నిన్న మొన్నటి దాకా అమరావతిని భ్రమరావతి అంటూ వచ్చారు. 2019-2024 అమరావతి నిజంగా భ్రమ గా మారిపోయింది. రాజధాని అమరావతి అనే పేరు మాటుమాయ్యే పరిస్థితి వచ్చింది. 2024 ఎన్నికల్లో ప్రభుత్వం మారడం తో ఒక పెద్ద గండం తప్పింది. పాత ప్రభుత్వమే సాగి ఉంటే భ్రమరావతి శాశ్వత మయ్యేది. అయితే, ఆ ఎన్నికల్లో టిడిపి కూటమి అధికారంలోకి రావడంతో భ్రమరావతి అమరావతి అయ్యేందుకు మార్గం ఏర్పడింది. ఆ భ్రమరావతి 2029 నాటికి రెక్కలు తొడిగి మహానగరంగా కాకపోయినాతాత్కాలిక భవనాల స్థానంలో శాశ్వతభవనాలైనా రావాలి. అంతేకాదు, 2029లో మరొక ప్రమాదం అమరావతికి ఎదురుకాకుండా జాగ్రత్త పడాలి. చాలా మందిలో ఈ అనిశ్చిత గూడు కట్టుకునే ఉంది. ఇలాంటపుడు అమరావతి ‘సరికొత్త కాపీ’ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. దశాబ్దం తరువాత రెండోసారీ శంకుస్థాపన తో పనులు మొదలెట్టబోతున్నారు. అటకెక్కిందని భావించిన ఏపీ రాజధాని ప్రాజెక్టుని చంద్రబాబు ప్రాణం పోస్టున్నారు. ఈసారి నిరాటంకంగా రాజధాని నిర్మాణం జరిగిపోతుందా? ఏపీ రాజధాని గా అమరావతికి చట్టభద్రత కల్పించి , గత అనుభవాలు పునరావృతం కాకుండా చూస్తారా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే భరోసా ఏంటి.. ?మే 2 వ తేదీన ప్రధాని మోదీ రాజధాని అమరావతి పనులకు రెండోసారి శ్రీకారం చుడుతున్న సమయంలోఏం చెబుతారు? యావత్ రాష్ట్ర ప్రజల నుంచి దూసుకు వస్తున్న ప్రశ్నలివి.
మెగా ప్రాజెక్టులకు రెండోసారి శంకుస్థాపన పరిపాటేనా?
అమరావతి కి పదేళ్ల క్రితమే ప్రధాని మోదీ అట్టహాసంగా శంకుస్థాపన చేశారుగా, మళ్లీ శంకుస్థాపన ఏంటి? ఇది అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న. అయితే ప్రభుత్వాలు భారీ ప్రాజెక్టులను చేపట్టడం, సకాలంలో పనులు ప్రారంభించలేక పోవడమో, ప్రభుత్వాలే మారి కొత్త ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పక్కన పెట్టడమో .. ఇలా ఏదోఒకటి జరగడం మామూలై పోయింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలోనూ అదే జరిగింది.. చంద్రబాబు ఆలోచనలను విభేదించిన జగన్ సర్కారు అమరావతి రాజధాని ప్రాజెక్టునే మొత్తంగా పక్కన పెట్టింది. ఇలా పనులు ప్రారంభమై తరువాత ఆగిపోయి, మళ్లీ మొదలైన భారీ ప్రజెక్టులు మరెన్నో వున్నాయి.2015 లో తొలుత శంకుస్థాపన కు నోచుకున్న ఢిల్లీ ఎన్సీఆర్ లోని ఈస్ట్ ఎక్స్ ప్రెస్ వే అనేక సమస్యల కారణంగా ఆగిపోయింది. దానికి 2017 లో తిరిగి శంకుస్థాపన చేసి, ఏడాది కాలంలోనే పూర్తి చేశారు. ఉత్తరప్రదేశ్ లోని పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వే, బుండేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే సంగతి అదే రీతిలో జరిగింది. 2020 లో రెండోసారి శంకుస్థాపన తరువాత పూర్తయ్యాయి.సూరత్ మెట్రో ప్రాజెక్టు కు 2021 లో శంకుస్థాపన జరిగినా, 2023 లో మరోసారి పునాది వేశారు. 2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్నారు.గుజరాత్ లోని సుదర్శన్ సేతు వంతెన ,ఢిల్లీ యశోభూమి కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం వంటివి తీవ్ర జాప్యానికి గురైయ్యాయి. అంతెందుకు ఆంధ్రప్రదేశ్ కే జీవనాడిగా పరిగణించే పోలవరం ప్రాజెక్టు కూడా ఎన్నో దశాబ్దాల కలగా మారింది. ఎన్నోసార్లు శంకుస్థాపన కు నోచుకుంది. జాతీయ ప్రాజెక్టు గా ఆమోదముద్ర వేసుకున్నాక కూడా ఇంకా పోలవరం నిర్మాణ దశ లోనే వుంది. మరికొన్ని సాగునీటి ప్రాజెక్టులు పునాది పరిమితమయ్యాయి.వీటన్నింటితో పోలిస్తే అమరావతి రాజధాని ప్రాజెక్టు భిన్నమైనదే. రాజధాని లేని రాష్ట్రానికి గొప్ప రాజధాని నగరంగా నిలవాల్సిన ప్రాజెక్టు. అందుకే అమరావతి పై అందరిదీ అమితాసక్తే....
65వేల కోట్లు అంచనా... అన్నీ సమస్యలే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన తరువాత 2014 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రం గా మారింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు ఉమ్మడి రాజధాని గా హైదరాబాద్ ను పదేళ్ల పాటు కొనసాగించాలని విభజన చట్టం నిర్థేశించినా ఈ పదేళ్ల లోనూ ఏపీ కొత్త రాజధానిని నిర్మించుకోలేక పోయింది. 2014లో అధికారం చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రి గా చంద్రబాబు రాజధాని నగర నిర్మాణం పైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. వినూత్నమైన ల్యాండ్ పూలింగ్ పద్దతిలో రాజధాని కోసం చంద్రబాబు ఏకంగా 33వేల ఎకరాలు సేకరించారు. 2015, అక్టోబర్22న ప్రధాని నరేంద్ర మోదీ అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో రాజధాని పనులకు శంకుస్థాపన చేశారు. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం కేంద్ర నుంచి భారీగా సహకారం అందుతుందని భావించినా అంతగా జరగలేదు. అయితే అసెంబ్లీ, , హైకోర్టు భవనాలను నిర్మించినా, అవన్నీ తాత్కాలికంగా నిర్మించామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తరువాత పరిణామాల నేపధ్యంలో 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలవడం జగన్ పార్టీ వైసీపీ అధికారంలోకి రావడం జరిగిపోయింది. దాంతో అమరావతి రాజధాని ప్రాజెక్టు సమస్యలలో పడిపోయింది. ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు అసెంబ్లీలో అమరావతి కి మద్దతునిచ్చిన వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి అయ్యాక స్వరం మార్చారు. మూడు రాజధానులు నినాదం ఎత్తుకున్నారు. దానికి తోటు అమరావతి భూసేకరణ చుట్టూ వివాదాలు, ఇన్ సైడర్ ట్రేడింగ్ వివాదం, అమరావతి రైతుల పోరాటం, నిరసనల ఫలితంగా రాజధాని నిర్మాణానికి ముందుకొచ్చిన ప్రపంచ బ్యాంకు తన 300 మిలియన్ డాలర్ల సహాయాన్ని నిలుపుదల చేయడంతోపాటు, పలు ఆర్థిక సంస్దలు అదేబాటలో నడిచాయి. అయితే 2022 లో ఏపీ హైకోర్టు జగన్ ప్రభుత్వ మూడు రాజధానుల ప్రతిపాదనను కొట్టివేసి, అమరావతి నే రాజధానిగా వుంచాలని ఆదేశించింది. కోర్టులలో అప్పీళ్లు నిలకడలేని నిర్ణయాలతో మొత్తంగా అమరావతి నిర్మాణం ఆగిపోయింది.
కూటమి ప్రభుత్వం రాకతో అమరావతికి పునర్వైభవం
చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతి ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది. అందుకే అట్టహాసంగా రెండోసారి శంకుస్థాపన ను ప్రధాని మోదీ చేతుల మీదగానే జరుపుతున్నారు. అప్పటి పరిస్థితులకు , నేటి పరిస్థితి కి తేడా వుండటం , కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి నిర్మాణానికి అండగా వుండటంతో, వచ్చే మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి స్థాయిలో కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం 43 వేల కోట్ల పనులను ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. మే2 న జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోదీ ఇంకా ఎలాంటి భరోసా కల్పిస్తారన్న ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తోంది. గతంలో కేవలం మట్టి,చెంబు నీళ్లకే పరిమితమయ్యారని విమర్శలు ఎదుర్కొన్న ప్రధాని మోదీ ఈమారైనా రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త వరాలు ఇస్తారా లేదో చూడాలి. కేంద్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి కేటాయించే సొమ్ము అప్పుగా కాకుండా , గ్రాంటుగా అందజేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. జాతీయ రాజకీయాల్లో మారిన పరిణామాలతో ఎన్డీయే ప్రభుత్వ మనుగడలో టీడీపీ ది కీలకపాత్ర కాబట్టి, చంద్రబాబు కోరికను ప్రధాని మోదీ కాదనలేని పరిస్థితులే వున్నాయి. అలాంటి ఉత్సాహమే ఇటు రాష్ట్ర ప్రభుత్వంలోనూ కనిపిస్తోంది.
రాజధానికి చట్టబద్దత అవసరం
గత అనుభవాలను దృష్టిలో వుంచుకొని అమరావతి కి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్దత కల్పించాలని డిమాండ్ తెరమీదకు వచ్చింది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని రైతులతో సమావేశం అయిన సందర్భంగా రైతులు ఇదే కోరిక కోరారు. ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతిని కేంద్ర గుర్తించి, పార్లమెంట్ లో చట్టం తీసుకువస్తే, ఇక రాజధానిని మార్చే వీలుకుదరదు. ఈ ఐదేళ్ల లో అమరావతి నిర్మాణం పూర్తి కాకున్నా, వచ్చే ప్రభుత్వం కూడా పనులను కొనసాగిస్తుంది. రాజధాని భూములిచ్చిన రైతులకు, రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది.అందుకే చంద్రబాబు నాయుడు కూడా వీలైనంత త్వరలో అమరావతి రాజధానికి చట్టబద్దత కల్పించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా రాజధాని నిర్మాణం జరగాల్సివుంది. ప్రభుత్వం కూడా అమరావతి కి మరింత వన్నె తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. అంతర్జాతీయ స్థాయిలో విమానాశ్రయం నిర్మాణానికి ప్రళాళికలు సిద్దం చేసింది. మరో 40 వేల ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం సిద్దమయినా, దానిపై విమర్శలు వస్తుండటంతో, కొద్దిగా వెనక్కి తగ్గింది. ఏదేమైనా అమరావతి లో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని ప్రపంచ సంస్థ లను ఆహ్వానిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ,అమరావతి ని దేశంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షిస్తోంది. మరి అమరావతి కల నెరవేరుతుందా... చంద్రబాబు కు పరిస్థితులు అనుకూలిస్తాయా, నిధులు సమకూరుతాయో లేదో చూడాలి...