
కూటమి సర్కారుపై జగన్ యుద్ధభేరి..రేపు 'పవర్‌ఫుల్' ప్రెస్ మీట్!
జగన్ పాదయాత్ర (జగన్ 2.0) చేపట్టనున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, రేపటి సమావేశంలో దీనిపై ఏమైనా హింట్ ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకోనుంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు మీడియా ముందుకు రానున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ వైఫల్యాలే లక్ష్యంగా జగన్ విమర్శనాస్త్రాలు సంధించనున్నారు. జరుగుతున్న పరిణామాలపై నిప్పులు చెరగనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతల క్షీణత, వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు, 'భోగాపురం' క్రెడిట్ వార్ వంటి అంశాలపై జగన్ తన గళం విప్పబోతున్నారు. ఈ మేరకు పార్టీ వర్గాలు అధికారిక ప్రకటన విడుదల చేశాయి. దీంతో అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సామాన్య ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
జగన్ ప్రస్తావించనున్న ప్రధాన అంశాలు ఇవే
ఇటీవల భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన టెస్ట్ ఫ్లైట్ విజయవంతం కావడంతో, దీని క్రెడిట్ తన ప్రభుత్వానిదేనని జగన్ బలంగా వినిపించనున్నారు. భూసేకరణ నుంచి, ఆర్‌ఆర్ ప్యాకేజీ (సుమారు రూ. 960 కోట్లు) పూర్తి చేయడం వరకు తమ హయాంలోనే జరిగిందని, ఇప్పుడు చంద్రబాబు దీనిని తమ ఖాతాలో వేసుకోవాలని చూడటం 'క్రెడిట్ చోరీ' అని ఆయన ధ్వజమెత్తనున్నారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులు, అక్రమ కేసులు, పోలీసుల ఏకపక్ష వ్యవహారశైలిపై జగన్ గట్టిగా మాట్లాడనున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని, నిరుద్యోగ భృతి, తల్లికి వందనం వంటి పథకాలపై వివరణ కోరనున్నారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో చంద్రబాబు పొరుగు రాష్ట్రాలతో కుదుర్చుకుంటున్న ఒప్పందాలు ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయని, ముఖ్యంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేతపై ఆయన ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు.
రాజకీయ ప్రాముఖ్యత
జనవరి 7న ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం సందర్శించి సాగునీటి ప్రాజెక్టులపై క్లారిటీ ఇచ్చిన మరుసటి రోజే జగన్ ప్రెస్ మీట్ పెట్టాలని నిర్ణయించడం గమనార్హం. అలాగే, 2026లో జగన్ పాదయాత్ర (జగన్ 2.0) చేపట్టనున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, రేపటి సమావేశంలో దీనిపై ఏమైనా హింట్ ఇస్తారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.
Next Story

