
’చట్టం తెచ్చింది మీరు.. రద్దు చేసింది చంద్రబాబు‘
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ప్రధాని మోదీకి వైసీపీ మాజీ ధర్మాన ప్రసాదరావు లేఖ రాశారు.
రాష్ట్రంలో రాజకీయ తుఫానుగా మారి.. గత ఎన్నికల ఫలితాలను కూడా ప్రభావితం చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వివాదం ఇప్పుడు దేశ రాజధాని గడప తొక్కింది. కూటమి ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు నేరుగా ప్రధాని నరేంద్ర మోదీకే ఫిర్యాదు చేశారు. చట్టం తెచ్చింది మీరు..అమలు చేసింది మేము.. కానీ చంద్రబాబు రద్దు చేశారు అంటూ ఆయన రాసిన లేఖ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. భూ రికార్డుల ఆధునీకరణలో కేంద్రం దార్శనికతను ప్రస్తుతిస్తూనే, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక రాజకీయ విద్వేషం ఉందంటూ ధర్మాన చేసిన ఆరోపణలు ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం జగన్ ప్రభుత్వం స్వయంగా తయారు చేసింది కాదని, కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారా రూపొందించిన ముసాయిదా అని ధర్మాన తన లేఖలో స్పష్టం చేశారు. భూ రికార్డులను ఆధునీకరించడానికి, భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించడానికి కేంద్రం ఈ మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలకు పంపించిందని ఆయన గుర్తు చేశారు.
జగన్ ప్రభుత్వం చేసింది కేవలం అమలు మాత్రమే
ప్రధాని మోదీ తీసుకువచ్చిన గ్రామాల సర్వే (SVAMITVA) , డ్రోన్ల ద్వారా భూముల కొలత వంటి చారిత్రాత్మక నిర్ణయాలను వైఎస్ జగన్ ప్రభుత్వం తూచా తప్పకుండా పాటించిందని ధర్మాన పేర్కొన్నారు. 3.20 లక్షల గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి చేసి, జాతీయ స్థాయి భూ రికార్డుల ఆధునీకరణలో ఏపీ ముందువరుసలో నిలిచిందని ఆయన వివరించారు.
చంద్రబాబు సర్కార్ నిర్ణయంపై ధర్మాన ధ్వజం
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు అని ఆయన అభివర్ణించారు. కేవలం రాజకీయ విద్వేషంతోనే ఈ చారిత్రాత్మక చట్టాన్ని అడ్డుకున్నారని ఆయన విమర్శించారు.
రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డుతగిలారు..
కేంద్ర ప్రభుత్వం అత్యంత దార్శనికతతో, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ఈ ముసాయిదా చట్టాన్ని రూపొందించిందని ధర్మాన గుర్తుచేశారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం దీనిని ఒక రాజకీయ అస్త్రంగా మార్చుకుని, ప్రజల్లో లేనిపోని భయాలను సృష్టించి అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తెచ్చిన సంస్కరణలను కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసమే చంద్రబాబు సర్కార్ వ్యతిరేకించిందని ఆయన దుయ్యబట్టారు.
వివాద రహిత వాతావరణానికి విఘాతం..
భూముల విషయంలో సామాన్యులకు భద్రత కల్పించి, కోర్టుల చుట్టూ తిరిగే బాధలు లేకుండా చేయాలనేదే ఈ చట్టం ప్రధాన ఉద్దేశమని ధర్మాన వివరించారు. ప్రజల మధ్య భూ వివాదాలు లేని ఒక సామరస్య పూర్వక వాతావరణం ఉండకూడదనే కుట్రతోనే ప్రభుత్వం ఈ రద్దుకు పాల్పడిందని ఆయన విమర్శించారు. ఆధునిక వ్యవస్థలను అడ్డుకోవడం ద్వారా ప్రజలను మళ్ళీ పాత కాలపు రికార్డుల గందరగోళంలోకి నెట్టేస్తున్నారని ధర్మాన తన లేఖలో ఘాటుగా విమర్శించారు.
దేశవ్యాప్త అమలుకు ధర్మాన పిలుపు
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ ముసాయిదా చట్టం కేవలం ఒక్క రాష్ట్రానికే పరిమితం కాకూడదని, దీనిని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయాల్సిన అవసరం ఉందని ధర్మాన ప్రసాదరావు ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. భూ రికార్డుల ఆధునీకరణ ద్వారానే దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని, పెట్టుబడులు పెరుగుతాయని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఈ సంస్కరణలు జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలని ఆయన నొక్కి చెప్పారు.
ముఖ్యమంత్రులతో సమీక్షించాలని విజ్ఞప్తి
ఈ చట్టం ప్రాముఖ్యతను వివరించడానికి, అమలులో ఎదురయ్యే సవాళ్లను చర్చించడానికి ప్రధాని చొరవ తీసుకోవాలని ధర్మాన కోరారు. వెంటనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, ఈ చట్టం అమలుపై సమీక్ష నిర్వహించండి. ప్రజల భూములకు పూర్తి భద్రత కల్పించే ఈ వినూత్న సంస్కరణలు దేశం మొత్తం విస్తరించేలా చూడండి అని ఆయన ప్రధానిని అభ్యర్థించారు. అంతర్జాతీయ స్థాయి రాజనీతిజ్ఞునిగా ఎదిగిన ప్రధానికి, ఇలాంటి మేలైన చట్టాలను అమలు చేయడమే నిజమైన సహకారం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

