నేల చూపులు చూస్తోన్న బీఆర్ఎస్.. మేల్కొకపోతే కాలగర్భంలోకే
బీఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం కంటే కాంగ్రెస్ పార్టీని విమర్శించడంపైనే నాయకత్వం దృష్టి పెట్టింది.
(వడ్డేపల్లి మల్లేశం)
ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్‌కు మంచి గుర్తింపు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్‌ది సుదీర్ఘ ప్రయాణం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల నాటికి పూర్తిస్థాయిలో కనీసం గ్రామ కమిటీలు సైతం లేకుండానే గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చింది. 60 ఏండ్ల నాటి కల సాకారం కావడంతో సుడిగాలిలా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. 2018 ముందస్తు ఎన్నికల్లోనూ రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అయితే ఇక్కడి నుంచి బీఆర్ఎస్ కథ మరో మలుపు తిరిగింది. వరుసగా తెలంగాణ ప్రజలు రెండుసార్లు అధికారం కట్టబెట్టడం.. నియంతృత్వ విధానాలు కేసీఆర్ పాలనలో స్పష్టంగా కన్పించడం.. ప్రజా సమస్యలు పట్టించుకునే దిక్కు గానీ వినే ఓపిక గానీ నాటి పాలకులకు లేకుండాపోయింది. గులాబీ పార్టీ అగ్రనేతలకు ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. దీనికితోడు కేసీఆర్ అహంకారపూరిత మాటలతో తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత మొదలయ్యింది. అంతే మూడోసారి అధికారంలోకి వస్తామని పగటికలలు కన్న బీఆర్ఎస్ నిండా కుప్పకూలిపోయింది. ఫలితంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ తరుణంలోనే బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై నియోజకవర్గాల వారీగా సమీక్షలు పెట్టుకుంది. దీంతో అసలు కథ బీఆర్ఎస్‌కు అప్పుడే మొదలయ్యింది. సమీక్షల్లో అనేక చోట్ల క్యాడర్ నుంచి ప్రతిఘటన ఎదురయ్యింది. నేతలు, కార్యకర్తలు సమీక్షల్లో బహిరంగంగానే తమ నాయకత్వం తీరుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇన్నాళ్లూ మేం చెప్పిందే వేదం అని భావించిన గులాబీ పార్టీ అగ్రనేతల్లో ఒక్కసారిగా కలవరం స్టార్ట్ అయ్యింది. క్యాడర్ అభిప్రాయాలను ఏనాడూ పరిగణనలోకి తీసుకోలేదని, తమకు విలువ ఇవ్వకపోవడం సంగతి పక్కన పెడితే.. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై తమ అభిప్రాయం రాష్ట్రస్థాయి వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినా పెడచెవిన పెట్టారనే గగ్గోలు విన్పించింది. హరీశ్‌రావు, కేటీఆర్ సహా మాజీ మంత్రుల ముందు సైతం క్యాడర్ నాయకత్వంపై తమ అసంతృప్తిని వెళ్లగక్కింది. దీంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు అంధకారంలో పడిపోయింది. నిజానికి కేసీఆర్ చేసిన అతి పెద్ద తప్పు ఇదేననే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది.
సాధారణంగా ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే పార్టీ నిర్మాణంపై ఫోకస్ చేస్తుంది. కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం పార్టీ నిర్మాణం కంటే వ్యక్తులకే ప్రాధాన్యం ఇచ్చారని చెప్పాలి. సంస్థాగతంగా కంటే వ్యక్తిగతంగానే బీఆర్ఎస్ రాజకీయాలు నడిచాయి. నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జిలే ఏకచక్రాధిపత్యం వహించారు. అదే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని కట్టబెట్టింది. దీంతో ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు మారడంతో వ్యక్తులు హ్యాండిచ్చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయినా నేటికీ బీఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం కంటే కాంగ్రెస్ పార్టీని విమర్శించడంపైనే దృష్టి పెట్టింది. గౌరవప్రదంగా ప్రజాతీర్పును శిరసావహించకుండా కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు వ్యవహరించిన తీరు మరింతగా ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇటీవల కే కేశవరావు, కడియం శ్రీహరి వంటి సీనియర్ నేతలు పోతుపోతూ బీఆర్ఎస్ పార్టీ తీరు.. కేసీఆర్ వ్యవహారంపై చేసిన వ్యాఖ్యలు పార్టీ అంతర్గత నిర్మాణ తప్పిదాలను స్పష్టం చేస్తోంది. దీనికితోడు పదేండ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలోనూ విఫలమయ్యింది. దానికితోడు ప్రజలను మభ్య పెట్టేలా కేసీఆర్ ప్రసంగాలు, బీఆర్ఎస్ తీరు ప్రజల్లో విసుగు తెప్పించింది. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. సాగునీటి ప్రాజెక్టుల్లో అక్రమాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దందా, విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, కవిత లిక్కర్ స్కామ్ కేసు.. ఒక్కోటి బీఆర్ఎస్‌ను అథో పాతాళంలోకి నెట్టేశాయి. అయితే బీఆర్ఎస్ తమ తప్పులను కప్పి పుచ్చుకునేందుకు నిండా నాలుగు నెలలు పూర్తి కాకముందే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీల అమలుపై రాద్దాంతం చేయడం చర్చనీయాంశమవుతోంది.
తప్పిదాలపై దిద్దుబాటు చర్యలేవీ..?
తాజాగా ‘బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎవ్వరినీ నిలబెట్టినా సునాయసంగా విజయం సాధిస్తారనే ధీమా పార్టీ అగ్ర నాయకత్వానికి ఉండేది’ అంటూ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించడం బీఆర్ఎస్ వర్గాల్లో చర్చకు దారితీసింది. సంస్థాగతంగా పార్టీ నిర్మాణం చేయకుండా కేవలం ఒక కుటుంబం సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా, తెలంగాణ తెచ్చామనే సెంటిమెంట్‌తో ఎక్కువ కాలం అధికారంలోకి రావడం కుదరదనేది బీఆర్ఎస్‌కు ఆలస్యంగానైనా గుర్తించిందో లేదో. ఇప్పటికే బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం తేరుకుని క్షేత్రస్థాయిలో పార్టీని నిర్మాణం చేయకపోతే భవిష్యత్తులో కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం. ఇదిలావుంటే.. సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నా.. అగ్ర నాయకత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకోవడం లేదు. అసలు క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఏంటి..? క్యాడర్ ఏమనుకుంటుంది..? వారి అభిప్రాయం ఏంటి..? పూర్వవైభవం కోసం ఏం చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలను తీసుకునే కనీస ప్రయత్నం కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ చేయట్లేదు. గుత్తా చేసిన వ్యాఖ్యల్లో తెలంగాణ ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చి రూ.కోట్లు వెనకేసుకున్నారనే ఆరోపణలు స్పష్టం అవుతున్నాయి. సొంత పార్టీ నేతలపై ఆ స్థాయిలో వ్యాఖ్యలు చేయడం అంత సాదాసీదా విషయం కాదు. జేబులో నాడు రూ.500 నోటు లేని వ్యక్తులు నేడు రూ.వందల కోట్లు ఏలా సంపాదించారంటూ ప్రశ్నించడం ప్రజలను ఆలోచింపజేస్తోంది.
వ్యవహార శైలి మార్చుకోకుంటే కష్టమేనా?
బీఆర్ఎస్ నేతల వ్యవహారశైలిని ఇకనైనా మార్చుకోకపోతే కష్టమేనని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. కేసీఆర్, కేటీఆర్ లాంటి నేతలు తమను విమర్శిస్తున్న వారి సంగతి చూస్తామంటూనే.. కాంగ్రెస్ సర్కారుకు కనీస టైమ్ ఇవ్వకుండా హామీల అమలుకు డిమాండ్ చేయడం ప్రజల్లో వెగటు పుట్టిస్తోంది. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వస్తే.. కనీసం ఏడాది గడువు అయినా ఇవ్వాలి కదా అనే అభిప్రాయం ప్రజల్లో లేకపోలేదు. ఇదిలావుంటే.. తెలంగాణ ఉద్యమం కోసం టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన నాటి నుంచి రెండుసార్లు టీఆర్ఎస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు శ్రమించిన ఉద్యమ లీడర్లను బీఆర్ఎస్ తొక్కేసిందనే ఆరోపణలు ఉన్నాయి. తమ రాజకీయ స్వార్థం కోసం ఉద్యమ నేతలను పక్కకు నెట్టి ఉద్యమద్రోహులను అందలం ఎక్కించారనే ఆరోపణలు లేకపోలేదు. నియోజకవర్గాల్లో పార్టీ అభిప్రాయాన్ని, ఉద్యమ నేతల అభిప్రాయం తీసుకోకుండానే కేసీఆర్ నియంత తరహాలో టికెట్లు ఇవ్వడం.. మంత్రి పదవులను కట్టబెట్టడం క్యాడర్‌లో అసంతృప్తికి కారణమనే చెప్పాలి. దీంతో అలాంటి క్యాడర్ అంతా సమయం కోసం వేచిచూసింది. ఇదే సమయంలో బీఆర్ఎస్ కష్టకాలంలోకి వచ్చేసరికి నాడు పదవులు అనుభవించిన లీడర్లు, ఉద్యమ ద్రోహులు కేసీఆర్‌కు హ్యాండిచ్చి ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యారు. దీంతో బీఆర్ఎస్‌కు ఆ నాటి లీడర్లు, క్యాడరే దిక్కయ్యింది. కేసీఆర్ పార్టీని ఎక్కడి నుంచి మొదలుపెట్టారో.. దాదాపుగా ఆ స్థాయికే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చేరింది. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే.. కేసీఆర్ తన పదేండ్ల ప్రభుత్వ కాలంలో క్షేత్రస్థాయి కార్యకర్తల అభిప్రాయం తీసుకోవడం సంగతి పక్కనపెడితే.. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీలోని కీలక నేతల అభిప్రాయం తీసుకునేందుకు సుముఖత చూపలేదు. పదవులు దక్కక కొంతమంది.. పదవులు దక్కినా ఆత్మగౌరవానికి అడుగడుగునా అవమానం జరగడంతో మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీపై తిరుగుబావుటా ఎగరేశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ నేలచూపులు చూస్తోంది. ఇకనైనా కేసీఆర్ మేల్కొని వ్యక్తులకు ప్రయారిటీ తగ్గించి సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. లేకుంటే దేశ రాజకీయ చరిత్రలో మరో పార్టీ కనుమరుగు కావడం ఖాయమనే చెప్పాలి.
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు, అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు, హుస్నాబాద్, జిల్లా సిద్దిపేట తెలంగాణ )