
గిరిజన హక్కుల ఉద్యమాలకు అండగా నిలిచిన లాయర్
భువన మోహన్ పట్నాయక్ కి శత జయంతి సందర్భంగా కొన్ని జ్ఞాపకాలు
వంద సంవత్సరాల భారత కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో వర్గాలు, దోపిడి, పీడనలు లేని సమసమాజ నిర్మాణానికి అంకితమై, తమ గుండె నెత్తురులు తర్పణ జేస్తూ, తమ సర్వ శక్తులను ఆ ఉద్యమానికై ధారవోసిన ఆదర్శమూర్తులు ఎందరో! దిక్కు మొక్కు లేని అడవి వాసుల, గిరిజనుల, పేదల పక్షాన నిలిచి వారి తలలో నాలుకలా, వారి హక్కుల పోరాటాల గొంతులా నినదించి, తమను తాము త్యాగం చేసుకున్న మేధావులు ఎందరో! అలాంటి వారిలో ఎన్న దగిన వాడు భువన మోహన [ డిబిఎం] పట్నాయక్. మార్క్సిస్టు ఆలోచనా ధారను అచంచల విశ్వాసం గా మలచుకుని జీవితాంతం విప్లవ కమ్యూనిస్టు ఉద్యమానికి అంకితమై జీవించిన మహనీయుడు.
ఈ అక్టోబర్ 2025 ఆ శత జయంతి సంవత్సరం. డిబిఎం 31-10-1925 న శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణ సమీపంలోని భాగీంపేట గ్రామంలో శ్రీ సింహగిరి పట్నాయక్, నారాయణమ్మ దంపతులకు జన్మించారు. ఆంధ్ర ప్రాంతంలో జన్మించినప్పటికీ డి.బి.యం. 1949 లో 24 సంవత్సరాల వయసులో తన లా చదువు పూర్తయిన తరువాత అప్పటి ఒరిస్సా రాష్ట్రం, కోరాపుట్ జిల్లా లోని నబరంగపూర్ కు మకాం మార్చాడు. తదనంతరం 1951 లో ప్రస్తుత రాయగడ జిల్లాలోని గుణుపూర్ పట్టణానికి వెళ్ళి ఆదివాసీ న్యాయవాదిగా జీవనం మొదలు పెట్టాడు. అప్పటి నుండి 11/02/2009 న మరణించే వరకు అక్కడే ఒరిస్సా రాష్ట్రంలోనే గడిపాడు. తుదిశ్వాస విడిచే నాటికి 83 ఏళ్లు పైబడినవి. ఆయన భార్య శ్రీమతి జయలక్ష్మీదేవి 1998 లోనే కన్నుమూశారు. వారికి ఐదుగురు కుమారు లు, ఇద్దరు కుమార్తెలు సంతానం.
1950లలో తన యవ్వన కాలంలో భారత కమ్యూనిస్టు పార్టీలో చేరి, కడవరకూ తన కమ్యూనిస్టు విశ్వాసాలను నిలుపు కుని, ఉద్యమాచరణ తో మేళవించుకుని జీవించిన ఆదర్శప్రాయుడైన ఆయన. కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చిన సిద్దాంత భేదాలు, విభజనలు, మలుపులు అన్నింటా తనను తాను పదును బెట్టుకుంటూ, ప్రజాఉద్యమా లలో కీలకంగా వ్యవహరించిన జన నేత. ఉద్యమాలలో వివిధ చీలికల సమయం లో, ఆయన ఎప్పుడూ వామపక్ష, విప్లవ విభాగానికి మద్దతు తెలుపుతూ, సిపిఐ నుండి సిపిఎం కు, అక్కడి నుండి సిపీఐ [ఎం ఎల్] కు ప్రయాణించాడు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలోను, ఆ తర్వాత సి.పి.ఐ.(ఎం)లోనూ ఒరిస్సా రాష్ట్ర కమిటీ సభ్యునిగా పనిచేశారు. తదుపరి పరిణామాలలో 1967మే లో ఎఐసిసిఆర్ లో చేరి ఒరిస్సా రాష్ట్ర విభాగానికి కన్వీనర్ బాధ్యతలు చేపట్టారు. చారు మజుందార్, అతని సహచరులూ ఏర్పాటు చేసిన సిపిఐ (ఎంఎల్) లో కొనసాగుతూ 1970 లో అరెస్టు అయ్యారు. సిపిఐ (ఎంఎల్) అనుసరించిన తప్పుడు మార్గం గురించి చైనా కమ్యూ నిస్టు పార్టీ చేసిన విమర్శలను, సూచనలను అంగీకరించి, చారు మజుందార్ అనుసరించిన వ్యక్తిగత హింసావాదం వంటి అతివాద మూర్ఖత్వాన్ని గ్రహించి స్వీయ విమర్శతో దాన్ని త్యజిస్తూ 1972 నవంబర్లో ప్రకటించిన సిపిఐ (ఎంఎల్) కు చెందిన ఆరుగురు ప్రముఖ నాయకులలో ఈయన ఒకరు. డి.బి.ఎం పూర్తి చిత్తశుద్ధితో సరైన స్వీయ విమర్శ దిశలో అధ్యయనం సాగించారు. సుదీర్ఘ ఉద్యమ అనుభవం, విప్లవ విజ్ఞతలు కలబోసి చేసిన అధ్యయనంతో చివరకు 1989-91 లో భారత కమ్యూనిస్టు విప్లవ కారుల సమైక్యతా కేంద్రం లో (యుసిసిఆర్ఐ- ఎంఎల్) తాను ఆశించిన సరైన భారత విప్లవ పంథాను కనుగొన్నారు.
డి.బి.యం. పట్నాయక్, నిజమైన ప్రజాస్వామిక వాది, అంకితభావంతో వృత్తి జీవనం గడిపిన ప్రజల న్యాయవాది. ప్రజల హక్కుల కోసం మరీ ముఖ్యంగా ఆదివాసీ, గిరిజన ప్రజల హక్కుల కోసం జీవితకాలం పోరాడిన యోధుడు. గిరిజనులు, పేద రైతులు, కార్మికులు, శ్రామిక ప్రజలందరి న్యాయమైన కోర్కెలకోసం, వారి డిమాండ్ల సాధన కోసం ఆవిరామం గా కృషిచేసిన గొప్ప కమ్యూనిస్టు విప్లవకారుడు.
గిరిజన జనాభాకు భూమి వ్యవహారాలలో జరుగుతున్నఅన్యాయాలను చూసి కోర్టులలో వారి భూ కేసులలో వాదిస్తూ, వారి సమస్యలను పూర్తిగా ఆకళింపు చేసుకుని ఆ తర్వాత జీవితాంతం ఈ పనిని కొనసాగించారు. న్యాయవాదిగా తన వృత్తిని ఆయన సంపాదనా మార్గంగా ఎన్నడూ వాడుకోలేదు. ఆరు దశాబ్దాలకు పైగా వృత్తి జీవితమంతా ప్రజల హక్కుల పరిరక్షణకు అంకితం చేశారు. చాలా సందర్భాలలో, కేవలం ప్రయాణఖర్చులు మాత్రమే తీసుకుని ఎంతో దూరాలు కూడా వెళ్ళి అభాగ్యులయిన పేద గిరిజనుల తరఫున న్యాయ పోరాటం నిర్వహించే వారు. ప్రజల హక్కుల కోసం ఆయన నిబద్ధత అది.
ఆయన కృషి కేవలం కోర్టుల వరకే పరిమితం కాలేదు. నౌరంగపూర్ లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే అక్కడి నుండే ఆదివాసీ (గిరిజన) రైతు ఉద్యమాలకు డిబిఎం చేసిన సేవలు ఎన లేనివి. 1952 కుజింద్ర పోరాటం నుండి ఆయన పాత్ర వివిధ సంస్థలతో, ప్రజా సంఘాలతో చురుకైన అనుబంధానికి విస్తరించింది. ఉద్యమాలతో సంబంధాలు, వాటిలో ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారా, పోరాట ప్రాంతాల్లో జీవించడం ద్వారా, బాధిత ప్రాంతాలను సందర్శించడం ద్వారా, ప్రజలను చైతన్య పరచి ఉద్యమాలకు నడిపించడం ద్వారా అంచెలంచలుగా ఆయన ఒక నమ్మకమైన నాయకునిగా ఎదిగారు. ఆదివాసీలకు సహాయం చేయడానికి అతన్ని ప్రభుత్వ న్యాయవాదిగా నియమించినప్పటికీ, అధికారంలో ఉన్నవారు మాత్రమే సహాయం చేయగలరని డిబిఎం ఎప్పుడూ నమ్మలేదు. కుల, మతాలకు అతీతంగా ప్రజలను సమీకరించాలని ఆయన ఎప్పుడూ నొక్కి చెప్పేవారు. ఒక సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా 'సమాన పనికి సమాన వేతనం' అనే సూత్రాన్ని అమలు చేయడానికి డిబిఎం ఒరిస్సా హైకోర్టులో చేసిన న్యాయ పోరాటం వేలాది మంది కార్మికులకు సహాయపడింది. అయితే ఆ నాటి పార్టీ విధానాలు, నాయకత్వ సూచనల మేరకు ఆయన రాజకీయ జీవితం కొనసాగింది. అన్ని దశల లోనూ ఆశించిన ఫలితాలు రాకపోయినా ఆయన నిబద్దుడై జీవించాడు.
కోరాపుట్ లోని వివిధ ప్రదేశాలలో, వివిధ గిరిజన భూ ఉద్యమా ల నుండి ప్రారంభ మైన ప్రజా పోరాటాలు, జిల్లా, పొరుగు జిల్లాల లోని వివిధ పరిశ్రమలు, ప్రాజెక్టుల కార్మికుల ఉద్యమాలలో పాల్గొనే వారు. 1960 లలో శ్రీకాకుళం జిల్లాలోని విప్లవ రైతాంగ తిరుగుబాట్లలో డి.బి.యం. చురుగ్గా వ్యవహరించారు. శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతాలలో, ఒరిస్సాలోని కోరాపుట్ జిల్లా అంతటా, వివిధ ప్రాంతాలలో గిరిజన, రైతాంగ విప్లవోద్యమా లను నిర్వహించడానికి ఆయన అండర్ గ్రౌండ్ జీవితాన్ని ఎంచుకున్నారు. ఈ విప్లవాత్మక కార్యకలాపాల కారణంగా డి బి యం రాజ్యం నుండి వివిధ రకాల, ఘోరమైన అణచివేతను ఎదుర్కొన్నాడు. రహస్య జీవితం, లాఠీ ఛార్జీలు, పోలీసు కాల్పులు, తప్పుడు కుట్ర కేసులు, సుదీర్ఘ జైలు శిక్షల వరకు అనేక రకాల నిర్బంధాలను ఎదుర్కొన్నారు. 1964-66లో భారత ప్రభుత్వం ఆయనను నిర్బంధించింది. ఆ తర్వాత గుణుపూర్ కుట్ర కేసులో, చిత్రకొండ కుట్ర కేసులో, పార్వతీపురం కుట్ర కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. పార్వతీపురంకుట్ర కేసులో ఆయన నిందితుల్లో ఒకడు మాత్రమే కాదు, వారికై వాదించిన డిఫెన్స్ లాయర్ కూడా. ఈ కేసులకు సంబంధించి ఆయన 1970 నుండి 1977 వరకు జైలులో ఉన్నారు. అయినప్పటికీ తాను చేపట్టిన విప్లవ మార్గం నుంచి వెనక్కి తగ్గకుండా వాటన్నింటినీ ఎదుర్కొన్నారు. ఈ ఫాసిస్టుఅణచివేత కారణంగా ఆయన కుటుంబం పేదరికాన్ని అనుభవిస్తూ, అధిగమించలేని సమస్యలను ఎదుర్కో వలసి వచ్చింది. అయినప్పటికీ కుటుంబం వీటన్నింటినీ సహిస్తూ కా. డిబియం కు అండగా నిలిచింది. ఆయన మరణించే వరకు ఆయనకు సహకరిస్తూ వచ్చింది. 1977లో జైలు నుండి విడుదలైన పిదప ఆయన గుణుపూర్ పట్టణ మున్సిపల్ చైర్మన్ గా (1978-80) పనిచేశారు. బలిమేల ప్రాజెక్టు, జేకే పేపర్ మిల్లు, లిఫ్ట్ ఇరిగేషన్ తదితర కార్మిక సంఘాలకు నాయకునిగా బాధ్యత వహించారు. వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల స్ఫూర్తి దాయ కమైన పోరాటాలకు సారధ్యం నిర్వహించారు.
1989-90 సంవత్సరాలు డిబిఎం రాజకీయ జీవితంలో ఒక మలుపు. ఆ కాలంలో కమ్యూనిస్టు విప్లవకారుల పరిచయంతో దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డి రాజకీయాల, రచనల అధ్యయనం చేపట్టా రు. శ్రమతో కూడిన అధ్యయనం చాలా నెలల పాటు సాగింది. 1940 దశకంలో తెలంగాణ ప్రజల సాయుధ పోరాటం, తదనంతర రైతు విప్లవ ఉద్యమాల అనుభవాలు, నక్సల్బరి, శ్రీకాకుళం పోరాటాల గుణాపాఠాలు క్రోడీకరించి, అంతర్జాతీయ అనుభవాలను మనదేశ పరిస్థితులకు అన్వయించి ప్రస్తుత భూస్వామ్య అనుకూల, సామ్రాజ్యవాద అనుకూల, బడావ్యాపార వర్గాల అనుకూల పాలనను కూలదోసి, మన దేశంలో జనతా ప్రజాస్వామ్య రాజ్యాన్ని స్థాపించాలని ఈ పంథా ప్రబోధిస్తున్నది. మార్క్సిజం-లెనినిజం-మావో ఆలోచనలకు భారతీయ పరిస్థితులకు అనుగుణంగా డి.వి ఒక చైతన్యవంతమైన వ్యాఖ్యానాన్ని అందించారని, తద్వారా భారత కమ్యూనిస్టు విప్లవకారులకు గొప్ప సైద్ధాంతిక నిధిని సమకూర్చి పెట్టారని కూడా కా. డి బియం దృఢమైన నిర్ణయానికి వచ్చాడు. విప్లవ ప్రజా ఉద్యమాన్ని, సంస్థను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి సరైన విప్లవ ధోరణి అవసరం గురించి డి.వి. బోధనలు ఆయనను బాగా ఆకట్టుకున్నాయి. ఫలితంగా ఆయన భారత విప్లవం విజయానికి డి వి అభివృద్ధి చేసిన భారత విప్లవ పంథా సరైన మార్గమనే నిర్ణయానికి వచ్చారు.
ఈ ప్రజా పంథా వెలుగులో డిబియం తన విప్లవ జీవితాన్ని స్వీయ విమర్శనాత్మకంగా సమీక్షించుకొని తన ఆశయాలకు మరింత స్పష్టమైన, శాస్త్రీయమైన దృక్పథాన్ని జోడించుకున్నారు. తాను అంతవరకు నడచివచ్చిన విప్లవ మార్గం లోని లోపాలను, లోటుపాట్లను గ్రహించి, సరి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. మితవాద పార్లమెంటరీ మార్గం, వామపక్ష అతివాద దుస్సాహస మార్గానికి భిన్నంగా డివి, టి ఎన్ లు అభివృద్ధి చేసిన ప్రజా పంథా సూత్ర ప్రాయమైన వైఖరి అనీ, కమ్యూనిస్టు విప్లవకారులందరూ ఈ సరైన విప్లవ మార్గం ఆధారంగా ఐక్యం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తనను తాను విమర్శించుకోవటానికి, సరిదిద్దుకోవటానికి ఏమాత్రం మోహమాటపడని, వెనుకాడని విజ్ఞుడు ఆయన.
చారూ మజుందార్ వామపక్ష దుస్సాహసిక మార్గంలో తాను గడిపిన రోజులు తన జీవితంలో ఒక విషాద దశ అని, గొప్ప నష్టాలను చవిచూసిన తర్వాతే తాను దానిని గ్రహించి, దాని నుండి బయటపడగలిగా నని డిబిఎం చెబుతుండేవారు. వామపక్ష సాహసోపేత వాదమే విప్లవంగా భ్రమించిన రోజులలో డి.వి., టి. ఎన్. అనుస రిస్తున్న సరైన కమ్యూనిస్టు విప్లవ మార్గం పట్ల తీవ్రమైన తప్పుడు అభి ప్రాయాలను, గుడ్డి వ్యతిరేకతను, పక్షపాత వైఖరిని పెంచుకున్నానని, ఈ కారణంగానే డి.వి. పంధా యొక్క ఖచ్చితత్వాన్ని గమనించ లేక పోయానని ఆయన స్పష్టమైన పదాలలో వ్యక్తీకరించారు. 1972 నవంబరులో బహిరంగ లేఖ వెలువడినప్పుడు కూడా ఈ పక్షపాతం కొనసాగిందని ఆయన చెప్పారు. 1989-'91 లో DV యొక్క రచనలు మరియు బోధనలను అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే దురభిప్రాయం నుండి బయటపడగలిగానని, తనలాగే ముందే ఏర్పరచు కున్న దురభిప్రాయాలు కలిగి వున్న ఇతర సిపిఐ (ఎంఎల్)నాయకులు కూడా వాటిని విడిచిపెట్టి, డివి బోధనల నుండి సరైన మార్గాన్ని గ్రహించాలనీ, కమ్యూనిస్ట్ విప్లవకారులతో ఐక్యం కావాలని ఆయన గట్టిగా భావించారు.
అంతేకాదు తాను చేపట్టిన విమర్శ, ఆత్మ విమర్శ లో భాగంగా, నాలుగు దశాబ్దాలుగా [1952-53 కాలం నుండి 1990 వరకు] తను చూసిన, పాల్గొన్న,నాయకత్వం వహించిన, అనేక ప్రజా ఆందోళనలనూ ఉద్యమాలను ముఖ్యంగా ఒరిస్సాలోని పాత కోరాపుట్ జిల్లాలోనూ, గుణుపూర్ ఉపవిభాగాల్లోనూ జరిగిన జమీందారీ వ్యతిరేక రైతు పోరాటాలను, కార్మికుల పోరాటాలను నూతన విప్లవదృష్టితో పునః సమీక్షించే పనిని చేపట్టారు. చాలా కష్టపడి ఈ పోరాటాల నివేదికను తయారు చేశారు. పోరాటాలు ఎక్కువగా చట్టపరమైన, సంస్కరణ వాద చట్రంలో ఉన్నాయని ఆయన భావించారు. ఈ పోరాటాలకు సర్వోదయ సంస్థల వంటి వారు నాయకత్వం వహించడం వల్లనే కాదు, కమ్యూనిస్టు పార్టీ అనుసరించిన విప్లవ రహిత పార్లమెంటరీ మార్గం వల్ల కూడా ఈ పరిమితి ఏర్పడింది అని ఆయన భావించారు. రైతాంగ పోరాటాలను ఉన్నత స్థాయికి నిర్మించడానికి, ముందుకు తీసుకెళ్లడానికి సరైన కమ్యూనిస్టు విప్లవ దృక్పథం తదనుగుణమైన కమ్యూనిస్టు విప్లవ కార్యాచరణ అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.
ప్రపంచంలో యుద్ధ కాముకులను, ఆధిపత్య శక్తులను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఉద్యమాలకు డి.బి. యం మద్దతుగా నిలిచారు. సోషలిస్టు చైనా ను అధ్యయనం చేసి, బలమైన భారత-చైనా స్నేహ ఉద్యమాన్ని నిర్మించ డానికి, ప్రపంచ శాంతి కోసం కృషి చేసారు. దేశంలో బలమైన ప్రజాస్వామ్య హక్కుల ఉద్యమాన్ని నిర్మించడానికి కృషి చేసారు. రాజ్యం యొక్క వివిధ అణచివేత చట్టాలను, అణచివేత పద్ధతులను వ్యతిరేకించారు. నిజమైన ప్రజాస్వామి క విప్లవ శక్తులను సమీకరించడం కోసం పాటు పడ్డారు.
ఇక వ్యక్తిగా డిబిఎం తన సాధారణ మైన నిరాడంబర జీవనమూ, ఉన్నత ఆలోచనల తో అందరినీ ఆకట్టు కున్నాడు. కష్టపడి పనిచేసే గుణం, త్యాగం, చిత్తశుద్ధి, వినయం, నిస్వార్థపరత్వం, ప్రజలకు సేవ చేయాలనే బలమైన కోరిక ఆయన వ్యక్తిత్వపు ముఖ్య లక్షణాలు.
డిబియం తాత్కాలికంగా అణచివేయబడిన శ్రీకాకుళ విప్లవోద్యమాన్ని పునర్నిర్మించాలనే బలమైన కోరిక కలిగి వుండే వారు. ఆయనకు, 50 వేల మంది సైనికులు దాడి చేసినా, తమను చుట్టుముట్టి వేధించినా ప్రజలు అజేయులుగా నిలిచిన, ఐదు సంవత్సరాలు కొనసాగిన తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్రపాఠాలు స్పూర్తిగా నిలిచాయి. ఆ పోరాటం, నాయకత్వo వేసిన వెనుకంజకు విద్రోహానికి గురై విరమించబడింది తప్ప ప్రజాఉద్యమం ఎన్నడూ వోడిపోలేదు, లొంగిపోలేదు అని ఆయన విశ్వసించారు. అయితే వువ్వెత్తున లేచిన తరువాతి సాయుధ ఉద్యమాలు కొన్ని ఆరు నెలల లోనో, లేక సంవత్సర కాలంలోనో అణిచివేయ బడ్డాయంటే దానికి కారణం ఈ ఉద్యమాల నాయకత్వం అనుసరించిన వ్యక్తిగత హింసావాదమూ, దుందుడుకు వాదమూ, విజయపపథం లో నడిచిన ప్రజల అనుభవాలను అవగాహన చేసుకోకపోవడమూ అని ఆయన భావించారు. ఈ పాఠం తో ఆయన విప్లవ పునః నిర్మాణంలో భాగంగా ఆంధ్ర, ఒరిస్సా రాష్ట్రాల పరిసర ప్రాంతాల ఉద్యమం కోసం కృషి చేశారు. తెలంగాణ పోరాట మార్గంలో ప్రజల చైతన్యాన్ని, భాగస్వామ్యాన్ని నిరంతరం పెంపొందించే రీతిలో ఉద్యమ నిర్మాణం కోసం పాటు బడ్డారు. చాలా సిపిఐఎంఎల్ సంస్థలు, ఇతర సమూహాలు, వామపక్ష ఐక్యత గురించి మాట్లాడుతూ వుంటాయిగానీ విప్లవ ఉద్యమాలను, పోరాటాలను నిర్మించే పనిని ఎప్పుడో వదిలి వేశాయని ఆయన అభిప్రాయపడ్డారు. నిజమైన ఐక్యత ముఠాల మధ్య కాదు, వివిధ వర్గాల ప్రజల మధ్య ప్రజాఉద్యమాల క్రమం లోనే ఏర్పడుతుందని ఆయన భావించారు. అఖిల భారత స్థాయిలో బలమైన విప్లవ సంస్థ కోసం ఆయన తన జీవితాన్నివెచ్చించాడు.
లొంగిపోవడమా? చనిపోవడమా? అన్న ప్రశ్నను, దుస్థితి ని ఎదుర్కొవలసి వచ్చిన నేటి ఉద్యమకారులకు డి బి యం ఆలోచన, ఆచరణ మార్గ దీపంగా ప్రకాశిస్తోంది. తప్పును తెలుసుకోవడమె కాదు దాన్ని సరిదిద్దుకోవడ మూ నేర్పుతూ ఒక విప్లవ ఉత్తేజాన్నికలిగిస్తోంది. అంతటి గౌరవనీయుడు, ప్రేమాస్పదుడు, ప్రజానాయకుడు, ప్రజల న్యాయవాది కనుకనే తన 84 వ ఏట 2009 లో ఫిబ్రవరి 11 ఆయన మరణ వార్త తెలిసిన రోజున, ఫిబ్రవరి 12 అంతిమ యాత్ర రోజున అవిభక్త కోరాపుట్ జిల్లా లోని అన్ని కోర్టులు రోజంతా మూసివేయ బడ్డాయి. ఫిబ్రవరి 12 న పట్టణం మొత్తం స్వచ్ఛంద బంద్ పాటించింది. అన్నిసంస్థలు తమ వ్యాపారాలు మూసి వేసాయి. ప్రజలు తమ ప్రేమ, ఆప్యాయత, ఆరాధన భావాలతో వేల సంఖ్యలో భారీ ఊరేగింపుగా కదలివచ్చి ఆ చిన్న పట్టణాన్ని ముంచెత్తివేశారు. గిరిజనులు, ఇతర రైతులు, కార్మికులు, న్యాయవాదులు అనేక ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు, దాదాపు ప్రతి కుటుంబం వినమ్రంగా చేతులు జోడించి, ఉబికి వస్తున్న కన్నీళ్లతో కడసారి వీడ్కోలు పలికారు. ఇది చిరస్మర ణీయమైన, అరుదైన దృశ్యం. మరణించిన తమ నాయకుడి పట్ల ప్రజలకు ఉన్న గాఢమైన భావానుబంధాలను తెలియజేస్తుంది. ఆయన మరణించిన 16 సంవత్సరాల తరువాత కూడా ప్రజలు అదే భావోద్వేగం తో ఆయన శత జయంతి సందర్భం గా సమావేశమై, ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నారంటే అది ఎంతటి విప్లవోత్తేజకరమైన సందర్భం! అంతటి గొప్ప వ్యక్తి డిబిఎం కు శతవర్ష జన్మదిన నివాళులు అర్పిస్తూ విప్లవోద్యమ నిర్మాణానికి పునరంకిత మవుదాం.
[తేదీ: 30 అక్టోబర్ 2025, ఉదయం 11 గంటలకు. గుణుపూర్ టౌన్ హాల్ లో [ఒడిషా] శత జయంతి సమావేశం సందర్భంగా]

