
ఆంధ్రా బడ్జెట్: పగటి వేషగాళ్ళ కోతల్లాగా ఉంది
ఉచితాలు అనుచితం అని మొత్తానికి సున్నం పెట్టే విధంగా కూటమి బడ్జెట్ ఉంది.
అంతన్నాడింతన్నాడే..గంగరాజు..ముంతమామిడి పండన్నాడే గంగరాజు..హస్కన్నాడు..బుస్కన్నాడే.. గంగరాజునన్నొగ్గీసెల్పోనాడే.. గంగరాజు... కూటమికి ఓటేసిన వారు పాడుకోవాల్సిన పరిస్థితి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ పాండవులు నలుగురు అని మూడు చూపించి రెండు రాసి ఒకటి కొట్టేసినట్లు ఉంది. ఊహకందని లెక్కలు, విపరీతమైన ఖర్చులు, అంచనాలకు మించిన అప్పులు. సంక్షేమం, అభివృద్ధి సమతూకం కాదని కేవలం అంకెల గారడీ అని భ్రమలు తొలగించింది. 33,185 కోట్లు రెవెన్యూ లోటు, 79,926 కోట్లు ద్రవ్యలోటు ఇలా అయితే అభివృద్ధి సాధ్యం కాదు.
గత ప్రభుత్వం 4 లక్షల 21 వేలా 201 కోట్లు అప్పు చేసిందని ప్రభుత్వం ప్రకటించింది. కూటమి సర్కార్ 7 లక్షల కోట్ల రూపాయలు పైగా అప్పు చేసినట్లు అంచనా వేశారు. 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ నిర్వహణ ఎలా సాధ్యం అవుతుందో దేవుడికే తెలియాలి. ఇంత లోటును ఎలా పూడుస్తారు, ? ప్రజలపై మోపడం తప్ప పరిష్కారం లేదు.
సంపద సృష్టిస్తాం, పేదలకు పంచుతాం, మీకు 15000 వేలు మీకు 15000 వేలు అని ఇంటింటికి తిరిగి ఇప్పుడు రోడ్ మ్యాప్ వేస్తున్నాం వచ్చే సంవత్సరం ఇస్తాం, మా దగ్గర డేటా లేదు, లబ్ధిదారుల ఎంపిక సరిగా లేదు, అన్నదాత సుఖీభవకు ఎంఎల్సి కోడ్ అడ్డుంది, మహిళలకు ఉచిత బస్సు , మహాశక్తి పేరుతో ప్రతినెలా మహిళలకు 1500 రూపాయలు ఇస్తామన్నారు , తల్లికి వందనం కు రెండు సంవత్సరాలకు 25 వేల కోట్లు అవుతుంది బడ్జెట్ లో 9,400 కోట్లు కేటాయించారు, నిరుద్యోగ భృతి 3000 లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, యాభై ఏళ్ళు దాటిన బీసీలకు పెన్షన్ పథకం చంద్రన్న భీమా పథకం మరిచిపోయారు, ఆటో టాక్సీ లారీ డ్రైవర్లకు ఏటా 15,000 మరచిపోయారు , కాపు సంక్షేమానికి 15 వేల కోట్లు ఎప్పుడిస్తారు, ఉచిత గ్యాస్, నోటికి అడ్డు అదుపు లేకుండా బటన్ నొక్కడం అందరి చేత అవుతుంది అని పరాచకాలాడి అభాసుపాలయ్యారు. పైగా మోడీని స్ఫూర్తిగా తీసుకొని బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసిన మోడీని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోతారా? ఉచితాలు అనుచితం అని మొత్తానికి సున్నం పెట్టే విధంగా ఉంది.
వివిధ వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్‌లో నిధుల కేటాయిపులు ఘనంగా చూపించినా, సవరించిన అంచనాల్లో భారీ స్థాయిలో కోతలు వేస్తున్న విషయం బడ్జెట్‌ను పరిశీలిస్తే స్పష్టమవుతోంది. సాంఘిక సంక్షేమానికి ప్రస్తుత బడ్జెట్‌లో రూ.10,909.10 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. గత బడ్జెట్‌లో రూ.10,400.84 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాల్లో ఆ మొత్తాన్ని రూ.7,844.49 కోట్లకు తగ్గించింది. ఎస్‌సిలకు ఉచిత విద్యుత్ సరఫరాకు గత బడ్జెట్‌లో రూ.300 కోట్లు కేటాయిస్తే సవరించిన అంచనాల్లో పూర్తిగా కోత వేశారు. ప్రస్తుత బడ్జెట్‌లోను రూ.300 కోట్లు కేటాయించారు. ఫ్రీ మెట్రిక్ స్కాలర్ షిప్‌ల కోసం గత బడ్జెట్‌లో కేటాయించిన రూ.42.95 కోట్ల మొత్తాన్ని సవరించిన అంచనాల్లో కోత పడింది. .
పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్‌లకు గత బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాల్లో ఆ మొత్తాన్ని రూ.383.35 కోట్లకు పెంచారు. పీఎం అజరు పథకంలోను సవరించిన అంచనాల్లో రూ.400 కోట్ల మేర కోత విధించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు గత బడ్జెట్ రూ.4,406.74 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌లో రూ.4,973.99 కోట్లకు పెంచారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు కేటాయించిన రూ.633.61 కోట్లను సవరించి రూ.482.40 కోట్లకు కుదించారు. ప్రస్తుత బడ్జెట్‌లో గత ఏడాది కంటే తక్కువగా రూ.627.58 కోట్లే కేటాయించారు. ఎస్‌సి కార్పొరేషన్ ఆర్ధిక స్వావలంబన పథకాల కోసం కేటాయించిన రూ.341 కోట్లు సవరించిన అంచనాల్లో మొత్తం కోత వేశారు. ప్రస్తుత బడ్జెట్‌లోను రూ.341 కోట్లు కేటాయించారు.
గిరిజన సంక్షేమానికి ప్రస్తుత బడ్జెట్‌లో 4,671.61 కోట్లు కేటాయించారు. గిరిజన సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పుకొచ్చే ప్రభుత్వం గత బడ్జెట్ కంటే కేవలం రూ.129.76 కోట్లను మాత్రమే పెంచింది. గత బడ్జెట్‌లో గిరిజన సంక్షేమానికి రూ.4,561.85 కోట్లు కేటాయించిన ప్రభుత్వం సవరించిన అంచనాల్లో ఈ మొత్తాన్ని రూ.4,228.05 కోట్లకు కుదించింది. గిరిజన సహకార ఆర్ధిక సంస్థకు గత బడ్జెట్‌లో రూ.735.84 కోట్లు కేటాయించగా, సవరించిన అంచనాల్లో రూ.344.10 కోట్లకు కుదించారు. గిరిజన విద్యా సంస్థలకు గత బడ్జెట్‌లో రూ.948.10 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్ కేవలం రూ.945.02 కోట్లు ప్రతిపాదించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ప్రస్తుత బడ్జెట్‌లో రూ.33,878.45 కోట్లు ప్రభుత్వం కేటాయించింది.
గత బడ్జెట్‌లో 29,879.94 కోట్లు కేటాయించగా ఆ మొత్తాన్ని సవరించిన అంచనాల్లో రూ.5,906 కోట్లు తగ్గించి రూ. 23,973.26 కోట్లకు పరిమితం చేసింది. 2023-24 లో వాస్తవ ఖర్చు పరిశీలిస్తే రూ.25,334.85 కోట్లుగా నమోదైంది. ఆదరణ పథకానికి ప్రస్తుత బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయించారు. చేనేతలకు విద్యుత్ సబ్సిడీ కోసం రూ.200 కోట్లు కేటాయించారు. బిసి ఎ కేటగిరిలోని కార్పొరేషన్‌లకు గత బడ్జెట్‌లో రూ.1,658.35 కోట్లు కేటాయించగా సవరించి 549.96 కోట్లకే పరిమితం చేశారు. 2023-24 లో వాస్తవ ఖర్చు రూ.2,847.58 కోట్లుగా ఉంది. ప్రస్తుత బడ్జెట్‌లో కేవలం రూ.2,379.38 కోట్లు ప్రతిపాదించారు. బిసి బి కేటగిరిలోని కార్పొరేషన్‌లకు గత బడ్జెట్‌లో రూ.1,237.31 కోట్లు కేటాయిస్తే, సవరించిన అంచనాల్లో… రూ.357.10 కోట్లకే పరిమితం చేశారు. 2023-24 లో వాస్తవ ఖర్చు రూ.2,418.46 కోట్లుగా ఉంది. ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయింపులు రూ.1,998.38 కోట్లకు మాత్రమే పరిమితం చేశారు.
బిసి డి కేటగిరిలో కార్పొరేషన్‌లకు గత బడ్జెట్‌లో రూ.1,858.93 కోట్లు కేటాయించారు. 2023-24 లో వాస్తవ ఖర్చు రూ.2,737.36 కోట్లుగా ఉంది. ప్రస్తుత బడ్జెట్‌లో రూ.1,998.38 కోట్లు ప్రతిపాదించారు. బిసి ఇ కార్పొరేషన్‌లకు బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం రూ.574.42 కోట్లు ఉండగా సవరించిన అంచనాల్లో రూ.227.33 కోట్లు కుదించారు. 2023-24లో వాస్తవ ఖర్చు రూ.689.26 కోట్లుగా ఉంది. ప్రస్తుత బడ్జెట్‌లో రూ.887.14 కోట్లు కేటాయించారు. ఆర్యవైశ్య, బ్రాహ్మణ, ఇబిసి, కమ్మ, కాపు, క్షత్రియ కార్పొరేషన్‌లకు గత బడ్జెట్‌లో రూ.10,280.17 కోట్లు కేటాయించగా, సవరించిన అంచనాల్లో రూ.8,566.59 కోట్లకు కుదించారు. ప్రస్తుత బడ్జెట్‌లో రూ.10,615.62 కోట్లు కేటాయించారు.