ఇదేం ప్రాంక్ వీడియోనే తల్లీ.. తండ్రినే మూటగట్టావా?
x
తండ్రిని మూటగట్టి పార్శిల్ చేయబోయిన యువతి

ఇదేం ప్రాంక్ వీడియోనే తల్లీ.. తండ్రినే మూటగట్టావా?

బెంగళూరులో కలకలం రేపిన 'మూట' ప్రాంక్.. పోలీసుల ఎంట్రీతో తండ్రిని వదిలేసి పరారీ


పండుగ వేళ ప్రయాణ కష్టాలపై గళం విప్పాలనుకున్న ఆ యువతి ఆలోచన మంచిదే కావచ్చు కానీ, ఆమె ఎంచుకున్న మార్గం మాత్రం తీవ్ర వివాదాస్పదమైంది. బెంగళూరులో జరిగిన ఈ "పిచ్చి ప్రాంక్" వివరాలు ఇలా ఉన్నాయి:
అసలేం జరిగింది?
మంగళవారం సాయంత్రం బెంగళూరులోని వయ్యాలికావల్ ప్రాంతంలో ఉన్న ఒక కొరియర్ కార్యాలయానికి ఓ యువతి, నలుగురు స్నేహితులు కలిపి ఒక పెద్ద మూటను తీసుకువచ్చారు.

దాన్ని పార్సిల్ చేయాలని సిబ్బందిని కోరారు. అయితే, ఆ మూటలో ఏదో కదలిక ఉండటాన్ని గమనించిన సిబ్బంది అనుమానించారు. సిబ్బంది నిలదీయడంతో భయపడిన ఆ ఐదుగురు యువకులు అక్కడి నుంచి పరారయ్యారు.
మూట విప్పితే షాక్!
లోపల ఏదో ప్రమాదకరమైన వస్తువు ఉందేమో అని భయపడిన కొరియర్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఆ మూటను విప్పి చూడగా, అందులో ఒక వృద్ధుడు ఉండటంతో అందరూ అవాక్కయ్యారు. ఆయన ఎవరో కాదు, అక్కడి నుంచి పారిపోయిన ఆ యువతి తండ్రి!
వింత కారణం?
పోలీసులు ఆ వృద్ధుడిని, ఆ తర్వాత పారిపోయిన యువతిని పిలిపించి విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా ప్రైవేట్ బస్సుల్లో టికెట్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్యులు ఆ ధరలు భరించలేకపోతున్నారు.
"టికెట్ ధరలు భరించలేక, టికెట్లు దొరకక.. ప్రజలు ఇలా మూటల్లో పడి కొరియర్‌లో వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది" అని ప్రపంచానికి చాటిచెప్పడమే తమ ఉద్దేశమని ఆ యువతి చెప్పుకొచ్చింది.
ప్రాంక్ వీడియో: ఈ మొత్తం తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని వారు ప్లాన్ చేశారు. అది కాస్తా బెడిసికొట్టింది. కేవలం ఒక వీడియో కోసం సొంత తండ్రిని మూటగట్టి కొరియర్ ఆఫీసుకు తీసుకురావడంపై పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాంటి పనుల వల్ల కొరియర్ సిబ్బంది భయాందోళనకు గురవుతారని, అనవసరమైన గందరగోళం ఏర్పడుతుందని హెచ్చరించారు.
అమానవీయం కదా..
ఒక వృద్ధుడిని అలా మూట కట్టి ఆయన ఆరోగ్యానికి, ప్రాణానికి కూడా ముప్పు కలిగించవచ్చని మందలించారు. మొదటి తప్పుగా భావించి, మరోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయవద్దని హెచ్చరించి వారిని పంపించివేశారు. అనంతరం, తాము చేసిన తప్పును ఇంకెవరూ చేయవద్దని కోరుతూ ఆ యువతి బృందం ఒక వీడియోను విడుదల చేసింది.
సామాజిక సమస్యలపై స్పందించడం మంచిదే, కానీ అది ఇతరులను ఇబ్బంది పెట్టేలా లేదా చట్ట విరుద్ధంగా ఉండకూడదు. ముఖ్యంగా ప్రాంక్ వీడియోల పేరుతో ప్రాణాలతో చెలగాటం ఆడటం ఏమాత్రం సమర్థనీయం కాదు.
Read More
Next Story