
రాయలసీమ
98 ఏళ్ల కింద ఇదే రోజున 'రాయలసీమ' పుట్టింది.. ఏమా కథ!
దత్తమండలాలు ‘రాయలసీమ’ గామారిన వైనం ఏమిటి?
-మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి
‘రాయలసీమ’ అంటే పౌరుషం, రాయలసీమ అంటే నమ్మకం, రాయలసీమ అంటే విశ్వసనీయత వెనుకబడిన ప్రాంతంగా ఉన్నా అమెరికాలో ఉన్న వారు కూడా మాది రాయలసీమ అని చెప్పుకోవడానికి సిద్ధపడతారు. అలాంటి సీమకు ఆ పేరు ఎలా వచ్చింది. ఎవరు ఆ పేరును ఎవరు పెట్టారు లాంటి ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది.
దత్తమండలాలుగా ఎలా వచ్చాయి?
రాయలసీమ ప్రాంతం ఆదినుంచి అనాథకాదు. 1800 కి ముందు, తర్వాత నైజాం ఆదీనంలోకి వెల్లిన నాటి నిజాం, ఆంగ్లేయుల పాలన, పాలేగాళ్ల వ్యవస్దతోనే రాయలసీమ కరువు సీమగా మారింది. అంతకు ముందు విజయనగర రాజుల కాలంలో రతనాలసీమగా విరాజిల్లింది. తమ అవసరాల కోసం నిజాం సీమ ప్రజల అబిమతంతో సంబందం లేకుండా ఆంగ్లేయులకు వదిలిపెట్టినారు. అలా సీడెడ్ ప్రాంతంగా, దత్తమండలాలుగా పిలవబడ్డ సీమకు ‘రాయలసీమ’ అని నామకరణం జరిగిన రోజు 1928 నవంబర్ 18. అలా సీమ రాయలసీమగా ఆత్మగౌరవంతో నిలబడింది.
చరిత్రలోకి వెలితే...
1800 కి పూర్వం రాయలసీమ ప్రాంతం రతనాలసీమ. రాక్షసితంగడి యుద్దంలో విజయనగర సామ్రాజ్యం పతనం కావడంతో బలమైన రాజులు లేని పరిస్థితులలో వరుస దాడులు కారణంగా నైజాం నవాబు పాలనలోకి సీమ ప్రాంతం నెట్టబడింది. మరాఠ వారితో యుద్ద బయంతో ఉన్న నిజాము ఆంగ్లేయులతో సైనిక సహరం చేసుకున్నాడు. అందుకు ఆంగ్లేయులకు తగిన పరిహరం ఇవ్వలేని నిజాము సీమ ప్రాంతాన్ని ఆంగ్లేయులకు వదిలివేసినారు. ఆ మొత్తం వ్యవహరంలో సీమ ప్రజల మనోబావాలను లెక్కలోకి తీసుకోలేదు. అలా నిజాము నవాబు నుంచి ఆంగ్లేయుల చేతిలోకి వెళ్ళింది. అప్పటికే పాలేగాళ్లు ఏలుబడిలో ఉన్న సీమ ప్రాంతంలో ప్రారంబంలో ఆంగ్లేయులకు పాలేగాళ్ల నుంచి ప్రతిఘటన వచ్చింది. బలమైన సైనిక సామర్ద్యం ఉన్న ఆంగ్లేయుల ముందు బలహీనమైన సీమపాలేగాళ్లు నిలువలేకపోయినారు. ఆంగ్లేయుల ఆదిపత్యాన్ని వ్యతిరేకించడం ద్వారా సీమ పాలేగాళ్లు తొలి స్వతంత్యోద్యమాన్ని నిర్వహించి చరిత్రలో నిలిచినారు. అందులో ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి అగ్రగణ్యుడు. ఉత్తరాదిన జరిగిన సిపాయిల తిరుగుపాటుకు మునుపే మన సీమలో ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని ప్రశ్నించారు ఉయ్యాలవాడ. తొలి స్వాతంత్ర్య పోరాటం చేసిన ఘనత మన సిమదే కాని ఈ నాటికి చరిత్రలో ఆ స్దానం మనకు లబించలేదు. ఆంగ్లేయులకు నైజాం వదిలించుకున్న ప్రాంతం కావడం వలన దీన్ని సీ డె డ్ ప్రాంతంగా పివబడింది. దీన్నే తెలుగు అర్దంలో దత్తమండలం అని పిలిచినా నిజానికి సీ డె డ్ అన్న పదానికి దత్త మండలం అన్న అర్దం సరికాదు. వదిలి వేయించుకున్న ప్రాంతం అని అర్ధం. వదిలివెయంచుకున్న ప్రాంతం అనే దానికన్నా ఆంగ్లేయులు దత్తత తీసుకున్న ప్రాంతం అని పిలిస్దే సీమ ప్రజల మన్నలనను పొందవచ్చు అన్న ఉద్దేశం కావచ్చు అలా సీమ ప్రాంతం దత్తమండలాలుగా, సీ డె డ్ ప్రాంతంగా పిలవబడింది.
నంద్యాలలో ప్రథమ దత్తమండలాల కీలక నిర్ణయం
1913 లో ప్రారంభమైన ఆంధ్ర మహసభలు 1928న 17,18 తేదీలలో నంద్యాలలో జరిగాయి. రెండు రోజుల సభలలో ఒక రోజు కచ్చితంగా దత్తమండలం సమస్యలపై సమావేశంలో చర్చించే అవకాశం ఇస్దేనే తాము సహకరిస్దామన్న ఈ ప్రాంతనేతల వత్తిడి మేరకు 18న కడప కోటిరెడ్డి అద్యక్షతన ప్రదమ దత్తమండలం సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పాల్గొన్న చిలుకూరి నారాయణరావు ( అనంతపురం కాలేజి అద్యాపకులు శ్రీకాకులం వాసి) గొప్ప చరిత్ర కలిగిన ఈ ప్రాంతానికి దత్త ప్రాంతం అన్న పేరు బాగుండదని రాయలసీమ అన్న పేరు ఉంటే బాగుంటుందని ప్రతిపాదించినారు. ఈ ప్రతిపాదనను పప్పూరి రామాచార్యులు బలపరచడంతో సభ ఏకగ్రీవంగా రాయలసీమ అన్న ప్రతిపాదనను ఆమోదించడంతో నాటి నుంచి రాయలసీమగా మారింది.
త్యాగాల సీమకు నిందల మరక
రాయలసీమ అంటేనే త్యాగం తెగువ, నాయకత్వం. కానీ రాయలసీమ వారి కృషితో ఎదిగిన సినీ పరిశ్రమ రాయలసీమ పై అసత్య ప్రచారాలు, ఆవాస్తవాలే ప్రామాణికంగా సినిమాలు తీస్తూ త్యాగాల సీమకు నిందల మరక అంటిస్తూనే ఉన్నారు. రాయలసీమ అంటే సినిమా వాళ్ళు చూపేవి ఏమాత్రం కాదు. 1953 అక్టోబర్ 1 మద్రాసు నుంచి విడిపోవడానికి రాయలసీమ ప్రజల త్యాగం మరువలేనిది. అత్యంత సమీపంలోని మద్రాసు మహానగరాన్ని వదులుకుని తోటి తెలుగు ప్రజల హామీ (శ్రీబాగ్ ఒప్పందం) విశ్వసించి ఆంధ్రరాష్ట ఏర్పాటుకు సహకరించింది రాయలసీమ. అటు పిమ్మట తెలంగాణతో కలిసి విశాలాంధ్ర కోసం కర్నూలు రాజధానిని త్యాగం చేసి 1956 నవంబర్ 1 న ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు సహకరించింది కూడా రాయలసీమ ప్రజలే. ప్రేమ, సాయం సీమ ప్రాంతం ప్రత్యేకత. ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన ప్రఖ్యాత నటుడు చిరంజీవి గారు తన స్వంత ప్రాంతంలో ఓడిపోయినా రాయలసీమలోని తిరుపతి ప్రజలు గెలిపించారు. ఆ ఎన్నికల్లో తిరుపతిలో కూడా చిరంజీవి ఓడిపోయి ఉంటే వారి రాజకీయ జీవితం ప్రారంభంలోనే ముగిసిపోయి ఉండేది. అలా తమను నమ్మిన వారి కోసం నిలబడే గొప్ప గుణం సీమ ప్రాంతం గొప్పదనం. అనేక మంది చారిత్రక పురుషులను కన్న గడ్డ సీమ. ఆధ్యాత్మిక పుణ్య క్షేత్రాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలతో వాతావరణ సమతుల్యత రాయలసీమకు స్వంతం. అయినప్పటికీ సినిమా పరిశ్రమ తమ వ్యాపార ప్రయోజనాల కోసం ప్యాక్షన్ లీడర్లు గా, ప్రాణం విలువ తెలియని వారిగా చిత్రీకరిస్తూనే ఉన్నారు. ఆదిపత్య రాజకీయాల కోసం శత్రువులుగా మారిన తమ ప్రత్యర్తి కుటుంబ సభ్యుల ముఖ్యంగా మహిళల జోలికి పొనటువంటి వ్యక్తిత్వం రాయలసీమ నాయకులది. కులవివక్ష పై పరిశీలన కోసం నియమించిన జస్టిస్ పున్నయ్య కమిషన్ తన నిర్ధారణలో రాయలసీమకు రాకు ముందు ఇక్కడ కుల వివక్ష ఎక్కువ ఉంటుందని భావించాను కానీ ఆధిపత్య వర్గాలు ఉన్న రెడ్లు దళితుల మధ్య మామ, బామ్మర్ది అనే సంభాషణ , నట్టింటిలోకి దళితులు వెళ్ళే పరిస్థితులను చూసాను అని నేను ఎస్వీ యూనివర్సిటీ లో నిర్వహించిన సదస్సులో అన్నారు. సహజ నాయకత్వ లక్షణాలు ఉన్న రాయలసీమ నాయకులను రాజకీయంగా ఎదుర్కొనలేక అసత్యాలను, ఆవాస్తవాలను నిత్యం ప్రచారంలో పెడుతూనే ఉన్నారు.
బిడ్డల నిరాదరణతో నష్టపోయిన సీమ
ఒక కుటుంబం లేదా ప్రాంతం కన్న బిడ్డల నుంచి ఆదరణ పరాయి వారి నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ రాయలసీమ మాత్రం అందుకు భిన్నమైనది. దశాబ్దాల క్రితం విదేశీయులు నిర్మించిన KC కెనాల్ మినహాయించి నేటికీ ఒక లక్ష ఎకరాల భూమికి నీరు అందించే సమగ్ర ప్రాజెక్టు రాయలసీమ లేదు. కానీ రాష్ట్రంతో మొదటి ముఖ్యమంత్రి నుంచి నేటి వరకూ ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలు సింహ భాగం సీమ వారే. ఈ ఉదాహరణ చాలు రాయలసీమ దుస్థితిని అర్దం చేసుకోవడానికి. తీవ్ర కరువును చూసిన ఆంగ్లేయులు రాయలసీమను శస్యశ్యామలం చేయడానికి ఉపయోగపడే కృష్ణా పెన్నారును ఆంగ్లేయుల రూపొందిస్తే మన వారే దాన్ని పక్కన పెట్టారు. తిరుమలలోని అన్నమయ్య తాళపత్రాలను భద్రపరచడం నుంచి ఆంద్రాఊటి హర్శిలిహిల్స్ వరకు దోపిడీ చేయడానికి వచ్చిన ఆంగ్లేయులు అభివృద్ధికి కృషి చేసారు. దోపిడీ చేయడానికి వచ్చిన వారి ప్రేమను పొందిన గొప్ప రాయలసీమ స్వంత బిడ్డల నుంచి నిరాదరణకు గురై కరువు సిమగా నిలిచింది.
98 సంవత్సరాల క్రితం అవమానకరంగా పిలిచుకున్న దత్తమండలం నుంచి ఆత్మగౌరవంతో కూడిన రాయలసీమగా మారిన మన సీమ మన ప్రాంత నేతల పదవి వ్యామోహం మూలంగా పాలకుల వివక్షపూరిత పాలన కారణంగా మరింతగా పతనం కాబడి కువైట్ లో చెన్నై, కేరళలో బిక్షాటన చేసుకునే అవమానకర పరిస్దితి ఎదుర్కొంటున్నాము. వేల మంది రైతులు ఆత్మహత్యలు, లక్షల మంది వలసలు, సీమలో పుడుతున్న 100 మంది పిల్లలలో 45 మంది బలహీనంగా పుతున్నారన్న ఐక్యరాజ్యసమితి గణాంకాలు మన సీమ నేతల నుంచి కనీస స్పందన ఉండటంలేదు. నేతల తీరుతోబాటు ప్రజలు సైతం కులం, మతం, పార్టీల అబిమానం పేరుతో గుడ్డిగా సమర్దిస్తున్నాము పలితం ఒకనాటి రతనాల సీమ నేడు రాళ్లసీమగా మారింది. ఆత్మగైరవ నినాదంతో ప్రారంబమైన రాయలసీమ ప్రజల ప్రస్దానం చైతన్యంతో వివక్ష అంతం అయ్యేదాక ఆత్మాబిమానంతో మన జీవితాలు ఉండేరోజు కోసం పోరాడుతూనే ఉండాలి.
(*మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి,సమన్వయ కర్త,రాయలసీమ మేధావుల ఫోరం)
Next Story

