
’మీ భూమి... మీ హక్కు‘
ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.
మీ భూమి-మీ హక్కు.. ఇదీ రైతులకు, భూ యజమానులకు ప్రభుత్వం ఇచ్చే భరోసా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రైతులకు వివాదాల్లేని క్లీన్ డాక్యుమెంట్లు ఇచ్చే దిశగా ప్రభుత్వం పని చేస్తోందని... ఆ దిశగానే భూముల రీ-సర్వే చేపడుతున్నామని సీఎం వెల్లడించారు. మండపేట నియోజకవర్గం, రాయవరంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు శుక్రవారం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన చంద్రబాబుకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా రాయవరంలోని వ్యవసాయ క్షేత్రంలో రైతులతో సీఎం ముఖాముఖి మాట్లాడారు. క్యూఆర్ కోడ్, విశిష్ట సంఖ్య ఉన్న, మీ భూమి..మీ హక్కు పేరిటి రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని స్వయంగా పరిశీలించారు. క్యూఆర్ కోడ్ ద్వారా తక్షణం భూమి వివరాలు తెలుసుకునేలా పట్టాదారు పాస్ పుస్తకాలను రెవెన్యూ శాఖ ముద్రించిందని రైతులకు సీఎం వివరించారు.
రైతులు, భూ యజమానుల ఆస్తులకు భద్రత కల్పించేలా కొత్త టెక్నాలజీతో ట్యాంపరింగ్ చేసేందుకు వీళ్ళేకుండా పట్టాదారు పాస్ పుస్తకం తయారు చేసినట్టు చెప్పారు. రీసర్వే పూర్తైన 6688 గ్రామాల్లోని భూములకు సంబంధించి 22.33 లక్షల పాస్ పుస్తకాలు ముద్రించగా... ప్రస్తుతం వాటిని పంపిణీ చేస్తున్నట్టు రైతులతో సీఎం చెప్పారు. రైతులు, భూ యజమానులకు తప్పుల్లేని కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేసేలా అధికారులు, ప్రజాప్రతినిధులు శ్రద్ధ పెట్టాలని సీఎం సూచించారు. అనంతరం మీ భూమి- మీ హక్కు ప్రజావేదిక నుంచి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ...”పూర్వీకుల నుంచి సంక్రమించిన, స్వార్జితమైన భూమితో రైతులకు ఓ అనుబంధం ఉంది. కరోనా సమయంలో అంతా సెలవు తీసుకున్నారు. కానీ అందరికీ అన్నం పెట్టే రైతన్నకు సెలవే లేదు. అలాంటి రైతులకు చెందిన భూ పత్రాల విషయంలో గత పాలకులు పాస్ పుస్తకాల జారీకి సంబంధించి అక్రమాలు చేశారు.
గత పాలకుల్ని, ప్రభుత్వాన్ని హెచ్చరించాను. కానీ వారి అహంకారం నెత్తికెక్కి మీ ఆస్తులపై ఆయన ఫోటో వేసుకున్నారు. పూర్వీకులు ఆర్జించిన భూమిపై నాటి పాలకుని ఫోటో ఏమిటి.? సరిహద్దు రాళ్లపై గత పాలకుని ముద్రలేమిటి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటూ ఓ చట్టాన్ని తెచ్చి వాళ్లకు నచ్చిన వాళ్ల ఆధీనంలోకి తీసుకువచ్చేలా చేశారు. దీనిని గతంలోనే తీవ్రంగా వ్యతిరేకించాను. మీ భూముల వివరాలన్నీ గత పాలకుల అనుచరులు అమెరికాలో పెట్టుకున్నారు. కూటమి అధికారంలోకి రాకపోతే ప్రజల భూములన్నీ కాజేసేందుకు కుట్రపన్నారు. నిన్నా మొన్నా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు చాలా ప్రమాదకరమైన ఆలోచన చేశారు. రైతుల భుంలపై వేరేవాళ్ల ఫోటోలెందుకని ప్రశ్నించాను. ప్రభుత్వంలోకి వచ్చాం... రాజముద్ర వేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చాం.
గత పాలకులు తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తూ రెండో సంతకమే పెట్టాను. భూమి అనేది రైతుకు ఆస్తి మాత్రమే కాదు ఓ విశ్వాసం, కుటుంబంతో కలిసిపోయిన సెంటిమెంట్. గతంలో భూమి ఇవ్వకపోతే దానిని 22 ఏ రికార్డుల్లో పెట్టేశారు. అందుకే ప్రజలు ఆలోచించి సమయం వచ్చినప్పుడు చూద్దామని బ్యాలెట్ ద్వారా తగిన బుద్ధి చెప్పారు. ఏపీ ప్రాంతంలో ఉన్న రికార్డులు అన్నీ పక్కాగా ఉన్నాయి. తెలంగాణా ప్రాంతంలో ఎక్కువ భూవివాదాలే. మున్సబు, కరణాల వ్యవస్థను రద్దు చేసి ఎన్టీఆర్ రైతులకు, భూ యజమానులకు మేలు చేశారు. ఈ వ్యవస్థ రద్దైనప్పుడు తెలంగాణాలో పండుగ చేసుకున్నారు. గత పాలకుల తీరు కారణంగా ఎక్కడకు వెళ్లినా భూ వివాదాలకు సంబంధించిన పిటిషన్లే వస్తున్నాయి. ఈ వివాదాలను పరిష్కరించేందుకు సంకల్పించి మీ వద్దకు వచ్చాను.”అని సీఎం చెప్పారు.

