బీజేపీ జాతీయ అధ్య‌క్షురాలి రేసులో ఇద్దరు ఏపీ మ‌హిళ‌లు...
x

బీజేపీ జాతీయ అధ్య‌క్షురాలి రేసులో ఇద్దరు ఏపీ మ‌హిళ‌లు...

వారిద్ద‌రి ప్ల‌స్సులు, మైన‌స్సులు ఇవే!


కేంద్రంలో వ‌రుస‌గా మూడు ప‌ర్యాయాలుగా అధికారంలో కొన‌సాగుతున్న భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) జాతీయ‌ అధ్య‌క్ష ప‌ద‌వి ఎన్నిక‌కు తెర‌లేస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు బీజేపీ జాతీయ అధ్య‌క్ష ప‌ద‌వికి ఒక్క మ‌హిళ కూడా ఎంపిక కాలేదు. బీజేపీ చరిత్ర‌లోనే తొలిసారిగా ఈసారి ఈ ప‌ద‌విని మ‌హిళ‌కు కేటాయిస్తార‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. ఇందుకు స్వ‌యంగా రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ (ఆర్సెస్‌) సైతం ఆమోదం తెలిపింద‌నే వార్త హాట్ టాపిక్ గా మారింది.

కాగా బీజేపీ జాతీయ అధ్య‌క్ష ప‌ద‌వికి ప్ర‌ధానంగా ముగ్గురు మ‌హిళ‌లు పోటీ ప‌డుతున్నారు. వీరిలో ఇద్ద‌రు తెలుగు మూలాలున్న‌వారు, అది కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్ తో ద‌గ్గ‌ర సంబంధాలున్న‌వారు కావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. బీజేపీ జాతీయ అధ్య‌క్ష ప‌ద‌వికి ప్ర‌స్తుతం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నిర్మ‌లా సీతారామ‌న్‌, రాజ‌మండ్రి (రాజ‌మ‌హేంద్ర‌వ‌రం) బీజేపీ ఎంపీగా, కొద్ది రోజుల క్రితం వ‌ర‌కు బీజేపీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అధ్య‌క్షురాలిగా ఉన్న ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి పేర్లు ప్ర‌ధానంగా వినిపిస్తున్నాయి. వీరిద్ద‌రితోపాటు బీజేపీ త‌మిళ‌నాడు నేత‌, కోయంబ‌త్తూరు సౌత్ ఎమ్మెల్యే వ‌న‌తి శ్రీనివాస‌న్ పేరు కూడా గ‌ట్టిగానే వినిపిస్తోంది. అయితే ప్ర‌ధాన పోటీ మాత్రం ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి, నిర్మ‌లా సీతారామ‌న్ మ‌ధ్యే ఉంద‌ని స‌మాచారం.

ఆయా అంశాల‌పై విస్తృత‌మైన ప‌రిజ్ఞానం, బ‌హు భాష‌ల్లో అన‌ర్ఘ‌ళంగా మాట్లాడ‌గ‌ల నేర్పు, కేంద్రంలో కీల‌క ప‌ద‌వుల‌ను చేప‌ట్టి ఉండ‌టం, ఆయా అంశాల‌పై గ‌ట్టిగా, సూటిగా, స్ప‌ష్టంగా మాట్లాడ‌గ‌ల నేర్పు, ఉన్న‌త చ‌దువులు, ఉన్న‌త సామాజిక‌వ‌ర్గాల‌కు చెందిన‌వారు కావ‌డం త‌దితర అంశాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి, నిర్మ‌లా సీతారామ‌న్ కు బ‌లం చేకూర్చే అంశాలు.

ముందుగా ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి విష‌యానికొస్తే.. ఆమె ప్ర‌ముఖ న‌టుడు, తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీ రామారావు కుమార్తె. అంతేకాదు పురందేశ్వ‌రి భ‌ర్త ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు టీడీపీ, ఎన్టీఆర్ మ‌ర‌ణించాక కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఐదుసార్లు (1983, 1985, 1989, 2004, 2009) శాస‌న‌స‌భ్యుడిగా, కొన్నాళ్లు రాజ్య‌స‌భ స‌భ్యుడిగా, లోక్ స‌భ స‌భ్యుడిగా వ్య‌వ‌హరించారు. ప్ర‌స్తుతం ఆయ‌న రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ భ‌ర్త ద‌గ్గుబాటి వెంకటేశ్వ‌ర‌రావు ప్రోత్సాహంతో పురందేశ్వ‌రి రాజ‌కీయాల్లో త‌న‌దైన పాత్ర పోషిస్తున్నారు.

ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి తొలిసారి 2004లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని బాప‌ట్ల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా విజ‌యం సాధించారు. ఆ ఎన్నిక‌ల్లో ఆమె ప్ర‌ముఖ నిర్మాత‌, మూవీ మొఘ‌ల్‌, టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసిన డి.రామానాయుడుపై

ఘ‌న‌విజ‌యం సాధించారు. 2009 ఎన్నిక‌ల నాటికి నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా బాప‌ట్ల లోక్ స‌భ స్థానం ఎస్సీ రిజ‌ర్వుడు కావ‌డంతో విశాఖ‌ప‌ట్నం నుంచి పోటీ చేసి విజ‌యం సాధించారు. ఇలా వ‌రుస‌గా రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ఎంపీగా గెలుపొందారు. అంతేకాకుండా నాటి కేంద్ర ప్ర‌భుత్వంలో కేంద్ర స‌హాయ శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. 2009లో కేంద్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ స‌హాయ మంత్రిగా, 2012లో కేంద్ర వాణిజ్య శాఖ స‌హాయ మంత్రిగా పురందేశ్వ‌రి బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అప్పుడు కూడా పురందేశ్వ‌రి అన‌ర్ఘ‌ళ వాక్ప‌టిమ‌కు మెచ్చి సోనియాగాంధీ ఆమెను కేంద్ర మంత్రిగా రిక‌మండ్ చేశార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

ఇక 2014లో రాష్ట్ర విభ‌జ‌న ప‌రిణామాల్లో పురందేశ్వ‌రి కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2014 ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థిగా వైఎస్సార్ క‌డ‌ప జిల్లా రాజంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థిగా విశాఖ‌ప‌ట్నం నుంచి ఎంపీ అభ్య‌ర్థిగా పోటీ చేసినా నిరాశే ఎదురైంది. ఈ ఎన్నిక‌ల్లో పురందేశ్వ‌రి 33 వేల ఓట్లు మాత్ర‌మే సాధించారు. తిరిగి 2022లో ఆమె బీజేపీ ఏపీ అధ్య‌క్షురాలిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. 2024 ఎన్నిక‌ల్లో కూట‌మి (టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ) పొత్తులో భాగంగా రాజ‌మండ్రి నుంచి బీజేపీ త‌ర‌ఫున‌ పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. కేంద్ర మంత్రిగా అవ‌కాశం వ‌స్తుంద‌ని ఆశించినా ప‌ద‌వి ద‌క్క‌లేదు. కొద్ది రోజుల క్రితం బీజేపీ ఏపీ అధ్య‌క్షురాలిగా రెండోసారి ఆమెకు కొన‌సాగింపు ల‌భిస్తుంద‌ని వార్త‌లు వ‌చ్చినా అవి నిజం కాలేదు. బీజేపీ ఏపీ అధ్య‌క్షుడిగా పీవీఎన్ మాధవ్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్య‌క్షురాలి ప‌ద‌వికి వార్త‌ల్లో నిలుస్తున్న పురందేశ్వ‌రికి ప‌లు అనుకూల‌త‌లు ఉన్నాయి. ఆమె మాజీ సీఎం, విఖ్యాత న‌టుడు ఎన్టీఆర్ కుమార్తె. అలాగే ప‌దేళ్ల‌పాటు గ‌తంలో ఎంపీగా ఉన్నారు. మూడో ప‌ర్యాయం ఎంపీగా కొన‌సాగుతున్నారు. ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు, ఫ్రెంచ్‌, త‌మిళం భాష‌లు బాగా మాట్లాడ‌గ‌ల‌రు. కూచిపూడి నాట్యంలోనూ ఆమెకు మంచి ప్రావీణ్య‌ముంది. జెమాల‌జీలో డిగ్రీ చేశారు. మ‌ద్రాసు, బొంబాయిలో ఉన్న‌త విద్య‌న‌భ్య‌సించారు. 2009 నుంచి 2014 వ‌ర‌కు కేంద్రంలో మంత్రిగా ప‌నిచేసిన అనుభ‌వం ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షురాలిగా ప‌నిచేశారు. 2004లో బాప‌ట్ల‌, 2009లో విశాఖ‌ప‌ట్నం, 2024లో రాజ‌మండ్రి ఇలా మూడు వేర్వేరు నియోజక‌వ‌ర్గాల నుంచి పోటీ చేసి గెలుపొందిన రికార్డు కూడా సొంతం. ఈ నేప‌థ్యంలో ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి పేరు బీజేపీ జాతీయ అధ్య‌క్షురాలి ప‌ద‌వికి గ‌ట్టిగా వినిపిస్తోంది. అందులోనూ తెలంగాణ‌లో బాగానే బ‌ల‌ప‌డిన బీజేపీ ఆంధ్రాలో సొంతంగా ఎద‌గ‌లేక‌పోతోంది. ఈ నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనూ సొంతంగా బీజేపీ నిల‌దొక్కుకోవాలన్నా, ఏపీతోపాటు సౌత్ లోనూ మ‌హిళ‌ల‌ను ఆక‌ట్టుకోవాల‌న్నా పురందేశ్వ‌రి మంచి చాయిస్ కాగ‌ల‌ర‌ని బీజేపీ అధిష్టానం లెక్క‌లు వేసుకుంటోంది.

పురందేశ్వ‌రి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో కీల‌క‌మైన క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారు. ఆయా భాష‌ల్లో అన‌ర్ఘళంగా మాట్లాడ‌గ‌ల నేర్పు, కేంద్ర మంత్రిగా ప‌నిచేసిన అనుభ‌వం, ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో పోటీ చేసి మూడుసార్లు గెలుపొందిన రికార్డు ఉన్న‌ప్ప‌టికీ ఆమె మొద‌టి నుంచి బీజేపీలో ఉన్న‌వారు కాదు. గ‌తంలో త‌న తండ్రి ఎన్టీఆర్ జీవించి ఉన్న‌ప్పుడు తెలుగుదేశం పార్టీ, ఆ త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. అందులోనూ క‌మ్మ సామాజిక‌వ‌ర్గం తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ అవుతోంది. ఈ నేప‌థ్యంలో పురందేశ్వ‌రికి జాతీయ అధ్య‌క్ష ప‌ద‌విని అధిష్టానం క‌ట్ట‌బెడుతుందా అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. అందులోనూ ఏపీ బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌విని ఒక బీసీ అభ్య‌ర్థి అయిన మాధ‌వ్ కు అప్ప‌గించ‌డం ద్వారా త‌న ఆలోచ‌న‌లు ఏమిటో బీజేపీ అధిష్టానం చెప్ప‌క‌నే చెప్పింది. ఇదే స‌మ‌యంలో పురందేశ్వ‌రి నిల‌క‌డలేనిత‌నం కూడా చ‌ర్చ‌కు వ‌స్తోంది.

ఇక బీజేపీ జాతీయ అధ్య‌క్ష ప‌ద‌వికి చాలా గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు.. నిర్మలా సీతారామ‌న్‌. నిర్మ‌ల కూడా ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు, త‌మిళం భాష‌ల్లో అన‌ర్ఘ‌ళంగా మాట్లాడ‌గ‌ల‌రు. బ‌ల‌మైన బ్రాహ్మ‌ణ (అయ్యంగార్‌) సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారు. త‌మిళ‌నాడులో జ‌న్మించిన నిర్మ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురానికి చెందిన ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ ను పెళ్లి చేసుకున్నారు. అయిన‌ప్ప‌టికీ త‌న స్వ‌యంసిద్ధ ప్ర‌తిభ‌లో రాజ‌కీయాల్లో వెలుగొందుతున్నారు. మొద‌టి నుంచి బీజేపీలోనే ఉండ‌టం నిర్మ‌ల సీతారామ‌న్ కు ప్ల‌స్సు కాగ‌ల‌ద‌ని భావిస్తున్నారు. అందులోనూ బ్రాహ్మ‌ణ సామాజిక‌వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి కావ‌డంతో రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ సైతం నిర్మ‌ల‌వైపు మొగ్గు చూపుతోంద‌ని టాక్ న‌డుస్తోంది.

ప్ర‌ఖ్యాత జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ యూనివ‌ర్సిటీ - ఢిల్లీ నుంచి అర్థ శాస్త్రంలో నిర్మ‌లా సీతారామ‌న్ పీజీ చేశారు. ఆ త‌ర్వాత ఎంఫిల్ కూడా పూర్తి చేశారు. లండ‌న్ స్కూల్ ఆఫ్ ఎక‌నామిక్స్ లో పీహెచ్‌డీ చేయ‌డానికి కూడా సిద్ధ‌మ‌య్యారు. అయితే అనివార్య కార‌ణాల‌తో పీహెచ్‌డీ పూర్తి చేయ‌లేక‌పోయారు. 2003 నుంచి 2005 వ‌ర‌కు నిర్మ‌లా సీతారామ‌న్ జాతీయ మ‌హిళా క‌మిష‌న్ లో సభ్యురాలిగా ప‌నిచేశారు.

2008లో తొలిసారిగా నిర్మ‌లా సీతారామ‌న్ బీజేపీలో చేరారు. ఆ పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధిగా ప‌నిచేశారు. 2014 వ‌ర‌కు అదే ప‌ద‌విలో ఉన్నారు. 2014లో తొలిసారిగా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చింది. అదే సంవ‌త్స‌రం నిర్మ‌లా సీతారామ‌న్ ను రాజ్య‌స‌భ‌కు ఎంపిక చేసింది. అంతేకాకుండా కేంద్రంలోనూ మంత్రిగా నిర్మ‌ల‌కు ప్ర‌ధాని మోదీ చాన్సిచ్చారు. 2016లో క‌ర్ణాట‌క నుంచి బీజేపీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ‌కు రెండోసారి ఎంపిక‌య్యారు. 2017లో కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రిగా కీల‌క బాధ్య‌త‌లు చేప‌ట్టారు. త‌ద్వారా ఇందిరాగాంధీ త‌ర్వాత కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన రెండో మ‌హిళ‌గా నిర్మ‌ల చ‌రిత్ర సృష్టించారు.

2019లో మోదీ రెండోసారి ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టాక నిర్మ‌లా సీతారామ‌న్ కు మ‌రింత కీల‌క శాఖ ద‌క్కింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఆమె బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఐదేళ్ల‌పాటు 2024 వ‌ర‌కు ఆర్థిక మంత్రిగా ఉన్నారు. 2021-22లో క‌రోనా విప‌త్తు సంభ‌వించిన‌ప్పుడు ఆమె తీసుకున్న చ‌ర్య‌లు ప్ర‌శంస‌లందుకున్నాయి. దేశ ఆర్థిక పురోగ‌తి దెబ్బ‌తిన‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఆమె సేవ‌ల‌కు మెచ్చిన ప్ర‌ధాని మోదీ 2024 ఎన్నిక‌ల త‌ర్వాత మూడోసారి ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్పుడు మ‌ళ్లీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మ‌లా సీతారామ‌న్ కే అవ‌కాశం ఇచ్చారు. త‌ద్వారా కేంద్రంలో కీల‌క‌మైన న‌లుగురు (ర‌క్ష‌ణ, హోం, విదేశాంగ శాఖ‌, ఆర్థిక శాఖ‌) మంత్రుల్లో ఒక‌రిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే నిర్మలా సీతారామ‌న్‌కు సామాజిక‌వ‌ర్గం, ఉన్న‌త చ‌దువు, కీల‌క శాఖ‌ల‌కు మంత్రిగా అనుభవం వంటివి క‌లిసొస్తున్నా ప్ర‌తిప‌క్షాల‌పై దూకుడుగా విమ‌ర్శ‌లు చేయ‌లేర‌ని అంటున్నారు. నిర్మ‌లా సీతారామ‌న్ కు మృదు స్వభావిగా పేరుంది.

అయితే కేంద్రంలో కీల‌క శాఖ‌ల‌కు సుదీర్ఘ కాలం మంత్రిగా ఉన్న అనుభ‌వం, సామాజిక‌వ‌ర్గం, త‌మిళ‌నాడులో అధికారంలోకి రావాల‌న్నా బీజేపీ కోరిక.. ఇలా వెర‌సి అదే రాష్ట్రానికి చెందిన నిర్మ‌లా సీతారామ‌న్ కు బీజేపీ జాతీయ అధ్య‌క్ష ప‌ద‌వి ద‌క్క‌వ‌చ్చ‌ని టాక్ నడుస్తోంది.

Read More
Next Story