దళితులపై దాడులా సిగ్గు సిగ్గంటూ జగన్ సేన గర్జన
x
కాకినాడలో వైసీపీ కార్యకర్తల ధర్నా

'దళితులపై దాడులా సిగ్గు సిగ్గంటూ' జగన్ సేన గర్జన

రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నిరసన జ్వాలలు: 'రెడ్ బుక్' పాలనపై సమరశంఖం


ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజకీయ కక్షసాధింపులు, దాడులు పెరిగిపోయాయని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శనివారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు దిగాయి. పల్నాడు జిల్లా పిన్నెల్లిలో దళిత కార్యకర్త సాల్మన్‌ను అత్యంత కిరాతకంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు శనివారం (జనవరి 17) అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ధర్నాలు చేపట్టారు. రాష్ట్రంలో రాజ్యాంగం కాకుండా ‘రెడ్ బుక్’ పాలన సాగుతోందని పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

జిల్లాలలో నిరసనల హోరు..
తిరుపతి: ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి ధర్నా చేపట్టారు. సాల్మన్ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్‌గ్రేషియా, 5 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. "దళితులపై కక్ష సాధిస్తున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పే రోజు వస్తుంది" అని నేతలు హెచ్చరించారు.
విజయవాడ: మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. దాడులు చేస్తున్న వారికి పోలీసులు కొమ్ముకాస్తున్నారని, ఏపీలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు.

నరసరావుపేట & ఏలూరు: "మంచి ప్రభుత్వం అంటే మర్డర్లు చేయడమేనా?" అని ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు ప్రశ్నించారు. పిన్నెల్లి హత్యాకాండను తీవ్రంగా ఖండిస్తూ పాత బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు.
విజయనగరం & పార్వతీపురం: కలెక్టరేట్ వద్ద మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో, పార్వతీపురంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు నేతృత్వంలో నిరసనలు జరిగాయి. టీడీపీకి ఎస్సీలంటే చులకన భావం అని దళిత సంఘాలు మండిపడ్డాయి.

కర్నూలు & నంద్యాల: కూటమి ప్రభుత్వం హత్య రాజకీయాలను వీడకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని వైఎస్సార్‌సీపీ హెచ్చరించింది. మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, శ్రీదేవమ్మ తదితరులు పాల్గొన్నారు.
కడప & కాకినాడ: అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి, నివాళులర్పించిన అనంతరం పార్టీ శ్రేణులు ధర్నా చేపట్టాయి. ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధాన డిమాండ్లు...
సాల్మన్‌ను హత్య చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి.
బాధిత కుటుంబానికి ₹1 కోటి ఆర్థిక సాయం, ఐదు ఎకరాల భూమి కేటాయించాలి.

రాష్ట్రంలో రాజకీయ దాడులను అరికట్టి, 'రెడ్ బుక్' పాలనను నిలిపివేయాలి.
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ నిరసన కార్యక్రమాల్లో మాజీ మంత్రులు, నియోజకవర్గ ఇన్-చార్జులు, దళిత, మైనార్టీ సంఘాల నేతలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు.
Read More
Next Story