
వైఎస్సార్ పేరును తొలగిస్తున్న దృశ్యం
'నాగార్జున ఇంజినీరింగ్ కాలేజీకి వైఎస్సార్ పేరు పెట్టమన్నదే నేను'
పేరు తొలగింపు నేపథ్యంలో ఆనాటి ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల రూటే వేరు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పథకాలు, వాటి పేర్లు, విగ్రహాలు, విలువలకు సరికొత్త భాష్యాలు వస్తుంటాయి. ఇప్పుడు అటువంటిదే మరొకటి జరిగింది.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీకి పెట్టిన వైఎస్సార్ పేరును ప్రస్తుత వైస్ ఛాన్సలర్ తొలగించారు. దీనిపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు హైల్త్ యూనివర్శిటీకి ఉన్న ఎన్టీఆర్ పేరును ఆనాటి వీసీ తొలగించారు. అప్పుడు టీడీపీ వాళ్లు గొడవ చేశారు. ఇప్పుడు వైసీపీ వాళ్లు ఆందోళన చేస్తున్నారు.
అడిగిన 24 గంటల్లోనే..
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలగా కొనసాగుతున్న పేరును మార్చాలని టీడీపీ విద్యార్థి విభాగమైన టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు వర్సిటీ ఇన్‌చార్జి వీసీ ఆచార్య కె.గంగాధరరావును కోరారు. వారు కోరిన 24 గంటల్లోనే గురువారం క్రేన్‌ను రప్పించి ఇంజినీరింగ్ కళాశాలపై ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును తొలగించడం వర్సిటీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో అసలు వైఎస్సార్ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో తెలుపుతూ 2004 నుంచి 2010 వరకు నాగార్జున యూనివర్శిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబరుగా పని చేసిన ప్రొఫెసర డిఏఆర్ సుబ్రమణ్యం శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయన ఏమన్నారో యధాతథంగా ఇక్కడ ఇస్తున్నాం.
"నాగార్జున యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలకు వైయస్సార్ పేరుని తొలగిస్తూ నిన్న యూనివర్సిటీ అధికారులు ఆదేశాలు ఇచ్చారు . ఈరోజు తత్సంబంధిత వార్తలో వైసీపీ ప్రభుత్వం మెప్పు కొరకు నాటి VC ఆచార్య రాజశేఖర్ వైఎస్సార్ పేరు పెట్టారని పేర్కొన్నారు. ఇది వాస్తవం కాదు . ఈ మొత్తం వ్యవహారానికి ప్రత్యక్ష సాక్షిని నేను . అందువలన స్పందిస్తున్నాను .
2009 లో వైఎస్సార్ హఠాన్మరణం తర్వాత నాగార్జున యూనివర్సిటీ పాలకమండలి ఇంజనీరింగ్ కళాశాలకు వైఎస్సార్ పేరు పెట్టేందుకు తీర్మానించాం . ఆ పాలకమండలిలో నేను సభ్యుడిని . నాటి VC ఆచార్య హరగోపాల్ రెడ్డి .
అందరికీ తెలిసిన విషయమే . 2010 లో జగన్ సొంత పార్టీ పెట్టుకోవడం, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు ప్రత్యర్ధి కావటంతో కాంగ్రెస్ పాలనలో కూడా నాటి వైస్ చాన్సలర్లు- వైఎస్సార్ విగ్రహం ఏర్పాటుకు, కళాశాలకు వైఎస్సార్ పేరు పెట్టడానికి వెనుకాడారు.
తర్వాత 2014-2019లో టీడీపీ ప్రభుత్వంలో యూనివర్సిటీ వైఎస్సార్ పేరు ఎందుకు పెడుతుంది? అలా ఆశించడం కూడా కరెక్టు కాదు . 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆచార్య రాజశేఖర్ VC గా నియమితులైన తర్వాత నేనే ఆయన్ని కలిసి ఈ రెండు పెండింగ్ విషయాలను చెప్పాను .
దరిమిలా ఆయన చొరవ తీసుకుని విగ్రహ స్థాపనని, కళాశాల పేరు పెట్టటాన్ని పూర్తి చేశారు . AICTE అనుమతిని కూడా తీసుకున్నారు . అడ్మిషన్లలో కూడా వైఎస్సార్ పేరుతోనే కళాశాల పేరు ఉంది . 2024లో ప్రభుత్వం మారిన తర్వాత యూనివర్సిటీ అధికారులు వైఎస్సార్ పేరుని తొలగించి AICTE కి తెలియపరిచారు . ఇవీ వాస్తవాలు.
నా అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం మారాక వైఎస్సార్ పేరుని తీసివేయటం సబబు కాదు . సత్సాంప్రదాయం కాదు .
Disclaimer : హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరుని జగన్ ప్రభుత్వం తీసివేసినప్పుడు కూడా నేను ఆనాడే ఆ చర్యను తప్పు పట్టాను.
నా విన్నపం ఏమిటంటే రాష్ట్రంలో, దేశంలో ఇలా ఉన్న పేర్లను తీసివేయటం లేదా మార్చటం సత్సాంప్రదాయం , సబబు కాదు . అవసరం కూడా లేదు . పరస్పరం గౌరవించుకునే వాతావరణం అవసరం. యూనివర్సిటీ అధికారులు పునస్సమీక్ష చేయవలసినదిగా మనవి" అని Prof D A R Subramanyam పేర్కొన్నారు. ఆయన 2004 నుంచి 2010 వరకు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ EC Memberగా, 2004 నుంచి 2016 వరకు Senate Member గా, 2008 నుంచి 2016 వరకు Planning & Monitoring Board (2008-2016)గా పని చేశారు.
Next Story

