
మేము మనుషులం కాదా? వైఎస్సార్‌సీపీ నేతలు
సాల్మన్ హత్యకు నిరసనగా వైఎస్సార్‌సీపీ అగ్రనేతలు సోమవారం డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు.
రాష్ట్రంలో దళితులపై దాడులు, హత్యలు పెచ్చురిల్లుతున్నాయని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ అగ్రనేతలు సోమవారం డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. పల్నాడు జిల్లా పిన్నెల్లిలో దళిత కార్యకర్త మందా సాల్మన్ దారుణ హత్యపై వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. డీజీపీ అపాయింట్‌మెంట్ నిరాకరించడంతో నేతలంతా కార్యాలయం గేటు ముందే బైఠాయించి ధర్నాకు దిగారు. చివరకు దిగివచ్చిన అధికారులు.. ఏడీజీ ద్వారా ఫిర్యాదును స్వీకరించారు.
మాజీ మంత్రి మేరుగ నాగార్జున పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సాల్మన్‌ను హత్య చేసిన నిందితులపై కాకుండా, చనిపోయిన వ్యక్తిపైనే పోలీసులు కేసులు పెట్టడం అత్యంత దారుణం. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. సీబీఐతో విచారణ జరిపించి, బాధిత కుటుంబానికి రూ. కోటి పరిహారం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.
పోలీసుల తీరుపై మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిలు నిప్పులు చెరిగారు. 10-15 సార్లు వచ్చినా డీజీపీ ఫిర్యాదు తీసుకోకపోవడం దారుణం. డీజీపీ అసలు స్పందించడం లేదు, ఆయన చంద్రబాబుకు ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారు అని అంబటి రాంబాబు మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలు చెబితే తప్ప పోలీసులు స్టేషన్‌లోకి రానివ్వడం లేదు. సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉంది? అని విడదల రజిని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ.. డీజీపీ కార్యాలయానికి వస్తే కనీసం మనుషులుగా కూడా చూడకుండా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రోద్బలంతోనే దళితులను ఊచకోత కోస్తున్నారని, దళితులకు ఈ రాష్ట్రంలో బతికే హక్కు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రక్షణ కరువైన ఈ ఆటవిక పాలనకు త్వరలోనే చెక్ పెడతామని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ హెచ్చరించారు. ఈ ఆందోళనలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

