తీవ్రవాద రాజకీయాలనుంచి ఆధ్యాత్మికం వైపు...
x

తీవ్రవాద రాజకీయాలనుంచి ఆధ్యాత్మికం వైపు...

నేడు అరబిందో జయంతి


--నందిరాజు రాధాకృష్ణ


ప్రపంచం లో ప్రతి జాతిలోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పునీతులయ్యారు. జాతికి మణిపూసలైన మహానుభావులను తెలుసుకునే ప్రయత్నంలో ఇక్కడ -అరబిందో- గురించి తెలుసుకొనేందుకు కృషి చేద్దాం. ఆయన జన్మదినానికి ఒక ప్రత్యేకత ఉంది. తెల్లదొరల పాలననుంచి విముక్తి కలిగి దేశమాత దాస్య శృంఖలాలు తెగిపోయాయి. స్వాతంత్ర్యం లభించింది.
సుప్రసిద్ధ బెంగాలీ పండితుడు, కవి, జాతీయ వాది, యోగి, గురువు. ఆధ్యాత్మిక సాధనవల్ల అత్యుత్తమ స్థాయికి ఎదిగిన మహనీయుల్లో శ్రీ అరవిందో ఒకరు. ఆయన ఆగస్టు 15, 1872 న కోల్‌కతా లో జన్మించారు. పూర్తి పేరు అరబిందో ఘోష్. అరవింద అనగా బెంగాలీలో పద్మము అని అర్థం. తల్లి స్వర్ణ లతాదేవి. తండ్రి కె.డి.ఘోష్. తండ్రి వైద్యుడు. బ్రిటన్ లో ఉండి అబెర్దీన్ విశ్వ విద్యాలయంలో వైద్యవిద్య నభ్యసించారు.
అరబిందో అద్భుతమైన మేధాశక్తి తో గ్రీక్, లాటిన్‌ వంటి విదేశీ భాషలలో ప్రావీణ్యం సాధించారు. ఐ.సి.యస్. మొదటి స్థానంలో ఉత్తీర్ణులయ్యారు. ఇంగ్లిష్ లో అద్భుత పావీణ్యం సంపాదించారు. తొలుత అరబిందో రాజకీయాల పట్ల అమితాసక్తి ప్రదర్శించారు.

కళాశాలాచార్య పదవి విడిచిన తరువాత అరబిందో ‘వందేమాతరం’ పత్రికా సంపాదకత్వం స్వీకరించారు. అంతకుపూర్వం వారపత్రికగా ప్రచురింపబడుతున్న ఈ ఆంగ్లపత్రిక ఆయన సంపాదకత్వంలో దినపత్రిక అయింది. ఈ పత్రిక మూలంగా జాతీయతత్వం వంగదేశాన్ని ఉర్రూతలూగించింది. అపుడు ఆంగ్లప్రభుత్వం ఆయన మీద రాజద్రోహ నేరంమీద శిక్షించాలని ప్రయత్నించింది. కాని నేరం ఋజువు కాలేదు. అరవిందో ఈ సమయంలోనే 1907 డిసెంబరులో జరిగిన సూరత్ కాంగ్రెస్ సభకు హాజరైనారు. అక్కడ మితవాదులకు జాతీయపక్ష నాయకులైన అరవింద్ లాంటివారి స్వాతంత్య్ర సాధనకు ఎన్నుకోవలసిన మార్గం మీద తీవ్ర విభేదాలు బయలుదేరాయి. తీవ్రవాద జాతీయపక్షనేతలందరు అరబిందో నాయకత్వంతో వేరుగా ఒక సమావేశం జరిపారు. అనుశీలన్ సమితి అనే రహస్య సంస్థగా ఏర్పాటయ్యారు. తమ్ముడు వారీంద్రఘోష్ తో కలసి విప్లవపంథా పట్టారు. దీనివల్లే బ్రిటిష్ ప్రభుత్వం అనుశీలన్ సమితికి చెందిన అనేక మంది మీద ఆలీపూరు బాంబుకేసుపెట్టారు. దీనిమూలంగా అరబిందో జైలుపాలయ్యారు. ఈ ఆలీపూరు కేసులో చిత్తరంజన్ దాస్ వీరికి న్యాయవాదిగా పనిచేసారు.

క్రమేపీ రాజకీయం నుంచి ఆధ్యాత్మికత వైపుకు మళ్ళారు. మొదటగా వడోదరలో మహారాష్ట్ర యోగియైన విష్ణు భాస్కర్ లెలె ఉపదేశంతో ఆధ్యాత్మికత వైపుకు ఆకర్షితుడైనారు. రెండవసారి కోల్‌కతాలోని ఆలీపూర్ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నపుడు ఆధ్యాత్మికత పట్ల గాఢమైన ఆసక్తి కలిగింది. ఇక్కడ ఆయన చేసిన భగవద్గీత పారాయణం, అనుసరణ ఆయనకు అనేక ఆధ్యాత్మిక అనుభూతుల్ని కలిగించాయి.

పుదుచ్చేరిలో నాలుగేళ్ళు ఏకాగ్రతతో యోగాను పాటించి అనంతరం 1914 వ సంవత్సరంలో ఆర్య అనే అరవైనాలుగు పేజీల సమీక్షను మాసపత్రిక రూపంలో వెలువరించారు. తర్వాత ఆరున్నరేళ్ళ పాటు ఆయన ఈ పత్రిక ద్వారానే తన ముఖ్యమైన ధారావాహికంగా రచనలను ప్రజలకు చేరవేసేవారు. ప్రపంచాన్ని సత్యమార్గంలో నడిపించేందుకు యోగ సాధనలో చరిత్ర సృష్టించిన భగవాన్ శ్రీ అరవింద శ్రీ అన్నై పవిత్ర సమాధి తమిళనాడులోని పుదుచ్చేరిలో వెలసి ఉండటం ఎంతో భాగ్యమని ఆధ్యాత్మిక పెద్దలంటూ ఉంటున్నారు. ఆధ్యాత్మికమార్గంలో ప్రపంచంలోని అన్ని వర్గాల ప్రజలను ఒకే త్రాటిపై నడిపించే తరహాలో ఎన్నో శుభకార్యాలు శ్రీ అరవిందర్, అన్నై ఆశీస్సులతో జరిగాయని, ఒక మారు పుదుచ్చేరికి వెళ్లి వస్తే.. జీవితాలు మలుపులు కలుగుతాయని ఆధ్యాత్మిక గురువులు అంటారు. ఆయన ధర్మపత్ని మృణాళిని.
అలాగే శ్రీ అన్నై మాతను స్మరించుకుని ఎలాంటి కార్యాన్నైనా ప్రారంభించేవారికి ఆటంకాలుండవని భక్తుల విశ్వాసం. అలాగే జీవిత సుఖసంతోషాలు కలుగజేసే ఆ దేవదేవుని లీలలెన్నో ఉన్నాయని పుదుచ్చేరి అన్నై అరబిందో ఆశ్రమ స్థల పురాణాలు చెబుతున్నాయి. భగవానుని లక్ష్యాన్ని మానవరూపం ధరించి (అరబిందోగా) పరమాత్ముని లక్ష్యాన్ని నెరవేర్చేందుకు జన్మించి, పుదుచ్చేరి ఆశ్రమంలో జీవించారని ఆధ్యాత్మిక గురువులు చెబుతారు. ప్రపంచ అభివృద్ధి కోసం అరబిందో స్వామి సేవలందించిన సంస్థల్లో పుదుచ్చేరి అరబిందో ఆశ్రమం కీలక పాత్ర పోషిస్తోంది. అంతేగాకుండా అరవింద భగవానుడు రాసిన లైఫ్‌డివైన్, సింథసిస్ ఆఫ్ యోగా, సావిత్రి అన్నై రాసిన మధర్ అజెండాలతో పాటు పలు ఆధ్మాత్మిక రచనలు మానవమాత్రుని జీవితానికి ఎంతగానో సహకరిస్తున్నాయి. అలాగే మానవా భివృద్ధికి అవసరమైన దైవ, ఆధ్యాత్మిక సూచనలు అందిస్తున్నాయి. అటువంటి మహనీయుని ఆధ్యాత్మిక మార్గంలో మానవుడు పయనించేందుకు వీలుగా అరబిందో మహాత్ముని ఉపదేశాలు, ఆధ్యాత్మిక సూచనలు దేశంలోనే గాకుండా.. ప్రపంచవ్యాప్తంగా గల ప్రజలకు మార్గదర్శకం వహిస్తాయి. ఆ మహాపురుషుడు 1950 డిసెంబరు 5న దేహం చాలించారు. ఆ మహానుభావుని జన్మదినాన మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. ఆయన రాసిన ‘ది లైఫ్ డివైన్’ (The Life Divine) ఆయన తాత్విక మార్గాన్ని వివరించే గొప్ప పుస్తకంగా పేరు గాంచింది.ద

(నందిరాజు రాధాకృష్ణ తెలుగు నాట బాగా ప్రసిద్ధి చెందిన జర్నలిస్టు, హైదరాబాద్)

Read More
Next Story