
పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్
పోతిరెడ్డిపాడు కరువుబండ యాత్రకు జనవరి21, 2026 కు 40 ఏండ్లు
భవిష్యత్ కార్యాచరణ ప్రకటించటానికి జనవరి 21 న తిరుపతిలో గొప్ప సమావేశం జరగబోతున్నది.
రాయలసీమ సమగ్రాభివృద్ధి కోసం 80 వ దశకంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. 1984 లో తెలుగు గంగ పథకం(Telugu Ganga) ప్రవేశపెట్టిన తర్వాత ఉద్యమాల తీవ్రత పెరిగింది. డా.యం.వి.రమణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినారు. తెలుగు గంగ పథకంలోని లొసుగులను వెలుగులోకి తీసుకొచ్చి రాయలసీమ కన్నీటి గాధ అనే మాగ్న కార్టాతో ఒక సంచలనమే సృష్టించినాడు. రాయలసీమ విమోచన సమితి ఏర్పాటు చేసి పలు ప్రాంతాలు తిరిగి జనంలో గొప్ప చైతన్యాన్ని రగిలించినారు.
1984 లో లోనే అనంతపురంలో ఇమాం సారథ్యంలో 'కదలిక' పత్రిక ప్రారంభమై రాయలసీమ సకల సమస్యల మీద ఒక గొప్ప వెలుగును ప్రసరింపజేస్తున్నారు. 'కదలిక'లో నేను రాస్తుండిన వ్యాసాలు ఒక చర్చకు దారితీసింది.
డా.యం వి.మైసురారెడ్డి సమితి అధ్యక్షునిగా రాయలసీమ సమస్యల మీద గళం విప్పటం మొదలుపెట్టినారు.
సరిగ్గా ఆ సమయంలో అప్పటికే మంత్రిగాను, పి.సి.సి.అధ్యక్షునిగాను పని చేసిన డా.వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఎంట్రీ రాయలసీమ ఉద్యమానికి గొప్ప బలాన్ని ఊపును తీసుకొచ్చింది.
రాయలసీమ సంయుక్త కార్యాచరణ సమితి ఏర్పాటయింది. అందరూ దీని గొడుగు కింద ఏ అరమరికలూ లేకుండా రాయలసీమ సమస్యల పరిష్కారమే ఏకైక ఎజెండాగా పని చేయటం మొదలుపెట్టినారు. రాయలసీమ పల్లె పల్లె తిరిగి సభలూ సమావేశాలతో హోరెత్తించారు. 1985 ఆగస్టు లో కర్నూలు కార్యవర్గంలో ఇలా కాదు ఏదో ఒక పెద్ద కార్యక్రమం చేపట్టాలని ‘పోతిరెడ్డిపాడు కరువు బండయాత్ర’ జరపాలని తీర్మానించుకున్నాము.
1986 జనవరి మొదటి తేదీన ప్రారంభమై జనవరి 21న ముగించాలని, 22న పోతిరెడ్డిపాడులో పెద్ద బహిరంగ సభ జరపాలని తీర్మానించుకున్నాము.
లేపాక్షి నుండి డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి, రాయదుర్గము నుండి డాక్టర్ ఎంవి రమణారెడ్డి యాత్రలకు నాయకత్వం వహించారు. తిరుపతి నుండి డా.యం.వి.మైసురారెడ్డి బృందం, మదనపల్లె నుండి భూమన్, సి.హెచ్.చంద్రశేఖరరెడ్డి ,ఎన్.శ్రీధర్ బృందం పాదయాత్రలుగా కదిలినాయి.
లక్ష్యం పోతిరెడ్డి పాడు తూముల సామర్థ్యం లక్ష క్యూసెక్కులకు పెంచాలనేది ప్రధానమయిన డిమాండు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావుగారు పాదయాత్రలకు ఎటువంటి ఆటంకం కలిగించలేదు. అన్ని బృందాలు జనంలో గొప్ప చైతన్యం కలిగిస్తున్నాయి. జనవరి 16 కి అన్ని బృందాలు నంద్యాలలో కలిసి గొప్ప బహిరంగ సభ నిర్వహించినాయి.
17 నుండి యధాప్రకారం పాదయాత్రలు కొనసాగినాయి. ఇక్కడి నుండి డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి బృందం, భూమన్ బృందం కలిసి 21 వరకూ పాదయాత్ర చేసినాయి. పోతిరెడ్డిపాడు తూములు రాయలసీమ నీటి అవసరాలకు’ గేట్ వే ఆఫ్ వాటర్’లాంటిది. ఇదొక్కటే శరణ్యం. ఈ తూముల వినా మరో మార్గం లేదుకృష్ణ నీటిని రాయలసీమకి చీల్చటానికి. ఆ తూముల సామర్థ్యం 11,150 క్యూసెక్కులతో మొదలైంది. ప్రధాన కాల్వ పొడవు 18.8 కిలోమీటర్లు.దీని సర్ లెవెల్ 841 అడుగుల్లో ఉంది. దీని స్థాయిలో తూములకు నీరు చేరటం అసాధ్యం. శ్రీశైలం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. పోతిరెడ్డిపాడు తూముల ద్వారా తెలుగుగంగ,శ్రీశైలం కుడి కాల్వకు నికర నీరు అందాలి. ఈ నీరు అందడం అసాధ్యం. ఆ తర్వాత ప్రకటించబడిన గాలేరు-నగరి కాల్వకి,కె.సి.కెనాల్ కు 10 టియం సి ల నీరు అందడం పెద్ద సమస్య.
ముందు ప్రాజెక్టులను దృష్టిలో ఉంచుకుని దీని సామర్థ్యం లక్ష క్యూసెక్కులకు పెంచాలనేది పాదయాత్ర ప్రధాన డిమాండు. పాద యాత్ర ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి రాష్ట్రంలోని ప్రతి అంగుళానికి నీరు అందించాలని జలయజ్ఞం పేరిట ఒక బృహత్ పథకాన్ని అమలు చేసారు. పోతిరెడ్డిపాడు తూముల సామర్హ్యాన్ని 44,000 క్యూసెక్కులకు నిర్ణయించినారు.
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఉత్తర్వు 69 ద్వారా 834 అడుగుల్లో నీళ్ళు ఉంచాలని నిర్ణయించినారు. ఈ ఉత్తర్వ్యు రాయలసీమకి శరాఘాతమైనది. ఈ లెవల్ నుండి తూములకు నీరు అందటం అసాధ్యం. 854 అడుగుల్లో ఉంటే కొంచెం పర్వాలేదనుకున్నాడు కానీ అది అయ్యే పని కాదు 885 అడుగుల్లో ఉంటేనే సాధ్యం.
రాష్ట్రం విడిపోయిన తర్వాత సమస్య మరింత జటిలమైంది. 69 ప్రభుత్వ ఉత్తర్వ్యు అలాగే ఉంది. హంద్రీ-నీవా,గాలేరు-నగరి,వెలగొండ,తెలుగు గంగ, కె.సి.కెనాల్ కు తూముల నీళ్ళు కావాలి. వరద నీరు 30 రోజులు మాత్రమే. ఈ కాలంలోనే నీటిని సీమకి చేర్చాలి. ఏది మార్గం ?పరిష్కారం ఎట్లా? అటు తెలంగాణా,ఇటు కోస్తా సీమ దగ్గరికి వస్తే కయ్యిమంటాయి.
సరిగ్గా ఈ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చారు. రాయలసీమ దుర్భర ప్రాంతాలకు తాగు,సాగు నీరు కోసం శ్రీశైలం నుంచి 60 టి ఎం సి లు నీటిని తరలించే పనికి శ్రీకారం చుట్టారు. పర్యావరణ అనుమతులు వచ్చేలోగా పనులు చేపట్టాలని నిర్ణయించారు.
ప్రభుత్వాలు మారినాయి.ఇప్పుడు ఆ రాయలసీమ ఎత్తిపోతలకు గండి పడింది. 69 ప్రభుత్వ ఉత్తర్వుతో సంబంధం లేకుండా సిద్దేశ్వరం దగ్గర నుండి ఈ ఎత్తిపోతల ద్వారా 800 అడుగుల నుండి ఈ నీరు తోడుకోవడం వరదల్లో 30 రోజుల్లోనే సుమా ఎవరికీ అభ్యంతరం ఉండనవసరం లేదు.
తెలంగాణ సర్కార్ కల్వకుర్తి ఎత్తిపోతల,పాలమూరు-రంగారెడ్డి,దిండి ఎత్తిపోతల పథకం ద్వారా నిరభ్యంతరంగా నిరంతరం రోజుకు 7 టిఎంసిల నీటిని తరలించుకుని పోతున్నది.
మరి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి చెన్నైకి 15 టిఎంసిలు,తెలుగుగంగకి 29,గాలేరు-నగరికి 38,కె.సి కెనాల్ కు 10 టి ఎం సి లు నీరు కావాలంటే ఏది మార్గం? పరిష్కారం ఎట్లా? శ్రీశైలం నీటిమట్టం తూముల స్థాయి 69 జీవో వీటన్నిటిని పరిగణనలోకి తీసుకుంటే, ఏ ఇబ్బంది కాకుండా ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం మేలు కదా?
ప్రస్తుతం రగులుకుంటున్న విషయమేమిటంటే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబుకి చెప్పి తానే ఆపు చేయించినట్టు తెలంగాణా ముఖ్యమంత్రి అసెంబ్లీలో బాహాటంగా ప్రకటించటం. వెంటనే,పోతిలోకి వచ్చి కాదు,ఆ పథకాన్ని ఆపింది మేమేనని బిజెపి పార్టీ పోటిపడటం ఎంత దుర్మార్గమో ఆలోచించాలి.
రాయలసీమ లాంటి వెనుకబడిన ప్రాంతానికి నీళ్ళు ఇవ్వటానికి ఈ పార్టీలు అన్ని కలగలసి ఎంతటి దుర్మార్గానికి పాల్పడుతున్నాయో సీమవాసులు గ్రహించాలి.
ప్రాణప్రదమైన,సీమకు జీవనది అయిన పోతిరెడ్డిపాడు తూముల సామర్థ్యాన్ని లక్షా 25 వేల క్యూసెక్కులకు పెంచకపోతే ముందుముందు రాయలసీమ కుత్తుక తెగిపోతుంది.
40 ఏళ్ల నాటి పోతిరెడ్డిపాడు కరువు బండ యాత్ర స్ఫూర్తిహో రాయలసీమ ఎత్తిపోతల పథకం,సిద్దేశ్వరం అలుగు నిర్మాణం,గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం తదితర విషయాలు చర్చించటానికి,భవిష్యత్ కార్యాచరణ ప్రకటించటానికి ఈ నెల 21 న తిరుపతిలో గొప్ప సమావేశం జరగబోతున్నది.
Next Story

