
నారా లోకేష్ , నారా చంద్రబాబు నాయుడు
75 వసంతాల వయస్సులో చంద్రబాబు పెద్ద కోరిక ఏమిటి?
లోకేష్ కు ప్రమోషన్ ఇస్తే కూటమి బీటలు పారుతుందా?మరి లోకేష్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఈ టర్మ్ లో ఉన్నట్లా లేనట్లా?
-వెలది కృష్ణకుమార్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎంతో సాధించారు.ముఖ్యమంత్రి గా సుదీర్ఘకాలం వున్న ఒకరిద్దరి రికార్డులను సమం చేశారు కూడా. ఇప్పుడాయన 75 వసంతాలు పూర్తి చేసుకున్నారు.76వ ఏట అడుగు పెట్టిన చంద్రన్నకు రాష్ట్ర వ్యాప్తంగా,పార్టీ నాయకులు, అభిమానులు ,కార్యకర్తలు ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ప్రపంచ దేశాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రసిద్ధ తిరుమల పుణ్య క్షేత్రంలోనూ చంద్రబాబు పేరున పూజలు నిర్వహించారు.స్టూడెంట్ యూనియన్ నుంచి, పార్టీ సామాన్య కార్యకర్తగా, తొలుత కాంగ్రెస్, ఆ తరువాత తెలుగుదేశం ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేసి, టీడీపీ ఆధినేతగా, ముఖ్యమంత్రి గా ఎదిగిన సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఆయనది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు.. తిప్పుతున్నారు కూడా 75 వసంతాల వయస్సు లో అన్నీ సాధించిన ఆయనకు తీరని కోరిక, ఇంకా చేయాల్సిన పని ఒకటుంది. అదేంటంటారా..మీకు తట్టిందా..? అదే లోకేష్ కు పట్టాభిషేకం.
పుత్రోత్సాహం .. పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు.. జనులా పుత్రునిగనుగొని పొగడగ .. అన్నట్లు.... చంద్రబాబు తనయుడిగా లోకేష్ సాధించింది ఎంతో వున్నా ...ఇంకా అందరి మనస్సులో ఉన్నది... చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రగాఢంగా కోరుకునేది ఇంకా ఏదోవుంది... అదే తండ్రి స్థానానికి తనయుడు ఎదగడం, అంటే ముందు పార్టీ పగ్గాలు , ఆ తరువాత ముఖ్యమంత్రి పీఠం.
చంద్రబాబు నాయుడు అమరావతి,పోలవరం రెండు కళ్లు అంటుండటం మనకు తెలుసు. ఆయనకి మూడో కన్ను లోకేష్. ముందు చెప్పిన రెండుకళ్ల కంటే మూడో కన్నే ముఖ్యం. పోలవరం కొద్ది గా ఆలస్యమయిన పర్వాలేదు. ఎలాగూ ఆలస్యమే అయింది. అమరావతి నిర్మాణం కొద్ది జాప్యం అయినా నష్టం లేదు. ఎందుకంటే, ఇప్పటికే పదేళ్లు వెనకబడింది. ఇంకొంచె జాప్యం అయితే నష్టం లేదు.కాని లోకేష్ పట్టాభిషేకం జాప్యం అయితే కష్టం. తెలంగాణలో కెసిఆర్ కు ఎదురైన పరిస్థితి చంద్రబాబు కు ఎదురవ్వొచ్చు. కొడుకు కెటి రామారావును రెండో టర్మ్ లో ముఖ్యమంత్రి చేయలేకపోయాడు. టిఆర్ ఎస్ ను బిఆర్ ఎస్ చేసి, ఎన్నికల్లో నెగ్గి దక్షిణాది మహారాజులాగా ఢిల్లీ లో వెలిగిపోతే, హైదరాబాద్ నవాబును చేద్దామనుకున్నాడు. కాని ఏమయింది? బిఆర్ ఎస్ అచ్చిరాలేదు. ఆయన ఢిల్లీ కల చెదిరింది. ఉన్న పవర్ పోయింది. కొడుకు ముఖ్యమంత్రి మళ్లీ ఎపుడవుతాడో ఎవరూ చెప్పలేరు. ఆలసించి ఆశాభంగం ఎదుర్కోరాదు. అని తొందరపడితే ...ఏం ప్రమాదం వస్తుందో తెలియదు. ఇది 75వ జన్మదినం నాడు బయటపడని ప్రశ్న.
లోకేష్ కు పార్టీ పగ్గాలు?
తెలుగుదేశం శ్రేణులు ముందుగా కోరుకునేది తెలుగుదేశం అధ్యక్షుడిగా లోకేష్ నియామకం. కొందరు సీనియర్లు లోలోపల లోకేష్ నాయకత్వం పై మదనపడినా, యూత్ లీడర్ గా పార్టీ భవిష్యత్ నాయకుడిగా లోకేష్ పార్టీ బాధ్యతలు చేపట్టాలని అందరూ కోరుకుంటున్న మాట మాత్రం నిజం. నిజానికి ఇప్పటికే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వున్న లోకేష్, కూటమి ప్రభుత్వంలో, అటు పార్టీలో ప్రస్తుతం కీలకపాత్ర పోషిస్తున్నారు.అయినా పార్టీలో యువతకు ఇదో వెలితి , లోకేష్ ని పార్టీ అధినాయకుడిగా చూడాలన్న తపన.
ప్రస్తుతం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో వుంది. టీడీపీ వందకు పైగా సీట్లు, భారీ మెజారిటీతో ఎంతో ధీమా గా పాలన సాగుతోంది. లోకేష్ కూడా గత ఎన్నికల ముందు యువగళం పాదయాత్రలో ప్రజలకు దగ్గరవడమే కాదు, పార్టీ శ్రేణులలోనూ ఉత్సాహం నింపి, పార్టీ గెలుపులో తన వంతు పాత్ర పోషించారు. మరోమారు జిల్లా ల వారీగా పార్టీ కార్యకర్తలను కలవడానికి ప్రణాళిక సిద్దం చేసుకుంటున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి గా వుండి పార్టీ అధ్యక్షుడు గా లోకేష్ ను నియమించడానికి ఆయనకు ఇంతకన్నా మంచి సమయం కూడా దొరకదు. అయితే ఇప్పటికే లోకేష్ కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం లో కూడా లోకేష్ ను ఉపముఖ్యమంత్రి ని చేయాలన్న డిమాండ్ ఇప్పటికే తెరమీదకు వచ్చింది .టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులతో సహా సీనియర్లు లోకేష్ కు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబు ముందే పబ్లిక్ గా డిమాండ్ కూడా చేస్తున్నారు. మరి చంద్రబాబు ఆలోచనలలో ఏముందో మాత్రం బయటపడటం లేదు. పార్టీ పరంగా చంద్రబాబు నిర్ణయానికి తిరుగులేదు. తాను పార్టీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు నుంచి తప్పుకొని లోకేష్ కు పగ్గాలు అప్పగించడం క్షణాల్లో పనే... ప్రస్తుతం టీడీపీ వున్న పరిస్థితి లో ఎవరూ అడ్డుచెప్పేవారు వుండరు.
75 సంవత్సరాల వయస్సులోనూ చంద్రబాబు చలాకీగా రాజకీయాలలో చక్రం తిప్పుతూ, ప్రభుత్వ బాధ్యతలూ నిర్వహిస్తున్నారు, అందరికీ మార్గదర్శకంగా వుంటున్నారు. కాబట్టి ఇప్పడే లోకేష్ కు పగ్గాలు అప్పగించి, దగ్గరుండి పర్యవేక్షణ చేస్తే బాగుంటుందని కొందరు సూచిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రం వున్న పరిస్థితులలో గాడీలో పెట్టాల్సింది ఎంతో వుంది. స్వర్ణాంధ్ర లక్ష్యంగా 2047 టార్గెట్ ను కూడా ఇప్పుడే నిర్థేశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గా చంద్రబాబే వుండి, టీడీపీ బాధ్యత మాత్రం లోకేష్ కు అప్పగిస్తారేమో చూడాలి.
సీఎంగా లోకేష్ ?..ఆలోచన సాధ్యమా?
ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం వుంది. తెలుగుదేశం పార్టీకి తగినంత మెజార్టీ వున్నా, జనసేన, బీజేపీ కూడా కీలకంగా వున్నాయి. హండ్రెడ్ పర్సెంట్ స్టైక్ రేట్ తో కూటమిలో 21 సీట్లు గెలుచుకున్న పవన్ కళ్యాణ్ సారధ్యంలోని జనసేన ప్రభుత్వం లో కీలకంగా వుంది. పవన్ కళ్యాణ్ కూడా ఉప ముఖ్యమంత్రి గా వున్నారు. తెలుగుదేశం పార్టీని కూడా తానే గెలిపంచాననే ధీమాతో , జనసేన శ్రేణులు , ఆఖరికి పవన్ కళ్యాణ్ కూడా వున్నారు. తెలుగుదేశం పార్టీకి తిరిగి జీవం పోసింది తానేనని పవన్ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అనుభవజ్ఞుడైన చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఆయన ప్రభుత్వంలో ఇంకో 15 సంవత్సరాలైనా ముందుకు సాగుతామని , పవన్ కళ్యాణ్ అసెంబ్లీ లోనే చెప్పారంటే.. చంద్రబాబు అనుభవం, పెద్దరికం అందుకు కారణం ఎవరూ కాదనలేని సత్యం.
అలాంటిది చంద్రబాబు స్థానంలో లోకేష్ ను ముఖ్యమంత్రి గా చేయడానికి ప్రస్తుతం వున్న రాజకీయాలు సరిపడవు.అయినా సరే, దాన్ని పట్టించుకోకుండా మంత్రులు లోకేష్ ముఖ్యమంత్రి కావాలని, కాబోయే ముఖ్యమంత్రి లోకేషేనని బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారు. ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి లోకేశ్ అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భరత్ ఆ మధ్య దావస్ యాత్రలో అన్నారు. రాష్ట్రంలోని 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు, రాజ్యసభ సభ్యుల్లో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చదివినవారు ఎవరూ లేరని, లోకేష్ సిఎం పదవికి అన్ని విధాల యోగ్యుడని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే అన్నారు.
మొన్న ఏప్రిల్ మొదటి వారంలో కనిగిరిలో ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి మరొక తరహాలో ఈ ప్రకటన చేశారు. కనిగిరి ఒక శంకుస్థాపనకు వచ్చిన లోకేష్ ని ఆయన ముఖ్యమంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. అంతే కాదు, ‘మన కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్.. అవునా కాదా?’ అని సభలోని జనాన్న అడిగారు. దీంతో వారంతా ‘కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్’ అంటూ గోల గోల చేశారు.
ఇక అమెరికాలో కూడా అదే జరిగింది. నారాలోకేష్ అమెరికా పర్యటనకు వెళ్లినపుడు తెలుగు పార్టీ అభిమానులంతా ఆయనకు ‘కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్’ అంటూ బ్యానర్లతో స్వాగతం పలికారు. మేము గెలవడమే కాదు,తెలుగు దేశం పార్టీని గట్టెక్కించనట్లు భావించే పవన కు ఇది కర్ణకఠోరంగా వినిపించే నినాదమే. ఇక పవన్ అభిమానుల సంగతి చెప్పనవసరం లేదు. వాళ్లు సోషల్ మీడియాలో కారాలు మిరియాలు నూరేస్తున్నారు. కాపులు కూడా చంద్రబాబు వారసుడుపవన్ కల్యాణే అని భావిస్తున్నారు. ఉంటే కూటమి తరపుణ లేదంటే సొంతంగా పవన్ కల్యాణే ముఖ్యమంత్రి అని కాపు యువకులు కల కంటున్నారు. బిజెపిలో మనసులో ఏముందో కాని వాళ్లయితే బయటపడటం లేదు.
అందుకే లోకేష్ ను ఉపముఖ్యమంత్రిని చేసినా అది పవన్ కల్యాణ్ కు చెక్ పెట్టడమేనని జనసే వాళ్లే కాదు,ఎవరైనా భావిస్తారు. ఈ కారణంతో నే లోకేష్ కు ఏవిధమయిన ప్రమోషన్ ఇవ్వడానికి చంద్రబాబు జంకుతున్నారని పిస్తుంది. టీడీపీ కి బలం వుంది కాబట్టి లోకేష్ ను సీఎం గా చూడాలనుకుంటే కూటమి బీటలు వారటం మాత్రం ఖాయం. అంత మాత్రాన లోకేష్ ను డిప్యూటీ ఐనా చేయకుండా ఇంకా ఎంతకాలం చంద్రబాబు లాక్కువస్తారన్న ప్రశ్నకు సమాధానం దొరకాల్సిన అవసరం వుంది.
కేటీఆర్, ఉదయనిధితో లోకేష్ కు పోలిక
తెలంగాణ లో బీఆర్ఎస్ పదేండ్ల పాటు అధికారంలో వున్నా కేసీఆర్ తనయుడి కోరిక తీర్చలేదు. బీఆర్ఎస్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ను ప్రకటించి, మధ్యలో ముఖ్యమంత్రి ని చేస్తే పరిస్థితి మరోలా వుండేదన్న భావం పార్టీ శ్రేణులలో కనిపిస్తోంది. పార్టీ అధికారం కోల్పోయింది కాబట్టి ఇప్పుడు చేసేదేమీ లేదు. కేసీఆర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకోక పోవడమే కేటీఆర్ కు మైనస్ గా మారిందని రాజకీయ పండితులంతా విశ్లేషించారు. చూద్దాం, లోకేష్ కు ఇంకా చాలా టైం ఉందిగా అని జాప్యం చేస్తే... వచ్చే ఎన్నికల్లో ఏదైనా అనుకోనిది జరిగితే అపుడు ఇలాంటి విశ్లేషణలో అమరావతి నుంచి రాస్తారు.
తమిళనాడు డిఎంకే రాజకీయాలు టీడీపీ తో పోలికకు సరిపడతాయి. డిఎంకే అధినేతగా, ముఖ్యమంత్రి గా స్టాలిన్ తన కుమారుడు ఉదయ్ నిధి స్టాలిన్ ను ముందుకు నడుపుతున్నారు. కుమారుడికి తగిన ప్రాధాన్యం ఇస్తూ డిప్యూటీ సీఎం ను చేశారు. మరి 75 సంవత్సరాల జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న చంద్రబాబు తన తనయుడు లోకేష్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
(వెలది కృష్ణ కుమార్, సీనియర్ జర్నలిస్టు, హైదరాబాద్)
Next Story