‘అమరావతి’ చట్టం మరొక సవరణ చట్టం రాకుండా అడ్డుకోగలదా?
x

‘అమరావతి’ చట్టం మరొక సవరణ చట్టం రాకుండా అడ్డుకోగలదా?

12 సంవత్సరాల తర్వాత అమరావతి చట్టం ఎందుకు అవసరమయింది? ఇది పాలకుల అసమర్థతకు సంకేతం కాదా!

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదో ఒక ఋషి శాపానికి గురైనట్టు కనపడుతున్నది. అంతులేని గందరగోళం, అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతోంది. ప్రతిసారీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014ను విమర్శించడం మామూలే. మరొక సవరణ చేసినప్పుడైనా సమగ్రంగా సవరణ చేస్తే ఎంతో బాగుండేది. పార్లమెంట్ చట్టం ద్వారా ఒక్క అమరావతిని రాజధాని ప్రకటించడం తప్ప ఏమీ చేయలేకపోవడం, చేతకాని తనమే. ఇప్పటికీ అమరావతి రాజధాని గా పట్టాభిషేకం చేయలేదు. ఏం చేస్తారో, ఎన్నేళ్లకు ఏ భాగం పూర్తి అవుతుందో చెప్పడానికి చట్టంలో కూడా చేర్చిఉంటే, అమరావతి రైతులకు, ప్రజలకు నమ్మకం ఏర్పడేది.

పవిత్ర మట్టి ఇస్తే చాలా

మొత్తానికి హటాత్తుగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (సవరణ) చట్టం, 2026 ద్వారా పార్లమెంట్ అమరావతిని రాజధానిగా ప్రకటించింది. ‘చట్టప్రకారం’ ఆ నగరాన్ని బలోపేతం చేస్తుందా? ఇదివరకు కొన్ని పవిత్ర జలాలు, సారవంతమైన గంగా యమున నదలు నుంచి తెచ్చిన మట్టిని ఇవ్వడం చాలా అద్భుతమైన ప్రతీక. సరే. అది సరిపోతుందా? రాజధాని నిర్మాణానికి ఏ విధంగా నిధులు సేకరిస్తారో వివరాలు లేవు. అవేవీ లేకుండా చట్టం వచ్చింది కనుక అమరావతి వచ్చేసింది అని పండగ చేసుకుంటే ఏంలాభం?

పార్లమెంటు 2014 చట్టాన్ని కొత్తగా సవరిస్తూ, అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధాని అయిపోయింది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగిసిన తేదీ (జూన్ 2, 2024) నుండి ఈ చట్టం ముందస్తు ప్రభావంతో వర్తిస్తుంది. 2014లో ఒక రాజధాని నిర్ణయించుకునే స్వేచ్ఛ కొత్త ఆంధ్రప్రదేశ్ శాసనసభ, ప్రభుత్వం, చేయవలసి ఉంది. ఆ చట్టంలో అమరావతి పేరును స్పష్టంగా పేర్కొంది.

అమరావతి మాత్రమే రాజధాని కావాలి!

2014లో వచ్చిన విభజన చట్టం కేవలం "ఏపీకి ఒక కొత్త రాజధాని ఉంటుంది" అని మాత్రమే పేర్కొంది, కానీ అదేమిటి ఎక్కడ అనే అంశాన్ని చట్టంలో నిర్వచించలేదు. నిజానికి అవసరం కూడా లేదు. ఇప్పుడు, "ఏపీ రాజధాని అమరావతిలోనే ఉండాలి" అని అది నిర్దేశిస్తోంది. 2014 విభజన తర్వాత తలెత్తిన గందరగోళానికి, ముఖ్యంగా 2020లో వచ్చిన 'మూడు రాజధానుల' ప్రతిపాదన వల్ల కలిగిన అయోమయానికి స్వస్తి పలకడం ఈ మార్పు ముఖ్య ఉద్దేశం అని అనుకుందాం. భవిష్యత్తులో వచ్చే రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజకీయ ఇష్టానుసారం రాజధానిని సులభంగా మార్చకుండా నిరోధించడం దీని లక్ష్యం అని కూడా అనుకోవచ్చు. రాజధాని హోదా ఇప్పుడు కేవలం రాష్ట్ర స్థాయి రాజకీయ నిర్ణయం కాకుండా పార్లమెంటరీ చట్టంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి, ఇది అమరావతికి అవసరమైన న్యాయపరమైన స్థిరత్వాన్ని తెస్తుందని అనుకుంటున్నాను. అది నిజమో కాదో రాబోయే రోజులు నిర్ణయిస్తాయి.

ఈ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సవరణ "మూడు రాజధానుల" భావనను తొలగించారు. విశాఖపట్నం (కార్యనిర్వాహక), అమరావతి (శాసన), కర్నూలు (న్యాయ) రాజధానులుగా ఉండాలనే ఆలోచన పోయింది.

అంటే అప్పడినుంచి ఇప్పడిదాకా, మొత్తం గత 12 ఏళ్లుగా రాష్ట్రం సరైన పరిపాలనా స్థిరత్వం కోసం వెతుకులాడుతూనే ఉందన్నమాట. ఇదీ మన పాలకుల సామర్థ్యం. కేవలం ఒక్క ఊరిని రాజధాని అని గుర్తించడం ద్వారా ఏవైనా సమస్యలు పరిష్కారం అవుతాయా? పైగా ఈ కేంద్ర చట్టం దీర్ఘకాలిక రాజ్యాంగ వివాదానికి కొత్త సమస్యను ప్రారంభిస్తుంది. పార్లమెంటరీ చట్టం కూడా ఒక సాధారణ చట్టమే. సవరణకు అతీతమయింది కాదు. మరొక సారి ఈ చట్టాన్ని సవరిస్తే అదీ పోతుంది. పార్టీ మారితే, ధోరణి మారితే ఇష్టం వచ్చినట్టు చట్టాన్ని మార్చుకుంటూ పోతే, ఈ కథ ఎప్పుడు ముగుస్తుంది?

పార్లమెంటు vs రాష్ట్ర అధికారం

ఇంత చేసినా ఈ చట్టం అమరావతి అద్భుతమైన విజయం అని గ్యారెంటీ ఇస్తుందా? రాజ్యాంగ వాస్తవాన్ని కొంచెం అర్థం చేసుకోవాలి. రాజధాని ఎంపిక అనేది సమాఖ్య వ్యవస్థలో పార్లమెంటు రాష్ట్ర అధికారాల పరిథిలో లేదు. అది మరో వివాదానికి దారితీయవచ్చు. రాజధాని నగరం ఎక్కడ ఉండాలనేది కేంద్ర జాబితాలో (Union List) లేదు. ఇది సాధారణంగా రాష్ట్ర (ప్రభుత్వం) కార్యనిర్వాహక పరిధిలోకి వచ్చే అంశం. ఒక రాష్ట్రం తన రాజధానిని ఎంచుకునే హక్కును పార్లమెంటు శాశ్వతంగా నియంత్రించగలదా? ఇది శాసనపరమైన అతిక్రమణ కాదా? ఇది భవిష్యత్తులో రాజ్యాంగపరమైన సవాళ్లకు దారితీయవచ్చు. రాకపోవచ్చు. ప్రభుత్వం మారితే మళ్ళీ సవరించడానికి వీలున్న ఈ "రాజధాని హోదా" వల్ల ప్రజలకు వచ్చే లాభం ఏమిటి? పార్లమెంటు ఈ విధంగా జోక్యం చేసుకోవడం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 246, సమాఖ్య వ్యవస్థ (Basic Structure of Federalism) ప్రకారం చర్చనీయాంశం. తగినంత బహిరంగ చర్చ లేకుండా దీన్ని ఆమోదించడం భారత రాజ్యాంగ చట్టానికి ఒక పెద్ద పరీక్ష.

ఈ 'పార్లమెంటరీ అమరావతి చట్టాన్ని' ఏపీ అసెంబ్లీలో లేదా కౌన్సిల్లో తగినంత చర్చ లేకుండా, హఠాత్తుగా, దాదాపు రహస్యంగా తీసుకువచ్చారనే విమర్శలు వచ్చాయి. అందులో పారదర్శకత లేదు, ప్రజలతో సంప్రదింపులు లేవు.

ఈ చట్టబద్ధత వల్ల ₹50,000 కోట్లకు పైగా అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని, ప్రైవేట్ పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరుగుతుందని అనే భావనని ప్రభుత్వం ప్రచారంచేస్తున్నది. అయితే, ఈ బిల్లు ఆమోదం పొందే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేసారు. అందరూ వాకవుట్ చేయలేదని మరో వివాదం. అదొక అరాచకం, అస్థిరత. చెప్పేదొకటి. దాని వెనుక ఆలోచనలు వేరు.

రాజ్యసభ సెషన్లో చైర్మన్ సి.పి. రాధాకృష్ణన్ మాట్లాడుతూ, "ఆంధ్ర ప్రజలకు చక్కని రాజధాని అమరావతి నిర్మితం కావాలని దేశం మొత్తం ఆకాంక్షిస్తోంది" అని పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ ఈ చారిత్రక ఘట్టాన్ని సందర్శకుల గ్యాలరీ నుండి వీక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని ప్రజల ఆకాంక్షల విజయంగా అభివర్ణించగా, లోకేష్ "అమరావతిని పట్టిన గ్రహణం వీడింది" అని ఆయన పోస్ట్ చేశారు.

విలువైన కాలం, మట్టిపాలు

మరి ఈ జాప్యానికి, పేలవమైన పాలనకు నిజంగా బాధ్యులు ఎవరు? గత 12 ఏళ్లలో, చంద్రబాబు మొదట ముఖ్యమంత్రి అయ్యారు. అమరావతి అన్నారు. మధ్యలో జగన్ మోహన్ రెడ్డి పాలన వచ్చింది, ఆయన మూడు రాజధానుల ఆలోచన తీసుకువచ్చారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. ఎవరు ఏం చేస్తారో తెలియదు. కానీ ఆశించిన అభివృద్ధి జరగలేదు. ఒక రాజధాని నగరం మాట పక్కన పెడితే, కనీసం శాశ్వత సచివాలయాన్ని కూడా పూర్తి చేయలేకపోయారు. కేవలం ఒకరి మీద ఒకరు నిందలు (పనికిరాని భాష, తిట్లు కూడా) వేసుకుంటునన్నారు.

రాష్ట్రమంత్రి నారా లోకేష్ ఇటీవల మాట్లాడుతూ ₹50,000 కోట్ల పనులకు టెండర్లు వేశామని, కేంద్రం ₹18,000 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. రెండేళ్లలో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ప్రజలు మాత్రం 2026లో కూడా రాజధానికి ఏదైనా ఒక ఆకారం వస్తుందేమో నని ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు.

రైతుల త్యాగం

33,000 ఎకరాలకు పైగా భూమిని ఇచ్చిన రైతుల త్యాగాన్ని గుర్తించడం నైతిక బాధ్యత. అయితే రాజకీయ గుర్తింపు లభించినంత మాత్రాన రాజధాని ప్రాజెక్ట్ సకాలంలో పూర్తవుతుందని గ్యారెంటీ లేదు. అమరావతికి భారీ పెట్టుబడులు, దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరం. కేవలం "న్యాయపరమైన హోదా" వచ్చిందని సంబరపడటం తొందరపాటే అవుతుంది. చట్టబద్ధత నగరానికి ఇటుకలు పేర్చదు కదా?

ఏపీ 'హోదా' ఏమిటి?

2014లో రాష్ట్రవిభజన సందర్భంలో ప్రతిపక్షనాయకుడు వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా అవసరం ఉందని పోరాటం చేసారు. మోదీ గారి కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత వెంకయ్య నాయుడుగారు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రిగా పదవీస్వీకారం చేసిన దశలో కూడా మన అమరావతి పట్టణ అభివృద్ధికి ఏమీ చేయలేదు. ప్రత్యేక హోదా (SCS) అని వెంకయ్య నాయుడు పోరాడినా అది 2014 పునర్విభజన చట్టంలోకి ఎక్కడని ఒక మౌఖిక వాగ్దానంగా మిగిలిపోయింది. దానికి చట్టబద్ధత లేకపోవడం వల్లే కేంద్రం దాన్ని అమలు చేయలేదు. కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు ఒకే ప్రభుత్వం ఉన్నపుడు కూడా రాజధాని నిర్మాణానికి కావలసిన పనులుచేయలేదు, హోదా ఇవ్వలేదు, నిధులూ ఇవ్వలేదు. ఆడంబరంగా ప్రారంభోత్సవాలు మాత్రం చేస్తారు.

ఇప్పుడు పాత పేరయిన అమరావతి అనే రాజధాని పదాలను కొత్త రాజధానిటగా ప్రకటిస్తూ మరో ప్రారంభోత్సవం చేసుకోవచ్చు కూడా. ఏ హోదా ఇవ్వకుండా 2016లో చంద్రబాబు ప్రభుత్వం "ప్రత్యేక ఆర్థిక సహాయం" (Special Assistance Measure) కు అంగీకరించింది. అదీ ఎటు పోయిందో తెలియదు. అంతలొనే ఆయన కు రాజకీయ గ్రహణం వచ్చింది. మూడు పక్షాల సంకీర్ణంతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మధ్యలో ప్రధానమంత్రి మోదీతో విభేదాలలో ఇరుక్కుపోయారు. ప్రజాగ్రహం వ్యక్తమవడంతో 2018లో ఎన్డీయే నుండి నాయుడు బయటకు వచ్చి "ధర్మ పోరాట దీక్ష" చేపట్టారు. ధర్మమూ లేదు, పోరాటమూ లేదు. 2019లో వైఎస్ ఆర్ పార్టీ ఖచ్చితంగా ‘మేం ప్రత్యేక హోదా సాధిస్తాం’ అనే నినాదంతో దిగ్విజయంగా గెలిచారు. కానీ, కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉండటంతో ఏపీ కేవలం "అడగగలదు" కానీ "శాసించలేదు" అని స్పష్టంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పేశారు. తేలిపోయింది.

ఒకవేళ రెండు పార్టీలకు రాష్ట్ర అభివృద్ధిపై నిజాయితీ ఉంటే, ప్రత్యేక హోదా లేదా దానికి సమానమైన ఆర్థిక ప్యాకేజీ కోసం ఎందుకు కలిసి పోరాడటం చేయడం లేదు? చరిత్ర నిరూపించిన సత్యం ఏమిటంటే, కేవలం ఒక హామీ, ఒక ఎన్నికల ప్రచారం లేదా పార్లమెంటులో ఆమోదించిన ఒక చట్టం మాత్రమే నగరాన్ని నిర్మించలేదు. దానికి కావాల్సింది గ్యారెంటీగా అందే నిధులు. న్యాయపరమైన హోదా అనేది ఒక ఆరంభం మాత్రమే. రాజధానిని చట్టం గుర్తించింది అని సంబరాలు చేసుకోమనడం సమర్థతా, అసమర్థతా?

Read More
Next Story