మంగళగిరి ఎయిమ్స్ లో ర్యాగింగ్: 13 మంది విద్యార్థుల సస్పెన్షన్
x

మంగళగిరి ఎయిమ్స్ లో ర్యాగింగ్: 13 మంది విద్యార్థుల సస్పెన్షన్

అసలు జరిగిందేమిటి?


-నరసింహ

మంగళగిరి ఎయిమ్స్ లో ఓ వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి కారణమనే ఆరోపణలతో 13 మంది సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేశారు.సస్పెండైన వారిలో డీన్ కొడుకు కూడా ఉన్నారు. ముగ్గురిని ఏడాదిన్నర, ఆరుగురిని ఏడాది, మరో నలుగురిని ఆరు నెలలు సస్పెండ్ చేశారు. అందరికీ రూ. 25 వేల జరిమానా విధించారు.

అసలు ఏం జరిగింది?

తమపై జూనియర్ విద్యార్థి తప్పుడు ప్రచారం చేశారనేది సీనియర్లు ఆరోపణ. ఈ విషయమై సీనియర్లకు,ఆ విద్యార్థికి మధ్య గ్యాప్ ఏర్పడింది. దీంతో గత నెల అంటే జూన్ 22న జూనియర్ వైద్య విద్యార్థి తన స్నేహితులతో మాట్లాడుతున్న సమయంలో సీనియర్లు ర్యాగింగ్ చేశారు. సీనియర్ల వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపిస్తూ ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితుడి స్నేహితులు ఈ విషయాన్ని యూజీసీ దృష్టికి తీసుకెళ్లారు.ఈ ఘటన జరిగిన మరుసటి రోజు అంటే యూజీసీ ఆదేశాలతో జూన్ 23న కాలేజీ యాజమాన్యం అంతర్గత విచారణకు ఆదేశించింది. ర్యాగింగ్ నిరోధక కమిటీ విచారణ చేసింది. బాధితుడిపై ర్యాగింగ్ లో 13 మంది విద్యార్థుల పాత్ర ఉందని ఈ కమిటీ నిర్ధారించింది.

అసలు ర్యాగింగ్ అంటే ఏంటి?

కొత్తగా చేరిన విద్యార్థులను వేధించడం, అవమానించడం లేదా వారితో బలవంతంగా ఏదైనా చేయించడం ర్యాగింగ్ కిందకు వస్తోంది.స్వాతంత్ర్యం రావడానికి పూర్వమే ఇండియాలో ర్యాగింగ్ సంప్రదాయం ఉన్నట్టు చెబుతారు.బ్రిటీష్ వారి నుంచి ర్యాగింగ్ ఇండియాలోకి వచ్చిందంటారు. తొలుత విద్యాసంస్థల్లో చేరే కొత్త విద్యార్థులకు స్వాగతం పలికే పద్దతులు ఉండేవి.ముఖ్యంగా ఇంగ్లీష్, ఆర్మీ కోర్సుల్లో చేరేవారికి ర్యాగింగ్ ఉండేది.అయితే ఇది సరదాగా ఉండేదని చెబుతారు. ఎలాంటి హింస, దాడి వంటివి లేవు. 1980 నాటికి ర్యాగింగ్ అనేది హింసాత్మక పద్దతుల వైపు మళ్లింది. 1990 నాటికి ఇది తీవ్రంగా మారింది. అయితే అప్పటికే ప్రైవేట్ రంగంలో మెడికల్,ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి. ర్యాగింగ్ భయంకరమైన కొత్త రూపాన్ని సంతరించుకొంది. దీంతో ర్యాగింగ్ ను నిషేధించాలనే డిమాండ్ మొదలైంది.

ర్యాగింగ్ పై నిషేధం

దేశంలోని పలు విద్యాసంస్థల్లో ర్యాగింగ్ తో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో విద్యార్ధుల భవిష్యత్తును ర్యాగింగ్ చిదిమిస్తోంది. అందుకే చాలా రాష్ట్రాలు చట్టాలు చేశాయి. దీంతో 2001లో ర్యాగింగ్ పై సుప్రీంకోర్టు నిషేధం విధించింది.అయినా కూడా కొన్ని విద్యాసంస్థల్లో ర్యాగింగ్ ఘటనలు వెలుగు చూశాయి. 2009లో ధర్మశాలలోని మెడికల్ కాలేజీలో అమన్ కచ్రు అనే స్టూడెంట్ మరణించారు. ఈ ఘటనతో దేశంలోని అన్ని విద్యాసంస్థలు ర్యాగింగ్ నిరోధక చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు యూజీసీ కూడా కఠిన మార్గదర్శకాలు రూపొందించింది.

ర్యాగింగ్ బాధితుల్లో 10 శాతం కంటే తక్కువ మందే ఫిర్యాదులు చేస్తారని యూజీసీ అధ్యయనమే తేల్చింది. 60 శాతం విద్యార్థులు ర్యాగింగ్ బారినపడుతున్నారని 2015లో జేఎన్ యూ రిపోర్ట్ తెలిపింది.2017లో నిర్వహించిన మరో సర్వేలో 40 శాతం విద్యార్థులు ఏదో ఒక రకమైన ర్యాగింగ్ బారినపడినవారేనని తేలింది. ర్యాగింగ్ కు గురైన వారిలో ఎక్కువగా ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులే ఎక్కువ. యూజీసీ నిర్వహిస్తున్న ర్యాగింగ్ హెల్ప్ లైన్ కు 2021-22 లో 582 , 2022-23లో 858 , 2023-24లో 1240 ఫిర్యాదులు అందాయి. ఇవి కాకుండా ఆయా పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులు అదనం.2018 జనవరి నుంచి 2023 జూలై వరకు దేశంలోని పలు విద్యాసంస్థల్లో ర్యాగింగ్ తో 25 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని యూజీసీ తెలిపింది. మరో వైపు 119 మంది వైద్య విద్యార్థులు పలు కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారని నేషనల్ మెడికల్ కౌన్సిల్ వెల్లడించింది.2018 -2021 మధ్య కాలంలో ర్యాగింగ్ పై యూజీసీకి మొత్తం 2790 ఫిర్యాదులు అందాయి. వీటిలో దాదాపు 1296 కేసుల్లో చర్యలు తీసుకున్నారు.

ర్యాగింగ్ కు వ్యతిరేక చట్టాలు

విద్యా సంస్థల్లో ర్యాగింగ్ నిరోధక కమిటీలను ఏర్పాటు చేయాలని యూజీసీ సూచించింది. ర్యాగింగ్ పై ఫిర్యాదు చేసేందుకు 1800 180 5522 టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా అందుబాటులోకి తెచ్చారు. helpline@anti-ragging.in కు కూడా ఫిర్యాదు చేయవచ్చు. ర్యాగింగ్ పై ఫిర్యాదు చేసిన విద్యార్థి పేర్లను గోప్యంగా ఉంచుతారు. 2007లో ర్యాగింగ్ పై రాఘవన్ కమిటీని ఏర్పాటు చేశారు.ఈ కమిటీ సిఫారసులను దశలవారీగా అమలు చేస్తున్నారు. ర్యాగింగ్ నిషేధ చట్టం 2011లో అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా ర్యాగింగ్ ను నేరంగా పరిగణిస్తారు. ర్యాగింగ్ కు పాల్పడితే జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తారు. ఈ రెండు శిక్షలు కూడా విధించవచ్చు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ర్యాగింగ్ నిరోధం కోసం ప్రత్యేక చట్టాలను అమల్లోకి తెచ్చాయి. ప్రతి విద్యా సంస్థలో ర్యాగింగ్ వ్యతిరేక కమిటీలు ఏర్పాటు చేయాలి. ర్యాగింగ్ నిరోధించడంలో ఈ కమిటీలు పనిచేస్తాయి.

1997లో తమిళనాడు ప్రభుత్వం ర్యాగింగ్ నిషేధ చట్టం అమలు చేసింది. ర్యాగింగ్ కు పాల్పడితే ఆరు నెలల నుంచి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తారు... పదివేల వరకు ఫైన్ విధిస్తారు. తమిళనాడు తరహాలోనే ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ రకమైన చట్టాలను అమలు చేశారు.ర్యాగింగ్ కింద చేసిన చట్టాల ప్రకారం అప్పట్లో ఐపీసీలోని 339,340, 351 సెక్షన్ల కింద శిక్షలు విధిస్తారు.

Read More
Next Story