. ఇప్పుడు కూడా అదే తరహాలో 10.11 లక్షల మందికి ఒకరి చొప్పున నిర్ణయించేట్టయితే ప్రస్తుత జనాభా ప్రకారం 1400 మంది లోక్‌సభ సభ్యులవుతారు. ఆ ప్రకారం యుపి బీహార్ ల సభ్యుల సంఖ్య మూడంతలు పెరుగుతుంది.తమిళనాడు కేరళ వంటివి రెండిరతలే పెరుగుతాయి. కొత్త పార్లమెంటులో 888 మంది సభ్యులకు చోటు కల్పించారు.కనుక పాత నిష్పత్తి ఫార్ములా చెల్లుబాటు కాదు.ఇదే గాక - మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించినప్పుడు వారికి రిజర్వు చేసిన మూడోవంతు స్థానాలను అదనంగా కలపాలని తీర్మానించారు.కనుక ఈ రెండు కోణాల్లోనూ సీట్ల సంఖ్య పెంచడమనేది కీలకాంశంగా వుంటుంది.
2011- 2021 మధ్య వీటి మధ్య జనాభా తేడాలలో సీట్లలో సమత్వం రాలేదని మాజీ ఎన్నికల ప్రధానాధికారి ఓపిరావత్ ఒక సందర్భంలో చెప్పారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల తగ్గింపు అనేది వూహాజనితమైన ప్రశ్న అని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారు గానీ పినరాయి విజయన్ దీనిపై స్పష్టమైన ప్రకటనే చేశారు. కేంద్ర వి ధానం రాజ్యాంగబద్దంగా శాస్త్రీయంగా వుండాలని పినరాయి తన ప్రకటనలో సూటిగానే కోరారు.
ముందు మీ పునర్విభజన ప్రాతిపదిక ఏంటో చెప్పి సీట్ల విషయంలో న్యాయం జరిగేలా హామీ కల్పించి తర్వాతే అడుగు ముందుకేయాలన్నారు. పినరాయి అడిగినట్టు ప్రస్తుత సీట్ల నిష్పత్తిని కాపాడతారా లేక జనాభా నిష్పత్తిని కాపాడతారా? ఇందులో ఏది పాటించినా సీట్లు తగ్గుతాయి.ప్రస్తుత నిష్ప్‌త్తిని పాటించినా నష్టం తప్పదు. ఎందుకంటే 1952లో అప్పటి దక్షిణాది రాష్ట్రాల సీట్ల వాటా లోక్‌సభలో 25.35శాతం వుంటే 1967 నాటికి అది 24.13శాతానికి తగ్గింది.1977లో వున్నవాటిని స్తంభింపచేసేనాటికి ఈ వాటా 23.85శాతానికి దిగజారింది. మామూలుగానే ఇంత తగ్గుదల కనిపిస్తుంటే ఇప్పుడు పెద్ద ఎత్తున జరిగిన జనాభా తగ్గింపు తర్వాత ఇది మరీ కోతపడటం అనివార్యం.
కనుక ఇదేదో సీట్లు పార్టీల సమస్యగా చూస్తే పొరబాటు.దేశవ్యాపిత విధానాలు రూపొందించే పార్లమెంటులో రాష్ట్రాలకు అ ందులోనూ పెద్ద భాగంగా వున్న మొత్తందక్షిణాదికి తగు ప్రాతినిధ్యం లేకపోతే నష్టం కలుగుతుంది. దేశ సమైక్యతా భావనా దెబ్బతింటుంది.శుష్క నినాదాలతో అధీకృత దేశభక్తి భంగిమలతో తేలేది కాదు. నిజమైన సమాఖ్య భావనతో రాజ్యాంగ స్పూర్తితో ప్రజాస్వామిక అవగాహనకు రావాల్సి వుంటుంది. ప్రతిజనాభా లెక్కల తర్వాత పార్లమెంటు నిర్ణయం మేరకు రాష్ట్రపతి ఆదేశాలతో నియోజకవ ర్గాల పునర్విభజన జరగాలని మాత్రమే రాజ్యాంగం చెబుతున్నది.ఇప్పుడు జనాభా తగ్గించిన రాష్ట్రాలకు నష్టం జరగకూడదంటే ఆ మేరకు నిర్దిష్టమైన కొత్త కొలబద్దలు కావాలి.వాటిపై రాష్ట్రాలతో వివరమైన చర్చ జరగాలి. అవేవీ లేకుండానే అమిత్ షాతో సహా కేంద్ర పెద్దలు ఏకపక్షంగా మాట్లాడటం సందేహాలు పెంచుతున్నది. కేంద్రం ఏకపక్ష నిర్ణయాల నేపథ్యం,దక్షిణాన బిజెపి బలం బాగా తక్కువ కా వడం, ఈ సందేహాలను తీవ్రం చేస్తుంది.ఈ సమయంలో ప్రజాస్వామికంగా పారదర్శకంగా చర్చించి సమతుల్యత కాపాడుకోవడం దేశ సమైక్యతకు కీలకమవుతుంది,ఈ మేరకు దక్షిణాది రాష్ట్రాల సమావేశం ఎలాటి దిశానిర్దేశం చేస్తుందో చూడాలి.