అమరావతి బిల్లును వ్యతిరేకించిన వైసీపీ,  లోక్ సభ నుంచి వాకౌట్
x

అమరావతి బిల్లును వ్యతిరేకించిన వైసీపీ, లోక్ సభ నుంచి వాకౌట్

ఈ బిల్లును ప్రస్తుత ఫార్మాట్ లో అంగీకరించలేమని ఎంపీ మిధున్ రెడ్డి చెప్పారు


లోక్‌సభలో ఇవాళ ప్రవేశపెట్టిన రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లును వైసీపీ ఎంపీలు వ్యతిరేకించారు. ఈ బిల్లును ప్రస్తుత ఫార్మాట్ లో అంగీకరించలేమని చెప్పారు. పార్టీ తరఫున ఎంపీ మిధున్ రెడ్డి మాట్లాడుతూ అమరావతిలో జరుగుతున్న దోపిడీని వివరించారు. ఈసందర్భంగా ఆయన బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ను ఉద్దేశించి చేసిన ఓ కామెంటు తీవ్ర దుమారాన్ని రేపింది. రికార్డుల నుంచి ఆ పదాన్ని తొలగిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. మిధున్ రెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ అమరావతిలో జరుగుతున్నదంతా మోసమేనని చెప్పారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ లోక్ సభ నుంచి వాకౌట్ చేశారు. రాజధాని ఢిల్లీలో కూడా లేని విధంగా అమరావతిలో నిర్మాణాలకు 8వేల రూపాయలు అదనంగా చెల్లిస్తున్నారని ఆరోపించారు. అమరావతి రైతులకు ప్లాట్లు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు మాట్లాడిన బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ వైఎస్ జగన్ ను ఊసరవెల్లి అని విమర్శించారు.

ఆంధ్రుల కలల రాజధాని అమరావతి(Amaravati) అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. అమరావతికి చట్టబద్ధత బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన అనంతరం స్పీకర్‌ ఓం బిర్లా చర్చకు అనుమతించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడారు.
‘‘రాజధాని అమరావతి బిడ్డగా ఈ సభలో ప్రసంగించడం నా అదృష్టం. అమరావతి కోసం భూములు త్యాగం చేసిన రైతులకు అభినందనలు. ఏకైక రాజధానిగా అమరావతిని ఏర్పాటుచేయాలి. రాజధాని ఉద్యమంలో పోరాడిన మహిళలకు జేజేలు. రూపాయి ఖర్చు లేకుండా వేల ఎకరాల భూమిని సమీకరించిన వ్యక్తి సీఎం చంద్రబాబు. ఆయనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకమే అమరావతి. వికేంద్రీకరణ పేరుతో అప్పటి సీఎం జగన్‌ మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు. 29 వేల మంది రైతులకు జరిగిన అన్యాయం, అవమానంపై చర్చించాలి. ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు’ పేరుతో రాజధాని ప్రాంత మహిళలు యాత్ర చేపడితే వేధించారు. మహిళా రైతులను మేకులు ఏర్పాటుచేసిన లాఠీలతో జగన్‌ కొట్టించారు. వారి కన్నీళ్లే ఈ చట్టానికి పునాదిగా మారాయి. జగన్‌ అణిచివేత వల్లే అమరావతి ఒక ఉద్యమంలా మారి దేశాన్ని ఆకర్షించింది.
రాష్ట్రాభివృద్ధిలో రాజధాని కీలక పాత్ర పోషిస్తుంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ నగరాలు ఆయా రాష్ట్రాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఏపీ ఆర్థిక అభివృద్ధిలో అమరావతి కీలకంగా మారాలి. రాష్ట్ర రాజధాని నిర్ణయం, మార్పు కేంద్రం పరిధిలో ఉంటుందని 2022లో సుప్రీంకోర్టు చెప్పింది. రాష్ట్రంలో రాజకీయ అస్థిరత్వం ఉంటే పెట్టుబడులు రావు. ఏపీ రాజధానిగా అమరావతి శాశ్వతంగా ఉంటుందా? అన్న అనుమానానికి ఈ చట్టసవరణ ముగింపు పలుకుతుంది. అమరావతి నిర్మాణం చంద్రబాబు ఆశయం. కూటమి ఐక్యతకు కంకణబద్ధుడైన వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌. రాజధానికి చట్టబద్ధత ఇచ్చేందుకు అంగీకరించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు’’ అని పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు.
Read More
Next Story