మద్యపానం ముళ్ల తీగె వూరూర అల్లుకుంటున్నది...
x

మద్యపానం ముళ్ల తీగె వూరూర అల్లుకుంటున్నది...

1965 ఆ ప్రాంతంలో యాభైకి పై చిలుకు ఉన్న రైతుల ఇళ్లలో కేవలం రెండు కుటుంబాల ఇంటి యజమానులకు తాగుడు అలవాటు ఉండేది. ఇపుడు...


-సడ్లపల్లె చిదంబరరెడ్డి


మద్యపానం గురించి విశ్లేషణో....వ్యాసమో కాదిది! సమాజంలో నేను చూసిన, నా కళ్ల ముందు జరిగిన నగ్న సత్యాల్ని ఇక్కడ చెప్పదలచు కొన్నాను.
ఆంధ్రప్రదేశ్ లోని హిందూపురం పట్టణానికి ఆనుకొని ఉన్న వ్యవసాయాధారిత ఒక పల్లె మాది. 1959 నుంచి కాస్త సమాజ అవగాహన ఉంది. 1965 ఆ ప్రాంతంలో యాభైకి పై చిలుకు ఉన్న రైతుల ఇళ్లలో కేవలం రెండు కుటుంబాల ఇంటి యజమానులకు తాగుడు అలవాటు ఉండేది. మిగతా యాభై అరవై కూలీనాలి చేసి బతికే కుటుంబాలలో ఏడెనిమిది కుటుంబాల కాయకష్ట జీవులు మాత్రమే సంత రోజు కల్లు తెచ్చి తాగేవారు. అలా తాగిన వారు ఏదో చెడ్డపని చేసినట్లు గుంభనంగా ఇంట్లో పండుకొనేవారు.
1984 లో నేను ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడై చాలా గ్రామాల్లో పని చేశాను. అన్ని చోట్లా గ్రామస్తులు సోమరులుగా ఉండకుండా పొలాల పనులో కర్మాగారాల్లో చేతనయిన పనులో చేయగలిగినవారే! అయినా ఆ కుటుంబాల నుంచీ బడికి వచ్చే పిల్లల్ని చూస్తే బీదరికం కొట్టొచ్చినట్లు కనపడేది. కనీసం పేనా, పిన్సిలు, నోటు పుస్తకాలు, సరయినబట్టలు, తలకు నూనె కానీ ఉండేదికాదు. చాలా రోజులు మన సమాజ స్థాయి ఇంతేనేమో అనుకొనేవాడిని.
ఒక పల్లెలో చిన్న మంటపంలాంటి ద్వారాలు లేని ఆవాసంలో బడి నడిచేది. నేను ఏకోపాధ్యాయుడిని. ఒక రోజు అక్కడ చిన్న బ్రాందీ సీసా కనిపించింది. దానిని తీసి "మీ ఊర్లో ఎవరైనా తాగుతారా??" అని ఐదో తరగతి పిల్లల్ని ప్రశ్నించాను. వారు ముసిముసిగా నవ్వుకొంటూ ఒకరి ముఖాలొకరు చూసుకొని "వాళ్ల నాయన...వీళ్ల తాత....ఆ పాపావాళ్ల అవ్వ, వీళ్ల మామ.." అంటూ మొత్తం ఊళ్లో తాగేవారి లిష్టంతా ఏకరువు పెట్టారు. నోరు తెరిచి వినడం నా వంతయింది.
అంతా విన్నాక "అది సరేకానీ మీలో ఎవరైనా తాగుతారా? అది బాగా రుచిగా ఉంటుందా" అని అనునయంగా అడిగాను. కొంత సేపు నిశ్శబ్దం పాటించి ఒక్కొక్కరే బయటపడ్డారు. అంగట్లో కొనుక్కొని రమ్మంటే తెస్తూ దార్లో ఎలా ఉంటుందో రుచి చూద్దామని ఒక్క గుక్క తాగినట్లు, అమ్మా నాన్నలు తాగి గూట్లో దాచిపెట్టి ఉంటే దొంగగా కొంత తాగినట్లు, వాళ్ల అన్నయ ఇంట్లో తెలియకుండా తెచ్చి రహస్యంగా గడ్డివామిలో దాచింది చూసి మరో కంటికి కనిపించకుండా మాయం చేసినట్లు....ఇలా ప్రతి పిల్లవాడూ అమ్మాయీ తమ అనుభవాలు చెబుతూ వుంటే విని నాకు మతి పోయినంత పని అయ్యింది.
1990-96 ప్రాంతంలో కర్ణాటక సరిహద్దులో పని చేసేవాడిని. అప్పుడు మద్యపాన నిషేధం ఉండేది. పొరుగునే ఉన్న కర్నాటక నుంచి దొంగగా తెప్పించడానికి చిన్నపిల్లల్నే చాలా మంది పావులుగా వాడేవారు.
ఒక రోజు ఇద్దరు ఐదో తరగతి విద్యార్థులు బడికి హాజరు కాలేదు. మరుసటి దినం వచ్చి వారి గైరుహాజరీకి సరయిన కారణం చెప్పక పోయారు. సమాజం కుళ్లు పూర్తిగా అంటని పిల్లలతో నిజాలు పలికించే రకరకాల విద్యలకు ఉపాధ్యాయులుగా మాకు తెలుసు! అలా నిజాలు కక్కిస్తే తెలిసిన అసలు సత్యం.....
బ్రాందీ సీసా తెమ్మని పొరుగున ఉన్న కర్ణాటక పల్లెకు వాళ్ల నాన్న పంపినాడు. ఒకడే వెళ్ల లేక మరొకర్ని తోడుగా తీసుకొని వెళ్లి, సీసా కొని వెనుదిరిగి వస్తూ, అది ఎలాగుంటుందో రుచి చూద్దామనే కుతూహలంతో ఒక చోట సీసా మూత తీసి కొంత తాగినారు. ఖాళీ అయిన వెళితిని నీళ్లతో భర్తీ చేద్దామని చూస్తే ఎక్కడా కని పించలేదు. అంతలో ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే వొంటేలు పోసి అమలు చేయబోయారు. ఆ తొందరలో సీసా జారి కింద పడి పగిలిపోయంది. ఇంటికి వెళ్లి ఏమి చెప్పాలని ఆలోచిస్తూ అక్కడ దారిలో ఉన్న నిమ్మ తోటలోనికి ముళ్లకంచె కిందగా దూరి కొన్ని కాయల్ని దొంగగా కోసి ఒక హోటల్లో అమ్మినారు. ఆ డబ్బు బ్రాందీసీసా కొనడానికి సరిపోలేదు. అక్కడే పారిశ్రామిక వాడలోని ఒక కంపెనీ లోనికి దూరి పాత ఇనుప చూవ్వలను తస్కరించి అమ్మి సమస్యనుండి బయటపడినారు!!
చూశారా ఒక్క వ్యక్తి యొక్క తాగుడు వ్యసనం ఇద్దరు పిల్లల్ని ఎంతగా చెడగొట్టడానికి దారి తీసిందో!!
1990 తరువాత సమాజంలో డబ్బు ఉధృతి పెరిగింది. అంతో ఇంతో కష్ట పడే ప్రతి వ్యక్తీ ఎంతోకొంత సంపాదన చేసే అవకాశం ఉంది. కానీ ఆ డబ్బంతా మద్యపానానికే ఖర్చయి పోతున్నదని ఆ అనుమానం.
2015 లో నేను ఇళ్లు కట్టాను. మేస్త్రీతో ఒప్పందం కాకుండా తాపీ పనివారినీ,కూలీలనూ దిన వేతనాలిచ్చి దగ్గరుండి కట్టించాను. నా దగ్గర పని చేసిన వారిలో 90 శాతం మంది తమ కష్టార్జితంలో 80 శాతం డబ్బును ప్రతినిత్యం తాగడానికి వెచ్చించేవారే!! తాగుడు అనారోగ్యానికి దారితీస్తుందని నేనటే "సార్! పగలంతా కష్ట పడే మాకు తాగక పోతే నిద్దురరాదు" అనే వారు.
అయితే తాగని ఒకరిద్దరు మాత్రం తాగే వారికంటే దృఢంగా శ్రమను దాచుకోకుండా నిజాయితీగా పని చేసేవారు. "సార్! నేను ఇరవై ఏళ్లుగా ఇలా ఇళ్ల కట్టడాల పని చేస్తున్నాను. ప్రతివారం మాంసం తింటాను. ఇంతవరకూ హోటల్లో తిని ఎరుగను. ఇంట్లో చేసింది తిని హాయిగా నిద్రపోతున్నాను. ఇదే సంపాదనతో సొంతంగా ఇల్లు కట్టుకొన్నాను. తాగుడుకు బానిసలు అయినవారు దానిని మానలేక లేనిపోని సాకులు చెబుతారు" అని తమ నిజయితీని చెప్పేవారు!
నా వయస్సిప్పుడు 68 సంవత్సరాలు. అరవై యేళ్ల నుంచీ నాకున్న ఊపిరితిత్తుల జబ్బుకు వైద్యులు చెప్పిన మందులు వాడుతూ కులాసాగానే ఉన్నాను. అయితే నా సమకాలీకులు, నాకన్నా ఐదారేళ్ల చిన్నవాళ్లలో సగం మంది నా కళ్ల ముందే కాలమై పోయారు!! కారణం ఒక పద్ధతీ పాడూ లేకుండా విపరీతంగా తాగి చేజేతులా చావును కొనితెచ్చుకోవడమే!! ఇలాంటి ఉదాహరణలు ఎన్నయినా చెప్పగలను.
చివరికి చెప్పేది ఏమిటంటే ఈ మద్యం మహమ్మారి సమాజాన్ని రోగాలకు గురిచేస్తూ డాక్టర్లనూ, మందుల షాపులనూ బతికించడమేకాక అకాల మరణాలకు కారణమై ఎంతో మంది పిల్లలను అనాదలుగా, భార్యలను వితంతువులుగా ముసలీ ముతకా తల్లిదండ్రుల్ని సోకసంద్రంలో విలపించేవారుగా చేస్తూ ఉంది.

నేను ఇప్పుడు రోజు 2 కిలోమీటర్లు వాకింగుకు వెళుతున్నాను రెండు పూట్లా. ఒక కిలోమీటర్ దారిలో రెండుమూడు దొంగగా మందులు అమ్మే చోట్లు. ఒక చోట శ్రమపడి ముళ్ల కంపలు తొలగించిన సంగతి. అక్కడ ఏదో సంస్థ చెట్లు నాటి ఉంటే పెద్ద వనంలా కనిపిస్తే వీడియో తీస్తాం అని వెళితే లోపల పెద్ద బెల్ట్ షాపు.... ఈ పరిధిలో నెలకు కనీసం ఇద్దరు 50ఏళ్ళ లోపువారు మద్యానికి బానిసలై మరణిస్తూ ఉన్నారు.

దీనిని దశలవారీగా నిషేధించడం చాలా అత్యవసరం.


(సడ్లపల్లె చిదంబరరెడ్డి ప్రముఖ కవి, కథా రచయిత)

Read More
Next Story