కదిపి .. కుదిపిన  అమరావతి
x

కదిపి .. కుదిపిన ' అమరావతి '

ప్రభుత్వాలు మారినంత మాత్రాన, ఆ ప్రభుత్వాలను నడిపే పార్టీలు మారినంత మాత్రాన వ్యవస్థలు చిన్నాభిన్నం కాకూడదు. అప్పుడే నిఖార్సైన ప్రజాస్వామ్యం కనిపిస్తుంది.


ప్రభుత్వాలు మారినంత మాత్రాన, ఆ ప్రభుత్వాలను నడిపే పార్టీలు మారినంత మాత్రాన వ్యవస్థలు చిన్నాభిన్నం కాకూడదు. అప్పుడే నిఖార్సైన ప్రజాస్వామ్యం కనిపిస్తుంది. ఓ 20 లేదా పాతికేళ్ల కిందటి వరకు అటువంటి ప్రజాస్వామ్యాన్నే చూశాం. కొన్ని చిన్న చిన్న లొసుగులు ఉన్నా స్థూలంగా ' అభివృద్ధి ' లక్ష్యంగా మాత్రమే ప్రభుత్వాలు పనిచేసేవి. కానీ తరువాత పరిస్థితులు మారిపోయాయి. అందుకు దారితీసిన కారణాలు అనేకం ఉన్నాయి. అది మరో విషయం. వ్యవస్థలను పునాదుల నుంచి కదిలింది పునర్నిర్మాణం చేస్తున్నామనే అభిప్రాయం ప్రజల్లో కల్పించేందుకు ప్రభుత్వాలు రకరకాల కార్యక్రమాలు చేపట్టడం ఆరంభించాయి.

వాటికి ప్రజాదరణ లభిస్తున్నదో లేదో ఎన్నికలు వచ్చినప్పుడు గానీ చెప్పలేకపోతున్నాం. ప్రభుత్వాలు మారిపోతూంటాయి. మారిన ప్రతిసారి వ్యవస్థలను కూడా మార్చుకుంటూ వెళ్తే ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దశాబ్దాలు గడిచినా ఒక వ్యవస్థ అంటూ లేకుండానే సమాజం సాగుతూ ఉంటుంది. అది అభిలషణీయం కాదుకదా! ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాగార్జున సాగర్ డ్యాం కట్టారు. బాగానే ఉంది.

ఆ డ్యామ్‌ను అక్కడ కాదు.. కొంచెం దిగువన కడితే ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉంటుందని చెప్పి దానిని కూల్చేసి కొత్త డ్యాం కట్టే ప్రయత్నం చేస్తే అది వ్యవస్థను అభివృద్ధి చేయడమా! నిర్మూలించడమా? పెంకుటింటిని కూల్చివేసి మేడను నిర్మిస్తే దానిని అభివృద్ధి అనవచ్చు. కానీ ఉన్న ఇంటిని కూల్చివేసి గుడిసెను వేసుకుంటే దానిని ఏమనాలి! అనేక రాష్ట్రాలలో ఇప్పటి ప్రభుత్వాల తీరు అలాగే నడుస్తోందనే చేదు నిజం చెప్పక తప్పదు.

మన ' అమరావతి ఉద్యమం ' చూస్తే అదే అభిప్రాయం కలుగుతుంది. పోలవరం ప్రాజెక్టును చూసినా అదే దృశ్యం కనిపిస్తుంది. ఒక్క సారి వెనక్కి తిరిగితే.. అయిదేళ్లుగా సాగుతున్న 'సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్' ఉద్యమం మన ప్రభుత్వాల తీరుతెన్నులకు అద్దం పడుతుంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో కూటమి విజయం, కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని తెలియగానే అయిదేళ్లుగా సాగుతున్న దీక్షా శిబిరాలను ఎత్తివేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించడాన్ని బట్టి ఇంతకాలం రకరకాల వ్యవస్థలు ఎటువంటి సంక్షోభంలో చిక్కుకున్నాయో అర్థమవుతుంది.

రాష్ట్రానికి ఒక నోటిఫైడ్ ప్రాంతంతో రాజధాని లేకుండా పదేళ్లు గడిచాయంటే ప్రభుత్వాలను ఏమనుకోవాలి? మంచో..చెడో అమరావతి అంటూ ఒక ప్రాంతానికి రూపకల్పన చేసి, దానిలో వివిధ నిర్మాణాలకు కొన్ని వేల కోట్లు కుమ్మరించి, కొన్ని నిర్మాణాలు చేశారు. అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్, ఇంకా కొన్ని పాలన భవనాలు రూపుదిద్దుకున్నాయి. అవి తాత్కాలిక నిర్మాణాలా, శాశ్వతమైనవా అనేది అలా ఉంచుదాం. యుద్ధ ప్రాతిపదికన నిర్మాణాలైతే జరిగాయి కదా! వాటికి అనుబంధంగా ఎంతో వ్యాపారం విస్తరించింది కదా! వేలాది ఎకరాల మాగాణి భూములను రైతులు ప్రభుత్వానికి ధారపోశారు కదా! నిర్మాణాలు, కేటాయింపుల్లో అవినీతి గురించి మళ్లీ చూద్దాం.

ఆ రైతుల నుంచి కొనుగోలు చేసిన భూములలో అప్పటి ప్రభుత్వం కొన్ని నిర్మాణాలు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత 13 జిల్లాలతో మిగిలిన ఆంధ్రప్రదేశ్‌కు ఒక రాజధాని అంటూ కావాలి గనుక ఆ ప్రయత్నాలు జరిగాయి. ఎన్నెన్నో కమిషన్లు, మరెన్నో నివేదికల తర్వాత కొన్ని పథకాలు రూపొందాయి. అందుకు కూడా కొన్ని వందల కోట్ల ఖర్చు జరిగింది. అదంతా ప్రజలు కట్టిన పన్నులు, తెచ్చిన అప్పుల నుంచే జరిగింది. అవన్నీ తర్వాత కాదనుకుంటే ఆ వేల కోట్లన్నీ గంగలో పోసీనట్లే అవుతుంది కదా!

నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, ఒంగోలు, కర్నూలు వంటి బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. వాటిలో విజయవాడ, విశాఖ ఎక్కువ అభివృద్ధి చెందిన నగరాలనవచ్చు. మౌలిక సదుపాయాలు అక్కడ పుష్కలంగా సమకూరుతాయి. వాటిలో ఒకటి ముందే ఎంపిక చేసుకొని అక్కడ రాజధాని అభివృద్ధి చేసుకోవచ్చు. అలా కాదు.. కొత్త నగరం నిర్మిస్తామంటూ అమరావతి ఆలోచన చేశారు. అందుకోసం 33 వేల ఎకరాల ప్రాంతాన్ని రైతుల నుంచి సేకరించి అభివృద్ధి చేయడం మొదలు పెట్టారు. అంతలోనే ప్రభుత్వం మారింది.

కొత్త ప్రభుత్వం 2019, డిసెంబర్ 18న మూడు రాజధానుల ప్రకటన అసెంబ్లీ లోనే చేసింది. అప్పటి నుంచి యుద్ధం మొదలైంది. భూములిచ్చిన రైతలందరు రోడ్డెక్కారు. అది మహోద్యమంగా మారింది. అయిదేళ్లుగా సాగుతోంది. ఆ. రైతులకు జరిగిన న్యాయమేమీ లేదు. వారు కోర్టుల మెట్లు కూడా ఎక్కారు. కొన్ని తీర్పులు వచ్చాయి. కొన్ని కేసులు ఇంకా విచారణల్లోనే ఉన్నాయి. వేలాది మహిళలు కూడా ఇళ్లు వదిలి ఆందోళనలు చేస్తున్నారు. రాజధాని వచ్ఛిందా అంటే అదీ లేదు. రాజధాని అమరావతో, విశాఖో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

పోలీసులు, లాఠీచార్జిలు, ధర్నాలు, బాష్పవాయు ప్రయోగాలు గత అయిదేళ్లుగా నిత్యకృత్యమైపోయాయి. వ్యవస్థల పునర్నిర్మాణమంటే ఇలాంటి ' అశాంతి ' కాదుకదా! అయిదేళ్లలో 3వేల మంది రైతులపై 720 పైగా కేసులు నమోదయ్యాయి. అమరావతి ఉద్యమ పరిరక్షణ ప్రస్థానం ఎన్నో మలుపులు తిరిగి ఆందోళనలు ఉవ్వెత్తున ఎగసాయి. తాజా ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వం మారుతుంది తెలియగావే ఆందోళన విరమించడానికి రైతులు ముందుకు రావడం శుభసూచకమే. అయితే కొత్త ప్రభుత్వమైనా వారికి న్యాయం చేకూర్చుతుందా? చూడాలి.

Read More
Next Story