అచ్యుతాపురం ప్రమాదం ప్రభుత్వాల విధ్వంస విధాన ఫలితమే
x

అచ్యుతాపురం ప్రమాదం ప్రభుత్వాల విధ్వంస విధాన ఫలితమే

నాలుగు లేబర్ కోడ్స్ నగ్న స్వరూపాన్ని బట్టబయలు చేసిన మారణహోమమిది. మానవజాతి మనుగడకు ప్రాణగండంగా మారుతోన్న పారిశ్రామిక ప్రమాదాలకు అద్దం పట్టే తాజా దుర్ఘటన మానవతకు ఒక సవాల్!


కార్పొరేట్లు... కార్పొరేట్లు... కార్పొరేట్లు... ఓ పాతికేళ్ల క్రితం ఈ మాట అకడమిక్ మేధావి వర్గాలకు పరిమితం. ఇప్పుడు ఏ నోటా విన్నా ఈ మాట వినిపిస్తోంది.

ప్రజలెన్నుకున్న ప్రభుత్వాల వత్తాసుతో ప్రజాధనాన్ని లూటీ చేస్తూ అత్యధిక లాభాలను కొల్లగొట్టేవిగా ఈ కార్పోరేట్ కంపెనీలు ఇంతవరకూ తెగ పేరొందాయి. అవి ఇప్పుడు ప్రజల ప్రాణాలు బలితీసుకునే ఖూనీకోరు సంస్థలుగా కూడా పేరొందుతున్నాయి. వాటిలో ఫార్మా (మందుల) కంపెనీలు మొదటి వరసలో ఉన్నాయి. విశాఖ జిల్లా అచ్యుతాపురం పారిశ్రామిక ప్రాంతంలో ఫార్మా కంపెనీ (ప్రజల వాడుకభాషలో మందుల కంపెనీ) లో నిన్నటి ప్రమాదం అందుకో నిదర్శనం.

ఏ తల్లి పేగు పంచుకొని ఏ మారుమూల పల్లెటూరులో పుట్టారో! ఏ తండ్రి రెక్కల పై పొందిన కూలి డబ్బులతో, ఏ తల్లి ఒడిలో గోరు ముద్దలు తిని ఎదిగారో! ఏ చుట్టుపక్క పిల్లల ఆటపాటల మధ్యన ఆడుతూ పాడుతూ పెరిగి పెద్దవాళ్ళు అయ్యారో! తమ రెక్కలు వచ్చాక కన్న వారితో పాటు ఉన్న వూరుని వదిలేసి, పొట్టచేత పట్టుకొని ఎక్కడో దూర ప్రాంతాల్లోని కార్పొరేట్ కంపెనీ కార్మికులుగా చేరారో! వాళ్లకు ఇలాంటి దిక్కుమాలిన చావు ఏంటి? కన్న ఊరుకు శవాన్ని పంపే దిక్కుమాలిన స్థితి ఎదురు కావడం ఏమిటి? ఈ మానవ విలువల విధ్వంస ప్రక్రియను ఏమనాలి?

ప్రధానంగా పల్లెటూరి నిరుపేద తల్లులు ప్రేమతో తొమ్మిది నెలలు మోసి, కని, పెంచి కష్టపడే శ్రమజీవులుగా తీర్చిదిద్ది కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తే, ఆ దుష్ట పారిశ్రామిక యాజమాన్యాలు చేసే పని ఏమిటి? వారిని యంత్రాల్లో యంత్రాలుగా వాడుకొని, ఆ నిర్జీవ యంత్రాలకిచ్చే విలువని కూడా సజీవ శ్రామికవర్గానికి ఇవ్వకుండా, తుదకు నిర్జీవ శవాలుగా మార్చివేయడం ఎంతటి అమానుషం? వారిని కని, పెంచిన తల్లిదండ్రులకు కానుకగా పంపడం ఎంతటి అమానుషం! ఈ అమానుష నరమేధం ఏ విలువలకు అద్దం పడుతోంది?

ఇది ప్రమాదం కాదు. ఇది హత్య. హత్య కూడా కాదు. సామూహిక హత్యాకాండ! మానవ హక్కుల హననమే కాదు. ఇదో మానవ హననం కూడా! ఇది సామాజికంగా అస్థిరత్వాన్ని సృష్టించే పెను విధ్వంసకాండ! ప్రభుత్వాల నుండి ఏ నియంత్రణలూ లేని ఓ నిరాటంకమైన నరమేధం. ఇది కేవలం కార్మిక సమస్య కాదు. ఇది సమాజంలో సర్వ సమూహాల ప్రజలందరి పై దాడి! మానవజాతి పై దాడి!

ఆ కార్పొరేట్లలో మందుల కంపెనీలకి వద్దాం. పేదరైతుల భూముల్ని సర్కార్ల అండతో చౌకధరలకు కబ్జా చేయడం ఓరకం దోపిడీ! స్థానిక ప్రజల్ని నిర్వాసితుల్ని చేయడం మరో రకం దోపిడీ! వాటిలో పని చేసే కార్మిక, ఉద్యోగ వర్గాలను అతి తక్కువ జీతాలతో, ఎక్కువ పని భారాలతో పీడించడం వరకూ మరో రకం విశృంఖల దోపిడీ! ప్రజారోగ్యాన్ని ఆలంబన చేసుకొని మందుల కంపెనీల మాఫియా ముఠాల విధ్వంసకర దాడి మరో రకం దోపిడీ! రోగాల నయం కోసం మందుల ఉత్పత్తికి బదులు, రోగాల్ని ఉత్పత్తి చేయడం కోసమే మందుల్ని ఉత్పత్తి చేయడం హద్దులు లేని మరో ఘోర దోపిడీ! ప్రజలకు కరోనా కన్నీళ్లనీ కష్టాలనీ మిగిల్చితే మందుల కంపెనీలకు మాత్రం లాభలనూ సుఖాలనూ మిగిలించింది. ఇలా ఓ దుష్ట వ్యవస్థగా మారిన మందుల కంపెనీల వ్యవస్థ (ఫార్మా ఇండస్ట్రీ) నేడు ప్రమాదాలకు కేంద్రంగా కూడా మారింది.

రూపాయి స్వంత పెట్టుబడిని చూపించి, బ్యాంకుల నుండి 99 రూపాయల ప్రజాధనాన్ని అప్పు తీసుకొని వాటిని సైతం ఎగ్గొట్టి ఎదిగిన బడా కార్పోరేట్ కంపెనీలివి. శ్రమశక్తి కోసం ఓ రూపాయి ఖర్చు చేసి, వందల శాతం లాభాలను గడించి బలపడుతోన్న పరిస్థితికి ఇవి అద్దం పడుతున్నాయి. ఈ కార్పొరేట్ల పట్ల ప్రభుత్వాల వత్తాసు విధానాలే ఇలాంటి ప్రమాదాలకు బలాన్నిస్తోంది.

ఈ పారిశ్రామిక ప్రమాదాలకు ఏ నేరస్థ యాజమాన్యాలు కారణం అవుతున్నాయో, వాటి మీద హత్యా నేరం కేసు నమోదు చేయకుండా, పైగా వాటికి బలయ్యే మృతులకూ, క్షతగాత్రులకూ నష్ట పరిహారం పారిశ్రామిక యాజమాన్యాల నుండి వసూళ్లు చేయకుండా, వాటిని కూడా ప్రభుత్వ ఖజానా నుండే చెల్లించడం కూడా ఓ నేరమే. మున్ముందు ఇలాంటి మరిన్ని ప్రమాదాలు తాము చేసినా, తమ లాభాల నుండి నష్ట పరిహారం వసూళ్లు చేసే విధానం లేదని తెల్సిన నేరస్థ పారిశ్రామిక వర్గాలకు భయం ఏల! మేము లాభాలు గడిస్తాం,, మనుషుల్ని ఖూనీ చేస్తాం, ప్రజల నుండి వసూళ్లు చేసే ప్రజాధనం నుండి ప్రభుత్వాలు నష్ట పరిహారం చెల్లించుకుంటాయి, మాకు వచ్చిన నష్టం ఏమిటనే ధీమా వాటికి ఇవ్వడమే కదా! ఈ విధానం మార్పు కోసం సకల వర్గాల ప్రజలు ప్రభుత్వాల పై ఐక్యంగా ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఉంది. అందుకు ఇదో సందర్భం కావాలని ఆశిద్దాం.

మోడీ ప్రభుత్వం అమలు చేయనున్న నాలుగు కొత్త లేబర్ కోడ్లలో ఒకటి ఇలాంటి ప్రమాదాల నుండి కార్మికులకు భద్రతా చర్యల్ని కల్పించడం గూర్చి వుంటుంది. గతంతో పోల్చితే ఇటీవల పారిశ్రామిక ప్రమాదాల సంఖ్య, తీవ్రతలు పెరగడాన్ని బట్టి కొత్త లేబర్ కోడ్లు ఎవరికి ఎక్కువ లాభం చేకూరుస్తాయో చెప్పకనే చెప్పినట్లు అవుతుంది. పైన పేర్కొన్న విధంగా కార్మికులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఇలాంటి ప్రమాదాలపై ఓవైపు ఐక్యపోరాటం సాగిస్తూ, మరో వైపు ఈ దుస్థితికి బలాన్నిచ్చే లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మికవర్గం సమరశీల సమైక్య పోరాటాలకు కూడా నడుం బిగించాల్సి ఉంది. అందుకు తాజా పారిశ్రామిక ప్రమాదం ఒక సందర్భం అవుతుందని ఆశిద్దాం.

ఇఫ్టూ ప్రసాద్ (పిపి)

22-8-2024

Read More
Next Story