
భారత మెరైన్ ఎకానమీ 'కేంద్రీకృతం' అవుతున్నదా?
ప్రధాని మోదీ ‘సముద్ర సే సమృద్ది’ ప్రసంగంలో ఆంధ్రా ప్రస్తావనే లేదు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ మరో ఐదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి ఉంటే ఎలా ఉండేదో కానీ, అది జరగగక పోవడంతో విడిపోయిన ఏపీ రాష్ట్ర పునర్నిర్మాణ ఆంతర్యం అమలుకు అతిపెద్ద అడ్డంకి ఏర్పడింది.
దాంతో ఆగ్నేయ తీరాన ఇండియా ‘జియో-పాలిటికల్’ అవసరాల కోసమని ఏపీ తీరం గురించి యూపీఏ (UPA) తలపోసింది జరగలేదు. ఇప్పటి ఢిల్లీ దృష్టి వేరు, దాంతో ఇక్కడ అధికారంలోని టిడిపి, వైసీపీ ప్రభుత్వాలు అవి తమ సొంత ఏజెండాలు అమలు చేయడంతో, ఏపీని తెలంగాణ నుంచి వేరు చేసిన భారత ప్రభుత్వం ఉద్దేశ్యం ఇప్పట్లో జరిగేట్టుగా లేదు. చివరికి ఎన్డీఏ మూడవ ‘టర్మ్’లో మెజారిటీ చాలక అది టిడిపి మద్దత్తుతో అధికారంలో ఉన్నప్పటికీ కూడా, ఈ వైఖరిలో ఇంకా మార్పు కనిపించడం లేదు.
ఈ పూర్వ రంగంలో సరిగ్గా నెల క్రితం విశ్వకర్మ జయంతి రోజు సెప్టెంబర్ 20న ప్రధాని నరేంద్ర మోడి గుజరాత్ సౌరాష్ట్ర ప్రాంతంలో భావనగర్- ‘సముద్ర సే సమృద్ది’ సభలో రూ. 34.200 కోట్ల ‘మెరైన్’ ప్రాజెక్టులు ప్రకటించి, గంటసేపు చేసిన ప్రసంగ విషయాన్ని ఏపీ తీరం దృష్టి నుంచి సమీక్షించక తప్పడం లేదు.
ఇటీవల సర్వే ఆఫ్ ఇండియా, కేంద్ర పోర్టులు, షిప్పింగ్ మంత్రిత్వశాఖ కొత్త టెక్నాలజీతో మనదేశ సముద్ర తీరాలు లెక్కలు వేసి 29 ఏప్రెల్ 2025న దాన్ని ప్రకటించింది. దాంతో ఇన్నాళ్ళూ మనం అనుకున్నట్టుగా ఏపీ సముద్ర తీరం 970 కిమీ కాదు అది 1.053.07 కిమీ అని తేలింది. మరి ప్రభుత్వశాఖల్లో ఉండే ఈ ఖచ్చితత్వం మన ‘పొలిటికల్ గవర్నెన్స్’లో ఎందుకు కనిపించదు, అనే ‘అకడమిక్’ చర్చకు ప్రధాని మోదీ భావనగర్ ప్రసంగం దారి తీసింది.
యాభై ఏళ్ల నాటి భారత పోర్టులు, షిప్పింగ్ పరిశ్రమ గురించి ప్రధాని ప్రసంగం మొదలై అదిలా సాగింది- “ఒకప్పుడు స్వదేశీ నిర్మిత నౌకలు ద్వారా 40 శాతం మన రవాణా సాగేది. అటువంటిది మన నౌకానిర్మాణ రంగాన్ని బలోపేతం చేయకుండా, విదేశీ నౌకలకు అద్దె చెల్లించడం మీద మనం శ్రద్ద పెట్టాము. దాంతో, పూర్తిగా దానిపై ఆధారపడాల్సి రావడంతో మన నౌకావాణిజ్యంపై వచ్చే రెవెన్యూ 40 శాతం నుంచి 5 శాతానికి పడిపోయింది. ఈ రోజున 95 శాతం విదేశీ నౌకలతో మన వాణిజ్యం సాగడంతో దేశానికి తీవ్రమైన నష్టం జరుగుతున్నది. అందుకు ఏటా ఆరు లక్షల కోట్లు విదేశీ ప్రయివేట్ షిప్పింగ్ కంపెనీలకు చెల్లిస్తున్నాము.
అందుకని ఈ రోజున భారత్ నౌకావాణిజ్య వృద్దికి ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని, ఒక విధానపరమైన సంస్కరణను అమలు చేస్తున్నాము. భారీనౌకల సర్వీస్ ఇక ముందు మౌలిక వసతులు (‘ఇన్ఫ్రాస్ట్రక్చర్’) కేటగిరీ క్రిందికి తెస్తున్నాము. అటువంటి గుర్తింపు ఉంటే, బ్యాంకులు నుంచి ‘షిప్ బిల్డింగ్’ కంపెనీలకు తక్కువ వడ్డీకి లోన్లు దొరకుతాయి. ఆ రంగానికి ఉండే అన్ని రాయతీలు వీటికి కూడా లభిస్తాయి. అందువల్ల ప్రపంచ మార్కెట్ తో మన షిప్పింగ్ కంపెనీలు పోటీ పడతాయి. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా 2007లో ‘మెరైన్’ రంగంలో మనం అన్వేషించవలసిన అవకాశాలు గురించి ఒక పెద్ద సదస్సు జరిపాను. అలా అప్పట్లోనే ఈ రాష్ట్రం నుంచి షిప్ బిల్డింగ్ ‘ఎకో సిస్టమ్’ పెరగడం మొదలయింది. ఇప్పుడు దాన్ని మేము దేశమంతా అమలు చేస్తున్నాము.
ఒక ‘రీసెర్చి’ ప్రకారం ‘షిప్ బిల్డింగ్’ రంగంపై ఒక రూపాయి ఖర్చుపెడితే, అది రెండింతలై మనకు తిరిగివస్తుంది. ‘షిప్ యార్డు’లో ఒక ఉద్యోగం మనం సృష్టిస్తే, బయట ‘సప్లై చైన్’ మార్కెట్లో ఆరు ఏడు కొత్త ఉద్యోగాలు పుడతాయి. అంటే, వంద ఉద్యోగాలు ఇక్కడ వస్తే, బయట ఆరు వందల మందికి వేర్వేరు రంగాల్లో పని దొరుకుతుంది.
అలా పదకొండు ఏళ్ల క్రితం మనం పోర్టులు ద్వారా జరగాల్సిన అభివృద్దికి లక్ష్యాలు పెట్టుకుంటే, అవిప్పుడు ఫలితాలు ఇస్తున్నాయి. ఈ కాలంలో మన పోర్టుల కెపాసిటీ రెట్టింపు అయింది. మన పోర్టుల్లో 2014 వరకు ‘టర్న్ ఎరౌండ్’ టైమ్ (పోర్టు బెర్త్ వద్దకు నౌక వచ్చి తిరిగి వెళ్ళే సమయం) రెండు రోజులు పడితే, అదిప్పుడు ఒక రోజు లోపే పూర్తి అవుతున్నది. అంతర్జాతీయ నౌకా వాణిజ్యంలో పది శాతంగా ఉన్న మన వాటా 2047 నాటికి మూడింతలు పెంచాలనేది మన లక్ష్యం. నౌకావాణిజ్యం పెరగడం అంటే, నావికుల (‘సీ ఫేరర్స్’) అవసరం కూడా పెరుగుతుంది. వాళ్ళు అన్నిసీజన్లలో సముద్రం మీద ఉండడానికి సుశిక్షితులైన దేహధారుఢ్యం ఉన్నవారై, నౌక ఇంజన్ పనితీరు దాని మెకానిజం, దానిపై జరిగే అన్ని పనుల్లో సహాయంగా ఉండేవాళ్ళై ఉండాలి.
పదేళ్ళ క్రితం మన దేశంలో వీళ్ళు 1 లక్ష 25 వేలు ఉండేవారు. ఈ రోజున అది మూడు లక్షలు దాటింది. ప్రపంచ దేశాలకు వీరిని సరఫరా చేసే మూడు దేశాల్లో ఈరోజు మనం ఉన్నాము. ఇక్కడి మన ఐక్యతా చిహ్నం పటేల్ విగ్రహం మాదిరిగా ప్రపంచ స్థాయి నౌకావాణిజ్య మ్యూజియం ‘లోథాల్’ (గుజరాత్)లో సిద్దం అవుతున్నది. పాత నౌకలను ధ్వంసం చేసే (‘షిప్ బ్రేకింగ్’) భారీ యూనిట్ ను ‘అలంగ్’ (గుజరాత్) లో ఏర్పాటు చేస్తున్నాము. రాబోయే రోజుల్లో యువతకు ఈ రంగం వల్ల విశేషమైన ఉపాధి దొరుకుతుంది” ఇలా మన ప్రధానమంత్రి మోదీ ప్రసంగం ఆ రోజు సాగింది.
ఇది జరిగిన వారంలోపే ‘కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ’ రీసెర్చ్ స్కాలర్ సంగమూన్ హన్సింగ్ (Sangmuan Hangsing) ఒక ఆంగ్ల పత్రికకు రాసిన వ్యాసంలో “ఇండియా ఎగుమతుల ఎకానమీ అంతా కొన్ని చోట్ల కేంద్రీకృతమై ఉందని, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక 70 శాతం నౌకా వాణిజ్యం చేస్తుంటే, అందులో గుజరాత్ వాటా 40 శాతంగా ఉంది. రాజకీయంగా అన్నింటా ముందు ఉండే ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ లో అది 5 శాతం మాత్రమే” అంటున్నారు. నిజానికి మోదీ ప్రసంగం ఆసాంతం చూస్తే, అందులో పదేళ్లనాడు ఏర్పడిన కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన లేదు.
కేంద్ర ప్రభుత్వం ఈ ‘సముద్ర సే సమృద్ది’ సభ ఏ విశాఖలోనో పెట్టి ఆ రంగం ‘ఫోకస్’ ఇక్కడ పెంచవచ్చు. ఇటీవల విశాఖలో జరిగిన ‘మెరైన్ సమ్మిట్’ లో “ప్రతి 50 కిమీకు ఒక పోర్టు లేదా హార్బర్ ఉండాలి అనేది నా కల” అని ముఖ్యమంత్రి అన్నారు. మరి సముద్ర ప్రధానంగా మనం దృష్టి పెడితే, ఉపాధి ఎలా పెరుగుతుందో ప్రధాని చెబుతుంటే, సముద్రం ఒడ్డున ‘డేటా సెంటర్’ అంటుంటే, మన ప్రణాళికల్లో వాస్తవికత ఎక్కడ ఉంది. ఈ పదేళ్ళలో ‘మెరైన్’ రంగంలో జరిగిన పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ఏ కొంచమైనా మొదలయింది అంటే, అది ‘కోవిడ్’ రోజుల్లో కూడా వైసీపీ కాలంలోనే జరిగింది.