
'చంద్రబాబును సీఎంగానే చూళ్లేకపోతున్నారు, ఇక ఉప ప్రధానిగానా?'
పవన్ కల్యాణ్, చంద్రబాబు ఒకరిని మరొకరు జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేసుకున్నారని జగన్ ఎద్దేవా
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. చంద్రబాబుది అసలు మనిషి పుటకేనా? అని ధ్వజమెత్తారు. చంద్రబాబును సీఎంగానే చూళ్లేకపోతున్నారని, ఇక ఉపప్రధానిగా ఏం చేస్తారని జగన్ ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సర్కారును తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబును ఉప ప్రధానిగా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు జగన్ సమాధానమిస్తూ.. ఆయన్ను (చంద్రబాబు) ముఖ్యమంత్రిగానే చూళ్లేకపోతున్నారు, ఇక ఉపప్రధానిగానా అని ఎద్దేవా చేశారు.
ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో పవన్ కల్యాణ్, చంద్రబాబు ఒకరిని మరొకరు జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై అసెంబ్లీ ప్రస్తావన ఏదీ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం.. ఇటు విద్యార్థులను, అటు రైతులను మోసం చేస్తోందన్నారు.
వైఎస్ జగన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..
‘ఏపీలో 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలకు ఒరిగింది సున్నా. అసెంబ్లీ సమావేశాల్లో తప్పులు లెక్కలు, సెల్ప్ డబ్బాలే. చంద్రబాబు తన కుమారుడికి జాకీలు వేసుకోవడమే సరిపోయింది. లోకేష్.. చంద్రబాబు కోసం జాకీలు వేశారు. చంద్రబాబు, లోకేష్ కోసం పవన్ కల్యాణ్ జాకీలు లేపే ప్రయత్నం చేశారు. అంతేకానీ, ప్రజలకు చేసిందేమీ లేదు. మీరు ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో ప్రస్తావనే లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ప్రతీ నిరుద్యోగికి రూ.1.08 లక్షలు బకాయి పడ్డారు. నిరుద్యోగ భృతి అడుగుతుంటే సమాధానం లేదు. 18 ఏళ్లు నిండిన 60 ఏళ్ల లోపు మహిళలకు ఆడబిడ్డ నిధి కింద రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చారు. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నెలకు 4000 పెన్షన్ ఇస్తామన్నారు.. హామీ అమలు చేశారా?.
పెన్షన్లలో కోత ఎందుకు పెట్టారు?
60 ఏళ్ల లోపు మహిళలకు మా ప్రభుత్వ హయాంలో 66,34,372 మందికి పెన్షన్లు ఇచ్చాం. కూటమి ప్రభుత్వంలో 2026 ఫిబ్రవరి నాటికి 60,96,108 మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చారు. ఒక్క నెలలోనే 25వేల పెన్షన్లు కట్ చేశారు. కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు. పెన్షన్ల కింద బడ్జెట్‌లో పెట్టాల్సింది రూ.31,554 కోట్లు అయితే బడ్జెట్ కేటాయించింది రూ.27,719 కోట్లు మాత్రమే. భవిష్యత్‌లో ఇంకా పెన్షన్లు కట్ చేసే అవకాశం ఉంది. పెన్షన్లపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సమాధానం లేదు. మా ప్రభుత్వంలో యూడీఐఎస్‌సీ ప్రకారం 87,41,885 మందికి అమ్మఒడి ఇచ్చాం. కానీ, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తల్లికి వందనం పేరుతో 20 లక్షల మంది పిల్లలను తొలగించారు. తల్లికి వందనం కింద ఎగ్గొట్టిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు?. ఏ ఒక్కరికి రూ.15000 ఇవ్వలేదు.
ఉచిత బస్సు హామీని కూడా పూర్తిగా నెరవేర్చలేకపోయారు. షరతులు పెట్టారు. ప్రతీ మహిళకు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. తొలి ఏడాది ఒక సిలిండర్ ఇచ్చి.. మిగతా రెండు ఎగ్గొట్టారు. అన్నదాత సుఖీభవ పేరుతో రైతులను మోసం చేశారు. రెండేళ్లలో ప్రతీ రైతుకు రూ.40వేలకు గాను పదివేలే ఇచ్చారు. అన్నదాత సుఖీభవ నుంచి 7 లక్షల మంది రైతులను తొలగించారు. కౌలు రైతుల ప్రస్తావనే లేదు. ఉచిత పంటల బీమాను చంద్రబాబు రద్దు చేశారని వైఎస్ జగన్ అన్నారు.
Next Story

