ముఖ్యమంత్రే సూత్రదారి : వైఎస్ జగన్
x

ముఖ్యమంత్రే సూత్రదారి : వైఎస్ జగన్

ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందని, ప్రజాస్వామ్యాన్ని సీఎం చంద్రబాబు ఖూనీ చేశారని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు.


ఆంధ్రప్రదేశ్ వీధుల్లో ప్రజాస్వామ్యం పరిమళించాల్సింది పోయి.. ప్రభుత్వమే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, రాష్ట్రంలో ప్రస్తుతం సాగుతోంది ఒక పక్కా జంగిల్ రాజ్ అంటూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. బుధవారం గుంటూరు జనసందోహంతో హోరెత్తిపోగా, మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి చేరుకున్న జగన్, టీడీపీ మూకల దాడిలో అంబటి ఇంట్లో అక్కడ పగిలిన అద్దాలు, కాలిబూడిదైన కార్యాలయాన్ని చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే అరాచకానికి సూత్రధారిగా మారి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. దాడులకు గురైన అంబటి కుటుంబ సభ్యులకు కొండంత అండగా నిలబడతానని భరోసా ఇచ్చారు. అంబటి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపైన, సీఎం చంద్రబాబుపైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

రాజకీయ కక్షతో హత్యాయత్నాలు

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా జంగిల్ రాజ్ నడుస్తోందని జగన్ మండిపడ్డారు. అంబటి రాంబాబు, జోగి రమేష్, విడదల రజిని వంటి నేతలపై దాడులు చేయడం అత్యంత హేయం. ఇది కేవలం ఆస్తి నష్టం కాదు.. పక్కా ప్లాన్‌తో చేసిన హత్యాయత్నం. ఇంట్లో ఆడవాళ్లు, పిల్లలు ఉన్నారని కూడా చూడకుండా పెట్రోల్ బాంబులు, రాడ్లతో దాడులు చేయడం ఏ రకమైన రాజకీయం అని ఆయన నిలదీశారు.

పోలీసుల తీరుపై ఆగ్రహం.. చూడటమే మీ పనా

దాడులు జరుగుతున్నప్పుడు పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడంపై జగన్ నిప్పులు చెరిగారు. ఎస్పీ, డీజీపీ కార్యాలయాలకు కూతవేటు దూరంలోనే ఇంత విధ్వంసం జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? సీనియర్ నేత బొత్స సత్యనారాయణ స్వయంగా ఫోన్ చేసినా స్పందించకపోవడం దారుణం. గూండాలకు కొమ్ముకాస్తున్న పోలీసులు రేపు సమాధానం చెప్పుకోక తప్పదు అని హెచ్చరించారు. బాధితులపైనే కేసులు పెట్టే విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

సీబీఐ రిపోర్టు చూశాకైనా లెంపలేసుకోండి

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ అంశంపై చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని జగన్ చీల్చి చెండాడారు. సీఎం చంద్రబాబు అండ్ కో దేవుడంటే భయం లేకుండా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని ఎన్‌డీడీబీ ల్యాబ్స్, సీబీఐ రిపోర్టులు ఇప్పటికే స్పష్టం చేశాయి. తిరుమల ప్రతిష్టను దెబ్బతీసినందుకు చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌లు లెంపలేసుకోవాలి. అబద్ధపు ఫ్లెక్సీలతో ప్రజలను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారు? అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు.

మీ వెనుక నేనున్నా.. భయపడొద్దు

దాడులతో వణికిపోయిన అంబటి రాంబాబు కుటుంబ సభ్యులకు జగన్ ధైర్యం చెప్పారు. పార్టీ కార్యకర్తలకు, నేతలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఎన్ని దాడులు చేసినా మా గొంతు నొక్కలేరు. ఈ అరాచక పాలనపై పోరాటం ఆపే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశారు. జగన్ పర్యటనతో గుంటూరు పరిసర ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ కేడర్‌లో కొత్త ఉత్సాహం నెలకొంది.

Read More
Next Story