ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల 10,000 కంటే ఎక్కువ జనాభా కలిగిన మేజర్ గ్రామ పంచాయతీలను ‘రూర్బన్ పంచాయతీలు’ అనే కొత్త పరిపాలనా విభాగంలోకి చేర్చాలని నిర్ణయించింది. వాస్తవానికి మనం గమనించినట్లైతే గ్రామం, పట్టణం అనే విభజన ఇప్పుడు అనేక మేజర్ గ్రామ పంచాయతీలలో స్పష్టంగా కనిపించదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తీసుకొస్తున్న ‘రూర్బన్ పంచాయతీల’ ఏర్పాటును కేవలం పరిపాలనా సంస్కరణగా మాత్రమే చూడాలా? లేక గ్రామీణ సమాజంలో గత రెండు దశాబ్దాలుగా జరుగుతున్న పట్టణ ఆకాంక్షలతో కూడిన జీవన విధానం, ఆర్థిక–సామాజిక మార్పులను ప్రతిబింబించే విధానపరమైన నిర్ణయంగా అర్థం చేసుకోవాలా అనే ప్రశ్న ఎదురవుతోంది.
గత ఇరవై సంవత్సరాలుగా గ్రామీణ జీవనోపాధి నిర్మాణంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు గ్రామాల్లో వ్యవసాయం మాత్రమే ప్రధాన జీవనోపాధిగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి క్రమంగా మారుతోంది. అనేక కుటుంబాలు రోజువారి జీవనోపాధి కోసం సమీప పట్టణాలకు వెళ్లి కూలీ పనులు చేయడం, నిర్మాణ రంగంలో పనిచేయడం, అసంగాతిత రంగంలో పనిచేయడం, చిన్న చిన్న వ్యాపారాలు చేయడం వంటి ఉపాధి అవకాశాలపై ఆధారపడుతున్నాయి. అంటే నివాసం గ్రామంలో ఉన్నప్పటికీ ఉపాధి, ఇతర ఆర్థిక కార్యకలాపాలు మాత్రం పట్టణ ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉంటున్నాయి.
అదే విధంగా గ్రామాల్లోని వ్యవసాయ భూమి వినియోగంలో కూడా స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఒకవైపు పట్టణాలకు దగ్గరగా ఉన్న వ్యవసాయ భూములు క్రమంగా వ్యవసాయేతర భూములుగా మారుతుండగా, మరోవైపు గత కొన్ని సంవత్సరాలుగా కొత్త రహదారులు, పోర్టులు, కారిడార్లు, హౌసింగ్ ప్రాజెక్టులు వంటి అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాలను పట్టణాలతో మరింత అనుసంధానించాయి. దీని ప్రభావంగా గ్రామాల చుట్టుపక్కల ఉన్న భూముల ధరలు వేగంగా పెరిగి, వ్యవసాయ భూములు ఇతర అవసరాలకు మారుతున్నాయి. రహదారులకు దగ్గరగా ఉన్న పంటల భూములు ఇప్పుడు ఇళ్ల నిర్మాణం, హోటళ్ళు, గిడ్డంగులు, ఇతర చిన్న వ్యాపార కార్యకలాపాలకు ఉపయోగించబడుతున్నాయి. ఈ పరిస్థితిలో భూమి కేవలం వ్యవసాయ ఉత్పత్తి కోసం ఉపయోగించే వనరు మాత్రమే కాకుండా, కొనుగోలు–అమ్మకాల ద్వారా లాభం పొందే ఒక మార్కెట్ ఆస్తిగా మారుతోంది.
ఈ మార్పులు గ్రామీణ సమాజ నిర్మాణాన్ని కూడా ప్రభావితం చేస్తున్నాయి. గ్రామం, పట్టణం మధ్య ఉన్న భేదం క్రమంగా తగ్గిపోతూ ప్రజల జీవనశైలి పట్టణాలకు దగ్గరగా మారుతోంది. అంటే గ్రామం పూర్తిగా గ్రామంగానూ ఉండడం లేదు; అదే విధంగా పట్టణంగా కూడా మారడం లేదు. మధ్యలో రూరల్–అర్బన్ లక్షణాలు కలిసిన “రూర్బన్” అనే ఒక కొత్త సామాజిక రూపం క్రమంగా ఏర్పడుతోంది.
అయితే ఈ మార్పులను సామాజిక శాస్త్ర దృష్టికోణంలో పరిశీలించినప్పుడు, గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు కేవలం అభివృద్ధి చర్యల ఫలితంగా మాత్రమే కాకుండా, భూమి వినియోగంలో మార్పులు, ఉపాధి అవకాశాల రూపాంతరం, సామాజిక-ఆర్థిక అసమానతల విస్తరణ వంటి పరస్పర సంబంధిత అంశాలతో లోతుగా ముడిపడి ఉన్నాయని స్పష్టమవుతుంది. ఇటీవలి కాలంలో వివిధ రకాల మౌలిక వసతుల ప్రాజెక్టులు, పారిశ్రామిక విస్తరణలు, రవాణా మార్గాల అభివృద్ధి వంటి కార్యక్రమాల ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములు క్రమంగా పారిశ్రామిక, వాణిజ్య, నివాస అవసరాలకు మారుతున్న మారుతున్న ప్రక్రియ స్పష్టంగా కనిపిస్తోంది.
దీని ఫలితంగా భూమి వ్యవసాయ ఉత్పత్తి వనరుగా ఉండటాన్ని క్రమంగా కోల్పోయి, పెట్టుబడి, లాభాల సాధనంగా మారుతున్నది. ఈ మార్పు కొంతమంది భూస్వాములకు ఆర్థిక లాభాలను అందించినప్పటికీ, గ్రామీణ సమాజంలో వ్యవసాయాధారిత జీవనోపాధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా భూమిలేని కూలీలు, చిన్న సన్నకారు రైతుల పరిస్థితి మరింత అస్థిరంగా మారుతోంది. వ్యవసాయ కార్యకలాపాలు తగ్గిపోవడం వల్ల గ్రామీణ ఉపాధి అవకాశాలు క్షీణించి, భూమి లేని కుటుంబాలు ఉపాధి అస్థిరతను, ఆదాయ అనిశ్చితిని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతోంది.
ఈ నేపథ్యంలో రూర్బన్ పంచాయతీలు అనే కొత్త పరిపాలనా నమూనా కేవలం మౌలిక సదుపాయాల పరిపాలనకు మాత్రమే పరిమితం కాకూడదు. భూమి వినియోగంపై స్పష్టమైన విధానం, వ్యవసాయ భూముల పరిరక్షణ, స్థానిక ఉపాధి అవకాశాల సృష్టి, గ్రామీణ అసమానతలను తగ్గించే చర్యలు కూడా సమాంతరంగా తీసుకోవాలి. లేదంటే ఈ మార్పులు గ్రామీణ సమాజాన్ని స్థిరమైన అభివృద్ధి దిశగా తీసుకెళ్లకుండా, భూమి మార్కెట్ల ప్రభావంలో మరింత అసమానతలు పెరగడానికి దారి తీసే అవకాశం ఉంది.
పేరు మార్పడి కాదు, నిధులు, స్వయంప్రతిపత్తి ముఖ్యం
పంచాయతీలు మేజర్ అయినా, మైనర్ అయినా, ఇప్పుడు రూర్బన్ అనే కొత్త పేర్లు వచ్చినా—దేశంలో అసలు సమస్య ఎంపవర్‌మెంట్. ఒకవైపు స్థానిక సంస్థలకు అధికారాల బదిలీ సరిగా జరగడం లేదు, మరోవైపు అవసరమైన నిధులు కూడా సమయానికి ఇవ్వడం లేదు. అభివృద్ధి పనులు చేపట్టినప్పటికీ, ఆ పనులకు సంబంధించిన నిధులు విడుదల కాక చాలా చోట్ల సర్పంచులు తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో సర్పంచులు ఆత్మహత్యలకు కూడా పాల్పడిన సంఘటనలు కనిపిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం పంచాయతీల కోసం కేటాయించే నిధులను రాష్ట్రాలు పూర్తిగా గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా ఇతర అవసరాలకు మళ్లిస్తున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. పేర్లు మార్చడం, కొత్త పథకాలు ప్రకటించడం మాత్రమే సరిపోదు. పంచాయతీలకు తగిన నిధులు, స్వయంప్రతిపత్తి (అటానమీ) ఇవ్వకపోతే “రూర్బన్” అనే ఆలోచన కేవలం పేరుకే పరిమితం అవుతుంది. గ్రామాలకు వాస్తవ ప్రయోజనం ఉండదు. ప్రస్తుతం నిధుల కొరతతో అనేక పంచాయతీలు, సర్పంచులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది.
గ్రామాలు, పట్టణాల మధ్య ఉన్న సరిహద్దులు క్రమంగా మసకబారుతున్న తరుణంలో కొత్త పరిపాలనా నమూనాలు అవసరమైనప్పటికి ఆ నమూనాలు గ్రామీణ సమాజంలోని వాస్తవ ఆర్థిక–సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అమలు చేసినప్పుడే అవి నిజమైన అభివృద్ధికి దోహదపడతాయి. లేదంటే ‘రూర్బన్ పంచాయతీలు’ గ్రామాల రూపాన్ని మార్చినా, గ్రామీణ జీవనోపాధుల సంక్షోభాన్ని మాత్రం పరిష్కరించలేవు.