
‘షర్ట్ లేకుండా’ నిరసన: యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి అరెస్ట్
నాలుగు రోజుల పోలీస్ కస్టడీని అప్పగించింది కోర్టు..
రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో చొక్కా తీసేసి నిరసన తెలిపిన ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 24న ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నేరం రుజువయితే మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. చిబ్‌ను నాలుగు రోజుల పోలీస్ కస్టడీని అప్పగించింది కోర్టు.
AI సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ సభ్యులు చొక్కాలు తొలగించి ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇది సాధారణ నిరసన మాత్రమేనని, ఎలాంటి అల్లర్లు సృష్టించ లేదని చిబ్ తరఫు న్యాయవాది వాదించారు. కస్టడీ అవసరం లేదని న్యాయమూర్తిని కోరారు. ఇప్పటికే ఈ ఘటనలో ఏడుగురిని అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ముగ్గురు, ఉత్తరప్రదేశ్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రితిక్ కూడా అరెస్టైన వారిలో ఉన్నారు. కాగా చిబ్ అరెస్ట్‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన ప్రతి భారతీయుడి హక్కు అని పేర్కొంది. కాగా బీజేపీ ఈ చర్య దేశ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నమని విమర్శించింది.

