‘పవర్స్’ లేని పంచాయతీలొకవైపు, ‘పవర్ సెంటర్’ అమరావతి ఇంకో వైపు
x

‘పవర్స్’ లేని పంచాయతీలొకవైపు, ‘పవర్ సెంటర్’ అమరావతి ఇంకో వైపు

‘ఫ్యూచర్ ఇండియా’ దృష్టితో ఎపిని చూడడం అంటే...?.

ఎనభై దశకం స్థానిక సంస్థల పాలనలో- ‘విభజన’ అవసరతను గుర్తించి తొలి ప్రాంతీయ పార్టీగా ఎన్టీఆర్ టిడిపి- తాలూకా, పంచాయతీ సమితులను 1985 నాటికి మండలాలను చేసింది.

అటువంటిదే 1992 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం దేశమంతా తెచ్చిన- ‘మూడు అంచెల’ పంచాయతీరాజ్ వ్యవస్థ. ఇది జరిగిన 27 ఏళ్ల తర్వాత రాష్ట్ర విభజన జరిగిన ఐదేళ్లకు అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం 2019 నాటికి 15 వేల గ్రామ సచివాలయాలు ఏర్పాటుచేసి; 536 రకాల సేవలను పంచాయతీ స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. అది ‘కరోనా’ కాలంలోనే ఏప్రెల్ 2022 నాటికి 13 జిల్లాలను విభజించి వాటిని 26 చేసింది. పై మూడు సంస్కరణలు పాత నిర్మాణాల పునాదులను కదిల్చినవి, శాశ్వతమైనవి. అయితే, చంద్రబాబు టిడిపి 1995 అక్టోబర్ 2 నాటికి తెచ్చిన- ప్రజల వద్దకు పాలన కేవలం అది ఒక- ‘కేలండర్ ఈవెంట్’ కావడంతో అది పాలనా నిర్మాణాలను కదల్చలేక పోయింది. ‘ఈవెంట్స్’కు ఉండే పరిమితులు అటువంటివి.

గత ప్రభుత్వంలో గ్రామ సచివాలయాల రాకతో ప్రతి 50 కుటుంబాలకు అనుబంధంగా ఒక ‘వాలెంటీర్’ ఉండడం వల్ల, పరిపాలనలో తదుపరి దశలో జరగాల్సిన జిల్లాలు వారీ మానవీయ (‘డెమోగ్రాఫిక్’) ప్రాకృతిక (‘నేచురల్’) వనరుల గుర్తింపు (‘మ్యాపింగ్’)కు; వాటి సమన్యాయ పంపిణీకి ఆస్కారం కలిగేది. కానీ అదనంగా ‘కోవిడ్’ బాధ్యత ఆ ప్రభుత్వం మీద పడింది.

అలా జరగకుంటే, సూక్ష్మస్థాయిలోకి ‘రాజ్యం’ (‘స్టేట్’) ప్రవేశం పూర్తి అయిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయ్యుండేది. కానీ అందుకు తగిన వ్యవధి మిగిలిన మూడేళ్లలో ఆ ప్రభుత్వానికి చాలలేదు. అయితే అందుకు భిన్నంగా ఇప్పుడు కడుతున్న- ‘వరల్డ్ క్లాస్ కేపిటల్’ నుంచి పాలన అనేది- ‘కేంద్రీకృత’ విధానం. రెండు భిన్న ధోరణులు. అలాగని గతంలో జరిగిన కసరత్తు మొత్తాన్ని ఇప్పుడు ‘రివర్స్’ చేయడం అవుతుందా అంటే, అది కష్టంగా కనిపిస్తున్నది.

పదేళ్ళ క్రితం ఒక ‘నెరేటివ్’గా జనాల్లోకి వెళ్ళిన, ‘కట్టుబట్టలతో ఇవతలకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు’ ఇకముందు ఎందుకు ఇది విషయం అవుతుందో ముందుగా చెప్పాలి. “సామాన్యులను పాలనలో భాగం చేస్తూ అమలు కావలసిన పరిపాలన, రాష్ట్ర రాజధానిలో కాదు, అది జిల్లా కేంద్రీతంగా ఉండాలి” అంటూ ఒక కొత్త పరిపాలనా మోడల్- ‘ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్’ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ డా. రుచి గుప్తా ఒక సాధికారిక పరిశోధనా పత్రంలో గణాంకాలతో సహ వెల్లడించారు. ఇది- మన దేశ కాలేజీల్లో యువతను పలు అంశాలలో ‘అడ్రెస్’ చేస్తున్న ‘హై ఎండ్ థింక్ ట్యాంక్’ సంస్థ. దాంతో ఈమె ప్రతిపాదించిన కొత్త వెలుగులో పదేళ్ళ ఏపీలో జరుగుతున్న పరిపాలన సంస్కరణలలో సామాన్యుల స్థానం ఎక్కడ ఉందో మనం ఇక్కడ వెతకవలసి వచ్చింది. మనకు కూడా ఏదైనా ‘పబ్లిక్’ విషయం సమీక్ష అంటే చాలు, మన ‘మైండ్ సెట్’ రాజకీయ పార్టీలు చుట్టూ తిరగడం అలవాటు. దాంతో- అదెప్పుడూ పైపైన ఉంటూ ఉపరితలాలు దాటి లోపలికి పోదు.

కనుక ఇది అందుకు భిన్నంగా చూడాల్సిన విషయం అనేది ముందుగా మనస్సులో ఉంచుకోవడం అవసరం. మన దేశ జనాభాలో 85 శాతం మంది వాళ్ళు పుట్టిన జిల్లాల్లోనే జీవిస్తున్నారు, వీళ్లల్లో 65శాతం మంది 35 ఏళ్ల లోపు యువత. అయితే నగరాలు 3 శాతం భూమిని ఆక్రమించి, 60 శాతం జీడీపీ ని తమ ఖాతాలో వేసుకుంటున్నాయి. ప్రభుత్వం ప్రజల చేతుల్లో నగదు ఉండేట్టుగా చూస్తున్నా; అసంఖ్యాకమైన ఈ యువతకు- ఉత్పత్తి, వినియోగం, ఆవిష్కరణలు అందుబాటులో లేవు.

మనదేశంలో అందుకు ప్రధాన కారణం కేంద్రీకృతమైన నిర్ణయాలు. ఎన్నికవుతున్న ప్రజా ప్రతినిధులు ప్రజల ఆకాంక్షలను విస్తృత ప్రజాహితం కోసం ఒక విధానం రూపంలో ‘రాజ్యం’ వద్దకు చేర్చడం కాకుండా, కేవలం వాళ్ళు వ్యక్తిగత సమస్యల పరిష్కర్తలుగా మాత్రమే మిగులుతున్నారు. అందువల్ల పాలసీలలో నిర్మాణపరమైన మౌలిక మార్పులకు ఆస్కారం లేకుండా అయిపోయి; వాగ్ధానాలకు వాటి ఆచరణకు మధ్య పొంతన ఉండడం లేదు. ప్రభుత్వం ఎంత ప్రయాసపడినా పైకి కనిపించని రాజకీయ అలసట అసహనం పౌరులలోనూ, ప్రజా ప్రతినిధుల లోనూ కొంచెం కూడా తగ్గడం లేదు.

దీన్ని ‘అడ్రెస్’ చేయడానికి గాను మన యువత నివసిస్తున్న జిల్లాల్లో కనుక పనిని ప్రారంభిస్తేనే, దేశం రూపాంతరం చెందుతుంది అంటున్నారు డా. రుచి గుప్తా. అయినా మొదటి నుంచి మనది జిల్లా కేంద్రీత పరిపాలన అయినప్పటికీ, ప్రజల అనుభవం ఏమంటే అది- ‘బ్యూరోక్రసీ’ ఆధిపత్య కనుసన్నల్లో, పౌరసమాజ ప్రమేయం లేకుండా సాగే పంపిణీ వ్యవస్థ.

ఇందులోకి యువత నిమగ్నం అయ్యేట్టుగా చేయడం అంటే, జిల్లా అనేది కేవలం పరిపాలనా యూనిట్ కాకుండా, దాన్ని సామాన్యుల ప్రజాస్వామ్య కేంద్రం చేయడం ఒక్కటే పరిష్కారం అవుతుంది. అవకాశాలు వచ్చేది వాటిలో నుంచే కనుక, పెట్టుబడులలో జిల్లాల మధ్య చూపుతున్న తేడాను కూడా గమనించాలి; అవి సమ పంపిణీ జరిగేట్టుగా చూడాలి. అది, ‘అక్కడి శిష్ట వర్గాలకు తమ అంతర్యాలను ఆచరణలోకి తెచ్చే సదవకాశం’ అంటారు డా. రుచి గుప్తా.

అలా జరిగినప్పుడు అధికారాలు వివిధ సమూహాల మధ్య పంపిణీ జరిగి, మనవి లోతైన ప్రజాస్వామ్యయుత సమాజాలుగా పరివర్తన చెందుతాయి, జవాబు దారీతనం పెరుగుతుంది. విధానాల రూపకల్పన క్రియాశీలంగా వాస్తవవికతలో ప్రతిఫలిస్తుంది. ఇండియాలో జిల్లాల మీద దృష్టి కేంద్రీకరించినప్పుడు, జాతీయాభివృద్దితో పాటు ప్రజాస్వామ్య ప్రాధమిక సూత్రాలు పునరుద్దరించబడతాయి. “జిల్లాలను ‘ప్రజాస్వామిక యూనిట్లు’గా గుర్తించడంలో మనం విఫలం అయినప్పుడు, మన జనాభాలోని మానవ వనరులను వృధా చేసుకోవడమే కాకుండా, మొత్తం ప్రజాస్వామ్యాన్ని ఒక డొల్లగా మార్చడమే అవుతుంది” అంటున్నారు డా. రుచి గుప్తా.

మనది కొత్త రాష్ట్రం దీని ‘మ్యాప్’ కొత్తది కనుక, ఈమె చేసిన ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ కు అనువర్తింప చేయడానికి కనిపిస్తున్న గత పదేళ్ళ పరిణామాలను చూసినప్పుడు, విభజన తర్వాత మొదటి ఐదేళ్లు, మళ్ళీ ప్రస్తుత ‘కూటమి’ పాలనలోనూ ప్రాధాన్యత అమరావతి కేంద్రీత దృష్టితో ఉంది. ఇది కేంద్రీకృత దృష్టి అని మళ్ళీ విడిగా చెప్పాల్సిన పని లేదు. ఇక వైసీపీ ప్రభుత్వం ‘కోవిడ్’ కాలంలో- ‘వర్క్ ఫ్రమ్ హోం టౌన్’ అనే పిలుపు ఇచ్చింది. యువత అంతర్గత మనోభావాలను తట్టే ‘కాల్’ ఇది. విపత్తు కాలంలో అది ఎంతమేర వాస్తవంలో జరిగింది అనేది అలా ఉంచితే, ఏ ప్రభుత్వం అయినా విధిగా గుర్తించాల్సిన అంశమిది.

ఇక జిల్లాలు వాటి ‘మ్యాపింగ్’ అన్నప్పుడు, కనిపించేవ అంశాలు కొన్ని చూద్దాం. 1. కొత్త జిల్లాలు ప్రకటించక ముందు 2021 నవంబర్ లో అప్పటి విజయనగరం జిల్లాకు ఒరిస్సా సరిహద్దుల్లోని 16 ‘కొటియా’ గిరిజన గ్రామాలు మన రాష్ట్రంలో కలిపే విషయమై, ఒరిస్సా సిఎం నవీన్ పట్నాయక్ వద్దకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కలిసి మాట్లాడాక, 2022 ఏప్రెల్లో కొత్త జిల్లాలు ప్రకటించారు. 2. విజయనగరం నుంచి పార్వతీపురం మన్యం జిల్లాను వేరు చేశాక, తొలి ఏడాదే ఆ జిల్లా మొదటి కలెక్టర్ నిశాంత్ కుమార్ మాతాశిశు మరణాలు నిరోధించి- ‘ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ -2023’ అందుకున్నారు. 3. ఏలూరు జిల్లా అయ్యాక, దాని తొలి కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్- ‘హోలిస్టిక్ డెవలప్మెంట్’ కేటగిరీలో ‘ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ -2023’ అందుకున్నారు. పరిపాలన సూక్ష్మ స్థాయికి చేరడం వల్ల ఒడిస్సా, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దున ఉన్న ఏపీ జిల్లాలు జాతీయ స్థాయిలో సాధించిన ఫలితాలివి. జరుగుతున్నది ఒక్కమాటలో చెప్పాలి అంటే- ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రెండు భిన్న దృక్పధాలతో పనిచేస్తున్న ప్రభుత్వాల పాలనలో ఉంది.






Read More
Next Story