
అంబటి రాంబాబుకు బెయిల్, మరో కేసు లేకపోతే రేపు విడుదల
మెడికల్ కాలేజీల ప్రైవేటుపరం చేయవద్దంటూ ర్యాలీ నిర్వహించిన కేసు
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు మరో కేసులోనూ బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యమంత్రిని దూషించిన కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సమయంలో ఆయనకు బెయిల్ మంజూరైనా నవంబర్ 12న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయొద్దంటూ నిర్వహించిన ర్యాలీ సందర్భంగా సీఐ విధులను అడ్డుకున్నారన్న ఆరోపణలతో ఆయనపై మరో కేసు నమోదు అయింది.
ఈ కేసులో పట్టాభిపురం పోలీసులు పిటి వారెంట్‌పై మూడు రోజుల క్రితం అంబటి రాంబాబును కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న అనంతరం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అలాగే పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను కూడా కోర్టు డిస్మిస్ చేసింది.
ఇప్పటికే సీఎంను దూషించిన కేసులో బెయిల్ పొందిన అంబటి రాంబాబు, తాజా కేసులోనూ ఊరట పొందడంతో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది. రేపటిలోగా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీ నేపథ్యంలో నమోదు చేసిన కేసుపై వైఎస్సార్‌సీపీ నేతలు రాజకీయ వేధింపుల ఆరోపణలు చేస్తున్నారు. అయితే పోలీసులు విధులను అడ్డుకోవడం జరిగిందని కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. తాజా బెయిల్ ఉత్తర్వులతో ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

