చంద్రబాబుకు  ఢిల్లీలో దొరికిన సువర్ణావకాశం... సద్వినియోగం చేసుకుంటారా?
x

చంద్రబాబుకు ఢిల్లీలో దొరికిన సువర్ణావకాశం... సద్వినియోగం చేసుకుంటారా?

కన్నెగంటి రవి: ఆంధ్రప్రదేశ్‌తో సహా దేశ రైతులందరి సంక్షేమానికి తోడ్పడే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించేలా కేంద్రంపై టిడిపి. జనసేన పార్టీలు ఒత్తిడి తేవాలి


2024-2025 సంవత్సరానికి గాను 14 రకాల ఖరీఫ్ పంటలకు కేంద్ర క్యాబినెట్ జూన్ 19 న కనీస మద్దతు ధరలను ప్రకటించింది. అయితే సుదీర్ఘ కాలంగా రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నట్లుగా స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం ( సమగ్ర ఉత్పత్తి ఖర్చులకు 50 శాతం లాభం కలిపి) కాకుండా, తప్పుడు పద్ధతుల్లో ఖర్చులు లెక్కించి, ఈ ధరలను ప్రకటించింది. పైగా ఈ ధరలు కూడా ప్రభుత్వం పంటలను కొనుగోలు చేసిన సందర్భంలోనే రైతులకు అందుతున్నాయి. చాలా సందర్భాల్లో రైతుల నుండీ వివిధ పంటలను ప్రైవేట్ వ్యాపారులు కనీస మద్ధతు ధర ( ఎమ్మెస్పీ) కంటే తక్కువకే కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా రైతులు నష్టపోతున్నారు. పెరుగుతున్న ఖర్చులకు, వస్తున్న ఆదాయానికి పొంతన లేక, రైతు కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉంటున్నాయి.

స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం కనీస మద్దతు ధరలను ప్రకటించి, వాటికి చట్టబద్ధత కల్పించాలని 2017 నుండి సాగుతున్న రైతు ఉద్యమంలో ఆంధ్ర ప్రదేశ్ రైతులు కూడా చురుకుగా పాల్గొంటున్నారు. ఢిల్లీ కేంద్రంగా 2020, 2021 సంవత్సరాలలో జరిగిన రైతు ఉద్యమంలో కూడా ఆంధ్ర ప్రదేశ్ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కిసాన్ ముక్తి మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలలో వేలాది మంది రైతులు పాల్గొన్నారు.

2014 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా బీజేపీ పార్టీ నాయకుడిగా నరేంద్ర మోదీ అనేక సభలలో ప్రసంగిస్తూ, తమ పార్టీ అధికారంలోకి వస్తే , స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ గత పదేళ్లుగా రైతులను మోసం చేసినట్లుగానే , రైతు ఉద్యమ ఆకాంక్షలను ఏ మాత్రం పట్టించుకోకుండా ఈ సారి కూడా వ్యవహరించింది.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి. కేంద్రంలో మూడోసారి ప్రధాని కావడానికి మోదీ ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన టీడీపీ , జనసేన పార్టీలపై ఆధార పడ్డారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆంధ్ర ప్రదేశ్‌తో సహా దేశ వ్యాప్తంగా రైతుల సంక్షేమమే లక్ష్యంగా కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించేలా కేంద్రంలో NDA కూటమి ప్రభుత్వం పై తెలుగుదేశం , జనసేన పార్టీలు ఒత్తిడి తెచ్చేలా, ఆంధ్ర ప్రదేశ్ రైతు ఉద్యమం బలంగా డిమాండ్ చేయాలి.

ఇందుకోసం ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి నూతన అవకాశాలు ముందుకు వచ్చాయి. ఈ లక్ష్య సాధనకు వివిధ రాజకీయ పార్టీలను, రైతు సంఘాలను, దళిత, ఆదివాసీ, మహిళా సంఘాలను కలుపుకుని నూతన తరహాలో రైతు ఉద్యమాన్ని బలోపేతం చేయాలి. అప్పుడే గత ఏడేళ్లుగా సాగుతున్న రైతు ఉద్యమానికి ఫలితం దక్కుతుంది.

వ్యవసాయ ఖర్చుల, ధరల నిర్ణాయక కమిషన్ ( CACP) ప్రతి సంవత్సరం కనీస మద్దతు ధరలను సిఫారసు చేయడంతో పాటు, రైతులకు ఉపయోగపడే అనేక కీలక సిఫారసులను కూడా చేస్తుంది. కానీ ప్రభుత్వం మద్దతు ధరలను ప్రకటించడం తప్ప మిగిలిన సిఫారసుల వైపు దృష్టి సారించడం లేదు. వ్యవసాయ మార్కెట్‌లు, ధరల వ్యవస్థను రాను రానూ రైతులకు మేలు చేసే వైపు కాకుండా, రైతులను దోచుకునేలా కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడానికి వేగంగా చర్యలు చేపడుతున్నది.

2020 లో తెచ్చిన మూడు కార్పొరేట్ వ్యవసాయ చట్టాలు అందులో భాగమే. రైతు ఉద్యమం ఫలితంగా ఇవి వెనక్కు వెళ్ళిన విషయం మనకు తెలుసు. కానీ కేంద్రం తన ప్రయత్నాలను మానుకోలేదు. ధరలు బాగా పడిపోయిన సమయంలో రైతులు తమ ఉత్పత్తులను దాచుకోవడానికి వీలుగా గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వమే పెట్టుబడులు పెట్టి, కొత్త గిడ్డంగుల నిర్మాణం చేపట్టక పోగా, కేంద్ర ప్రభుత్వం, భారత ఆహార సంస్థ ఆధ్వర్యంలోని గిడ్డంగుల నిర్వహణను కూడా అదానీ , రిలయెన్స్ లాంటి బడా కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నది. CACP కొన్ని ముఖ్యమైన సిఫారసులు చేసింది. వాటిని ప్రభుత్వాలు పాటించాలి.

సగటు ఉత్పాదకత పెంపు కోసం చర్యలు చేపట్టాలి. గడచిన సంవత్సరాల్లో దేశంలో పంట దిగుబడులు గణనీయంగా మెరుగుపడినప్పటికీ ప్రపంచ సగటు, సంభావ్య దిగుబడుల కంటే చాలా తక్కువగా ఉన్నాయి. పైగా కొన్ని రాష్ట్రాల్లో అనేక ముఖ్యమైన పంటలలో ఉత్పాదకత స్తంభించి పోయింది. అందువల్ల, ఉత్పాదకతను పెంపొందించడానికి శాస్త్రీయ నిర్వహణ పద్ధతులు, శాస్త్రీయ పంటల యాజమాన్య పద్ధతులను, నీటి వినియోగ విధానాలను మెరుగు పరుచుకోవాలి. నాణ్యమైన విత్తన రకాలను ఉపయోగించాలి. వాతావరణ మార్పుల నేపథ్యంలో అధిక ఉత్పాదకతను సాధించడానికి నాణ్యమైన ఉపకరణాలను ఉపయోగించాలి. రైతులకు విస్తరణ సేవలను మరింత మెరుగు పరచాలి. వ్యవసాయ పరిశోధనల కోసం, నీటిపారుదల సౌకర్యాల మెరుగుదల కోసం బడ్జెట్లో కేటాయింపులను పెంచాలి.


పప్పు ధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తిలో స్వావలంబన సాధించాలి. దేశంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదల ఉన్నప్పటికీ, మినుములు, కందులు లాంటి పప్పుల కోసం భారతదేశం ఎక్కువగా దిగుమతులపై ఆధార పడుతున్నది. అందువల్ల, ఆయా పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి నిర్ధిష్ట కార్యాచరణ చేపట్టాలి. పప్పు ధాన్యాల విస్తీర్ణం పెంపు కోసం, సగటు దిగుబడుల పెంపు కోసం దిగుబడి ప్రత్యేక ప్రయత్నాలు చేస్తూనే, ప్రభుత్వం వైపు నుండీ పప్పు ధాన్యాల సేకరణ వ్యవస్థను బలోపేతం చేయాలి.


రైతులకు లాభసాటి ధరలను అందించడానికి ధర మద్దతు పథకం (PSS) కింద కందులు, మినుములు, మసూర్ పప్పులు సేకరణ విషయంలో 2023-2024 లో పెట్టిన 40 శాతం సేకరణ సీలింగ్‌ ను తదుపరి 2-3 సీజన్‌ల వరకూ తొలగించాలి. అంటే 40 శాతానికి పరిమితం కాకుండా మరింత పెద్ద మొత్తంలో పప్పు ధాన్యాలను సేకరించాలి.

గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశ ప్రజల అవసరాలను తీర్చడానికి వంట నూనెల కోసం ఇతర దేశాల నుంచి దిగుమతులపై ఆధార పడటం బాగా పెరిగింది. దేశీయ వంట నూనెల వినియోగంలో దాదాపు 60 శాతం దిగుమతుల ద్వారా సమకూరుతోంది. ఈ పరిస్థితి మారాలంటే నీటి పారుదల ప్రాంతాలలో నూనెగింజల సాగును ప్రోత్సహించడానికి, దిగుబడిని మెరుగుపరచడానికి చర్యలు చేపట్టాలి. నూనె గింజల ఉత్పత్తిదారులకు లాభదాయకమైన ధరలను చెల్లించాలి. ఆవాలు, సోయాబీన్, పొద్దు తిరుగుడు, వేరుశనగ మొదలైన ప్రధాన నూనె గింజలకు కూడా వంట నూనెలపై జాతీయ మిషన్‌ను విస్తరించాలి.

దేశీయ నూనె గింజల రైతులను, శుద్ధి పరిశ్రమలను వంటనూనెల దిగుమతులు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి, నూనెగింజలకు కనీస మద్దతు ధరలను నిర్ణయించడంలో దేశీయ కనీస మద్దతు ధరలు, మరియు అంతర్జాతీయ మార్కెట్ లో వంట నూనెల ధరలను ప్రాతిపదికగా ఉంచుకోవడంతో పాటు, ముడి చమురు, శుద్ధి చేసిన చమురు మధ్య సుంకం వ్యత్యాసాన్ని 10-15 శాతం దాటకుండా చూడాలి.


వరికి ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం అందించాలి. వరి సాగు వలన కొన్ని రాష్ట్రాలలో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. నేల ఆరోగ్యం కూడా క్షీణిస్తోంది. పర్యావరణం పై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది. గ్రీన్‌ హౌస్ వాయు ఉద్గారాలు ఎక్కువగా వెలువడుతున్నాయి. అదనంగా, కనీస మద్దతు ధరలతో సేకరణ, సాగు నీటి కోసం విద్యుత్ సబ్సిడీ లాంటివి, పంటల పొందికలో అసమతుల్యతకు దారితీస్తున్నాయి. పైగా వరి విస్తీర్ణం పెరగడమనే పరిణామం ఆహార బాస్కెట్ లో ఉండాల్సిన చిరు ధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, పండ్లు మరియు కూరగాయలు తదితర పంటలకు వ్యతిరేకంగా తయారైంది. సుస్థిర వ్యవసాయ పద్ధతులు, డిమాండ్- ఆధారిత ఉత్పత్తి విధానాన్ని ప్రోత్సహించడానికి, చిరు ధాన్యాలు (శ్రీ అన్న) , పప్పు ధాన్యాలు, నూనెగింజలను ప్రోత్సహించడానికి వీటికి కనీస మద్ధతు ధరలను భారీగా ప్రకటించడంతో పాటు, ఇతర నిర్ధిష్ట చర్యలను కూడా చేపట్టాలి.

ప్రభుత్వ పంటల సేకరణ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలి. వరి ధాన్యం సేకరణ కొన్ని రాష్ట్రాలలో అక్కడి ఉత్పత్తికి తగినట్లుగా ఉండడం లేదు . ముఖ్యంగా తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ బీహార్ రాష్ట్రాలలో సేకరణ వ్యవస్థలను బలోపేతం చేసి ధాన్యం సేకరణలో ఆయా రాష్ట్రాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి.

దేశంలో చిరు ధాన్యాలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. కానీ కేంద్ర ప్రభుత్వం చిరు ధాన్యాల సేకరణలో ఇప్పటికీ చాలా వెనుకబడి ఉంది. అందువల్ల రాష్ట్రాలు ఈ విషయంలో చొరవ చేసి తమ రాష్ట్రాలలో సేకరణ చేయడంతో పాటు, కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఆహార భద్రత చట్టం క్రింద వాటిని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందించాలి.

సాగు నీటి వినియోగ సామర్థ్యాన్ని మరింత పెంచడానికి ప్రధానమంత్రి కృషి సించాయి యోజన క్రింద మైక్రో ఇరిగేషన్ వ్యవస్థలను విస్తృతంగా రైతుల పొలాలలోకి తీసుకు వెళ్ళాలి. గతంతో పోల్చినప్పుడు ఈ వ్యవస్థలు పెరిగినప్పటికీ, అవి తమిళనాడు, కర్ణాటక లాంటి కొన్ని రాష్ట్రాలకే పరిమితమవుతున్నాయి. అన్ని రాష్ట్రాలలో సన్న, చిన్నకారు రైతులను భాగస్వాములను చేస్తూ డ్రిప్, స్ప్రింక్లర్ లాంటివి సబ్సిడీపై అందించాలి.

వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహించడానికి కస్టమ్ హైరింగ్ సెంటర్స్ లాంటివి గ్రామీణ ప్రాంతాలలో ఏర్పాటు చేయాలి. సన్నకారు రైతులకు ఉపయోగపడేలా, చిన్న పనిముట్లు, యంత్రాలను కంపెనీలు తయారు చేయాలి.

వ్యవసాయంలో డీజిల్ వినియోగాన్ని తగ్గించడానికి వీలుగా, విద్యుత్ వినియోగాన్ని పెంచడానికి వీలుగా, సౌర విద్యుత్ వినియోగాన్ని రైతుల వ్యవసాయంలో పెంచేలా PM – kusum పథకాన్ని రాష్ట్రాలు వినియోగించుకోవాలి.

గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం “ వ్యవసాయంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి” నుంచి ఆర్థిక నిధులు పొంది ( కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ + బ్యాంకు రుణం పై వడ్డీ రాయితీ ) రాష్ట్రాలు రైతు సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీల ఆధ్వర్యంలో నిర్మించాలి.

గ్రామీణ ప్రాంతంలో రైతు సహకార సంఘాలను, స్వయం సహాయక బృందాలను, రైతు ఉత్పత్తిదారుల కంపెనీలను ఏర్పాటు చేయడం ద్వారా, రైతులు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించడానికి పూనుకోవాలి. ఆయా సంఘాలు నడిపే వారి సామర్ధ్యాలను పెంచాలి.

ఇన్ని మంచి సూచనలు చేసిన CACP సంస్థ , వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థలో మూడు చట్టాల సారాంశాన్ని కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా మళ్ళీ ముందుకు తొయ్యడానికి సూచనలు కూడా చేసింది. ముఖ్యంగా ప్రభుత్వ మార్కెట్‌లలో సెస్ లను, పన్నులను పూర్తిగా తగ్గించాలని, రాష్ట్రాలు రైతులకు పంటలపై అదనపు బనస్ ప్రకటించడం మానుకోవాలని సూచించింది. ఈ పన్నులు, బోనస్ లు మార్కెట్ నుండీ ప్రైవేట్ వ్యాపారులను తరిమేస్తున్నాయని బాధ పడింది.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ముందు ఇప్పుడు రెండు బాధ్యతలు ఉన్నాయి. CACP సంస్థ చేసిన రైతు అనుకూల సిఫారసులను ఆమోదించి, అమలుకు తమ స్థాయిలో ప్రయత్నం చేయడం, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మిగిలిన సిఫార్సులను అమలు చేయించుకోవడం జరగాలి. ముఖ్యంగా కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత సాధించే విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి , ప్రధాన రాజకీయ పార్టీలకు ఎక్కువ బాధ్యత ఉంది.

Read More
Next Story