దక్షిణాది పరువు నిలిపే భారం బాబుదే
x

దక్షిణాది పరువు నిలిపే భారం బాబుదే

కల్లూరి భాస్కరం విశ్లేషణ. హిందీయేతర భాషలు మరీ ముఖ్యంగా పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళలు అస్తిత్వాన్ని బలంగా చాటుకుని మోదీని కట్టడి చేయగలిగాయి.



2024 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ గెలిచి ఓడారు; రాహుల్ గాంధీ ఓడి గెలిచారు; చంద్రబాబు నాయుడు-పవన్ కళ్యాణ్, మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, ఎం. కె. స్టాలిన్, ఉద్ధవ్ థాక్రే, శరద్ పవార్ గెలిచారు!


సరే, ఈ మూడు రకాల వర్గీకరణలను పార్టీలకు, కూటములకూ కూడా అన్వయించుకోవచ్చు. అలాగే, భావజాలాలకూ, ఈ దేశంలోని కులమతభాషాప్రాంతవైవిధ్యానికీ కూడా అన్వయించుకోవచ్చు. భావజాలాలకే అన్వయించుకుంటే హిందుత్వ గెలిచి ఓడింది; లౌకికవాదం; కులమతభాషాప్రాంతవైవిధ్యం ఓడి గెలిచాయి.


నరేంద్ర మోదీ 2014 ఎన్నికల్లోనూ 2019 ఎన్నికల్లోనూ తనను అందరిలా ఓ మాతృగర్భంనుంచి పుట్టినవాడిగా కాకుండా అవతారపురుషుడనో, కారణజన్ముడనో, దైవాంశసంభూతుడనో చెప్పుకోలేదు. ఈ ఎన్నికల్లో అలా చెప్పుకోడానికి ప్రయత్నించారు. అంటే గత పదేళ్లలోనూ ఆయన మానవమాత్రుడి స్థాయినుంచి అవతారపురుషుడి స్థాయికి పెరిగిపోయారన్నమాట. కానీ ఆయన నాయకత్వంలోని భారతీయజనతాపార్టీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి 32 స్థానాల దూరంలో, 240 స్థానాల దగ్గర చతికిలపడింది. వారణాసి లోక్ సభ నియోజకవర్గంలో ఆయన తెచ్చుకున్న వోట్లు 3.7లక్షలు(2014), 4.7 లక్షలు(2019)నుంచి ఈసారి 1 లక్షా 52వేల చిల్లరకు పడిపోయాయి. ఇలా పార్టీ స్థానాలు, సొంత వోట్లూ కూడా ఆయనను మానవమాత్రుడి స్థాయికి కుదేశాయి. ఎన్నికల్లో సీట్లు తగ్గిపోయే ప్రమాదాన్ని పసిగట్టి అప్పటికప్పుడు కృత్రిమంగా కొత్త అవతారాలు ఎత్తే చిట్కా పనిచేయదని రుజువు చేశాయి. ఇది ఆయనకే కాదు, అలాంటి అందరికీ పాఠమే.


ఇప్పుడు కూడా ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయవచ్చు. అది ఓటమిని గెలుపుగా మలచుకుని ఏర్పాటు చేసుకునే ప్రభుత్వమే అవుతుంది తప్ప గెలుపు ప్రభుత్వం కాలేదు. సొంత మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మిత్రపక్షాలు మోదీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడేవి; ఇప్పుడు మోదీ మిత్రపక్షాల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడవలసివస్తుంది. ఈ పూర్తి తలకిందుల పరిస్థితి ఆయనకు తక్కువ ఓటమి ఏమీకాదు.


లౌకికవాదంతోపాటు, ఇక్కడి కులమతమతభాషాప్రాంతవైవిధ్యం కూడా ఓడి గెలిచాయని పైన చెప్పుకున్నాం. నిజానికి ఇప్పుడున్న పరిస్థితిలో దానిని ఓటమి కన్నా విజయంగానే చెప్పుకోవడం సముచితం. కాకపోతే ప్రస్తుతానికి అది అర్ధవిజయం కావచ్చు. రేపటి సంపూర్ణవిజయానికి అందులో హామీ ఉంది. ఆవిధంగా ఈ సార్వత్రిక ఎన్నికలు కీలకమవుతున్నాయని చెప్పుకోవచ్చు.


వైవిధ్యం విషయానికే వస్తే, ఉత్తరప్రదేశ్ ఫలితాన్నే చూడండి. 80 స్థానాలున్న ఆ రాష్ట్రంలో బీజేపీ 29 స్థానాలను కోల్పోయింది. సమాజ్ వాదీ పార్టీ 32 స్థానాలను, కాంగ్రెస్ 5 స్థానాలను అదనంగా గెలుచుకున్నాయి. ఈ ఫలితాల సరళి ఇలా ఉండడం వెనుక దళిత వోటర్ల నిశ్శబ్దవిప్లవం ఉందని విశ్లేషణలు సూచించాయి. రిజర్వేషన్ల కొనసాగింపు విషయంలో వారిలో ఏర్పడిన భయాందోళనలే బీజీపీకి వ్యతిరేకంగా వోటు వేయించాయని అంటున్నారు. ఇతర వైవిధ్యాలకు భిన్నంగా కులవైవిధ్యం వ్యతిరేకాంశమే తప్ప సానుకూలాంశం కానీ మాట నిజమే. కనుక పై ఉదాహరణను కేవలం ‘వైవిధ్యా’నికి సూచిగానే తీసుకోవాలి.


అలాగే హిందీయేతర భాషలు కూడా తమ ఉనికిని బలంగానే చాటుకున్నాయి. ప్రాంతాలకు దీనిని అన్వయిస్తే, తూర్పు, పశ్చిమ, దక్షిణ దిక్కుల్లో ఉన్న పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ తమ అస్తిత్వాన్ని అంతే బలంగా ఉద్ఘాటించుకున్నాయి. ఇన్ని రకాల వైవిధ్యాలూ కలసి మోదీని, బీజేపీని విజయవంతంగా కట్టడి చేయగలిగాయి.


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఫలితాలు మాత్రమే మిగతా దక్షిణ రాష్ట్రాల స్ఫూర్తికి భిన్నంగా ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీకి గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. బీజేపీ నాలుగు స్థానాలను అదనంగా గెలుచుకోగలిగింది. బీ ఆర్ ఎస్ సున్నా చుట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ 3 లోక్ సభ స్థానాలను, 8 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని తన ఉనికిని వెనకటి కంటె బలంగా స్థాపించుకుంది.

***

ఎన్డీయే తిరిగి అధికారంలోకి వచ్చినా మోదీకి ప్రత్యామ్నాయాన్ని అన్వేషిస్తారా అన్న చర్చ కూడా తలెత్తడం చూస్తున్నాం. నితిన్ గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్ వగైరా పేర్లు వినిపించాయి. ఇది బీజేపీకి కన్నా కూడా ఎక్కువగా ఆర్.ఎస్.ఎస్. నాయకత్వానికి సంబంధించిన ప్రశ్న. ఇక్కడ పార్టీకి, దాని భావజాలమాతృక అయిన ఆర్.ఎస్.ఎస్.కు ఉన్న తేడాను చూడాలి. ప్రజాక్షేత్రంలో పనిచేస్తూ ఎన్నికలు-వోట్లు-సీట్ల మీద; పరిపాలనావిధివిధానాల మీదా ఆధారపడాల్సింది బీజేపీ. ఆ తరహాలో ఆర్. ఎస్.ఎస్. ప్రజాక్షేత్రంలో పనిచేసేది కాదు కనుక బీజేపీకి ఉన్నట్టు ప్రజలతో లేదా వోటర్లతో ముడిపడిన బాదరబందీలు ఏవీ దానికి ఉండవు. తన హిందుత్వను సంపూర్ణస్థాయిలో స్థాపించడం ఒక్కటే దానికి ఏకైకమైన అజెండా. మోదీయా లేక మరొకరా అన్న విచికిత్సకు ఏకైక ప్రాతిపదిక కూడా అదే అవుతుంది. మళ్ళీ హిందుత్వ స్థాపనలోనూ ఉగ్రత్వం-మృదుత్వం తేడాలు ఉన్న సంగతి తెలిసినదే. మోదీ ఉగ్రహిందుత్వకు ప్రాతినిధ్యం వహిస్తూ గత పదేళ్లలోనూ ఒక కొలిక్కి తీసుకురాగలిగారు. అలాంటి మోదీకి ప్రత్యామ్నాయాన్ని ఆర్.ఎస్.ఎస్. ఎందుకు కోరుకుంటుంది? ఒకవేళ కోరుకున్నా మోదీ లాంటి మరో ఉగ్రహిందుత్వ వాదినే కోరుకుంటుంది తప్ప మృదుహిందుత్వవాదివైపు ఎందుకు మొగ్గుచూపుతుంది? తన హిందుత్వ అజెండాను తను కోరుకున్నట్టు అమలు చేయనప్పుడు ఆర్.ఎస్.ఎస్.కు ప్రభుత్వంలో ఎవరున్నా ఒకటే.

***

పశ్చిమ(మహారాష్ట్ర), తూర్పు(పశ్చిమ బెంగాల్)లలో బీజేపీ భంగపడి ఉండవచ్చు. అదే సమయంలో అటు ఒడిసాతోపాటు దక్షిణాదిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో సాధించిన ఫలితాలు దానికి పెద్ద ఊరట. అంతేకాదు, దక్షిణాదిన దాని ఉజ్వలభవిష్యత్తుకు కూడా దిక్సూచికలు. ఇక్కడ దక్షిణభారత అస్తిత్వం, లేదా గుర్తింపు విషయం ముందుకొస్తుంది. తమ రాజకీయ అస్తిత్వం కోసమే కానివ్వండి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకుని దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్ కోట తలుపులు దానికి బార్లా తెరిచారు. రేపది కోటను పూర్తిగా ఆక్రమించుకుని తమకు నిష్క్రమణ ద్వారం చూపించే అవకాశాన్ని ధారపోశారు. ఇక్కడ నవీన్ పట్నాయిక్ ను ఉదహరించుకోవడం సందర్భోచితం. నవీన్ పట్నాయిక్ నాయకత్వంలోని బిజూ జనతాదళ్ మొదటినుంచి బీజేపీకి అంటకాగుతూనే ఉంది. దాని పర్యవసానం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. ఒడిసా గుడారాన్ని బీజేపీ ఏనుగు పూర్తిగా ఆక్రమించుకుని నవీన్ పట్నాయిక్ ను బయటికి పంపేసింది.


సామంతప్రభువులు సొంత అధికారం కోసమూ, తాత్కాలిక రాజకీయ అవసరాలకోసమూ కురచబుద్ధిని హ్రస్వదృష్టిని చాటుకుని శాశ్వతప్రమాదాలకు రాచబాట పరవడం ఈ దేశంలో కొత్తది కాదు. ఆ చారిత్రక అనుభవమే నేటి ప్రజాస్వామికవ్యవస్థలోనూ పునరావృతమవుతూనే ఉంది. ఈ క్షణాన లౌకికవాదంతోపాటు దక్షిణాది ప్రత్యేక అస్తిత్వాన్ని కాపాడే అవకాశం చంద్రబాబునాయుడు-పవన్ కళ్యాణ్ ల చేతుల్లో ఉంది. ఇది వారి సొంత లౌకికచింతనకు, దక్షిణాది గుర్తింపు స్పృహకు కూడా అగ్నిపరీక్ష. తమ అధికారాన్ని నిలుపుకుంటూనే ఆ పరీక్షలో అనాయాసంగా నేగ్గే అవకాశం వారికి ఉంది. చరిత్ర పుటల్లో తాము ఎలా ఎక్కదలచుకున్నారో నిర్ణయించుకోవలసిందే వారే.







Read More
Next Story