తాళం వేసితిమి.. గొళ్లెం మరచితిమి.. అన్నట్టుగా ఉంది పాలకుల తీరు. భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తి చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వ పెద్దలు అక్కడకు వెళ్లేందుకు రోడ్డు మార్గాలను మాత్రం పట్టించుకోవడం మానేశారు. మరో నాలుగైదు నెలల్లో అందుబాటులోకి రానున్న తరుణంలో ఆ ఎయిర్‌పోర్టుకు సకాలంలో చేరుకునే రోడ్లు, ఫ్లైవోవర్లను విస్మరించడంతో విమాన ప్రయాణికులు భారీగా చేతి చమురు వదిలించుకోవడంతో పాటు గంటల కొద్దీ సమయం వృధా అయ్యే పరిస్థితి తలెత్తనుంది. ఇప్పుడు కొత్త ఎయిర్‌పోర్టుకు వెళ్లడానికి జాతీయ రహదారి మాత్రమే ఉంది. దీంతో మరికొద్ది నెలల్లోనే వైజాగ్ ఎయిర్‌పోర్టు నుంచి పౌరవిమానాలు బంద్ కానున్న నేపథ్యంలో విమాన ప్రయాణికుల్లో అలజడి రేగుతోంది. భోగాపురం విమానాశ్రయానికి వెళ్లడానికి ఎదురయ్యే ఇబ్బందులపైనే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.
భోగాపురం ఎయిర్‌పోర్టు లోపలి భాగం
వైజాగ్ ఎయిర్‌పోర్టు మరికొన్నాళ్ల వరకే..
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును మే/జూన్ నెలలో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విమానాశ్రయాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చాక విశాఖపట్నం ఎయిర్‌పోర్టు నుంచి ప్రయాణికుల విమానాలను అనుమతించరు. ఈ విమానాశ్రయం (ఐఎన్‌ఎస్ డేగా) తూర్పు నావికాదళం అధీనంలో ఉన్నందున భవిష్యత్తులో నేవీ అవసరాలకే పరిమితం చేస్తారు. ప్రస్తుత సమాచారం ప్రకారం వచ్చే సెప్టెంబర్ వరకే వైజాగ్ ఎయిర్‌పోర్టు నుంచి పౌర విమానాలకు అనుమతిస్తారు. ఆ తర్వాత విశాఖ నుంచి విమాన ప్రయాణికులు భోగాపురం ఎయిర్‌పోర్టుకే వెళ్లాల్సి ఉంటుంది. ఇటీవల జరిగిన విశాఖపట్నం విమానాశ్రయ సలహా కమిటీ సమావేశంలో నేవీ అధికారులు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
విశాఖ హనుమంతవాక జంక్షన్లో నిత్యం ట్రాఫిక్ రద్దీ ఇలా
కాగితాలపైనే రోడ్లు.. ఫ్లైవోవర్లు..
భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు మొదలై ఏడేళ్లు దాటింది. విశాఖ నుంచి ఆ విమానాశ్రయానికి రాకపోకలు సాగించడానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రోడ్లు, ఫ్లైఓవర్లను ప్రతిపాదించింది. గాజువాక నుంచి మధురవాడ వరకు జాతీయ రహదారిపై 12 ఫ్లైవోవర్లు, మరో 15 మాస్టర్ ప్లాన్ రోడ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటి నిర్మాణానికి నిధుల్లేవంటూ ఒక్క పని కూడా మొదలు పెట్టలేదు. అంతేకాదు.. విశాఖ తీరం వెంబడి బీచ్ కారిడార్ ఏర్పాటు ప్రతిపాదన కూడా కార్యరూపం దాల్చలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పోయి కూటమి సర్కారు వచ్చాక కూడా వీటిపై అడుగు ముందుకు పడలేదు. వీటికి రూ.వందల కోట్లు అవసరం. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్య గోచరంగా ఉండడంతో అతీగతీ లేకుండా పోయింది. ఇక హైవేపై ఫ్లైవోవర్ల నిర్మాణం ప్రతిపాదనను కూటమి ప్రభుత్వం అటకెక్కించేసిందన్న ప్రచారం ఉంది.
ఇప్పుడు మొదలెడితే పూర్తికి ఎన్నేళ్లో..?
ప్రతిపాదిత మాస్టర్‌ప్లాన్ రోడ్లు, బీచ్ కారిడార్ నిర్మాణాన్ని ఇప్పటికిప్పుడు మొదలు పెడితే పూర్తి కావడానికి కనీసం నాలుగైదేళ్లు పడుతుందని అంచనా వేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్లకు ఇంకా భూసేకరణే జరగలేదు. బీచ్ కారిడార్ అందుబాటులోకి వస్తే విశాఖ నుంచి భోగాపురానికి గంటలో చేరుకోవచ్చు. కానీ ఈ బీచ్ కారిడార్ పనులు ఎప్పుడు మొదలవుతాయో పెరుమాళ్లకే ఎరుక!
50 కి.మీల దూరం.. 2 గంటల సమయం.. భోగాపురం ఎయిర్‌పోర్టుకు విశాఖ నుంచి సుమారు 50 కి.మీలు, గాజువాక నుంచి 65, అనకాపల్లి నుంచి 90 కి.మీల దూరం ఉంది. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్– భోగాపురంల మధ్య 16, గాజువాక నుంచి 35, అనకాపల్లి నుంచి 40 వరకు సిగ్నల్స్ ఉన్నాయి. వీటన్నిటినీ దాటుకుని వాహనాలు ముందుకు వెళ్లడం పెద్ద సాహసమే అవుతుంది. ఇప్పటికే విశాఖలో ట్రాఫిక్ పద్మవ్యూహం ప్రయాణికుల సహనానికి పరీక్షగా మారింది. ప్రస్తుతం విశాఖ నుంచి భోగాపురం వెళ్లాలంటే రెండు గంటలు, గాజువాక నుంచి మూడు గంటలు, అనకాపల్లి నుంచి నాలుగ్గంటల సమయం పడుతోంది. సాధారణంగా విమానం బయల్దేరడానికి కనీసం గంటన్నర ముందుగా ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలి. అంటే విజయవాడ, హైదరాబాద్‌లకు విమానంలో గంట ప్రయాణానికి నాలుగు గంటలు ముందే బయల్దేరడం తప్పనిసరి అవుతుంది.
దూరమే కాదు.. భారం కూడా..
ప్రస్తుతం ట్రావెల్స్ నిర్వాహకులు భోగాపురం ఎయిర్‌పోర్టుకు డ్రాపింగ్ చార్జీ ఫోర్ సీటర్ కారుకు రూ.2000–2500, సెవెన్ సీటర్ (ఇన్నోవా)కు రూ. 3500–4000 వరకు వసూలు చేస్తున్నారు. విశాఖపట్నం నుంచి విజయవాడ, హైదరాబాద్ నగరాలకు విమాన టిక్కెట్ రూ.4000–5000 వరకు ఉండగా భోగాపురం విమానాశ్రయానికి రానూపోనూ రూ.5–7 వేలు ట్యాక్సీలకే వెచ్చించాల్సి వస్తుంది. ఈ లెక్కన విమాన ప్రయాణికులకు ఫ్లైట్ టిక్కెట్‌కంటే భోగాపురం వెళ్లి రావడానికే ఎక్కువ ఖర్చవుతుంది. పైగా సమయమూ వృధా అవుతుంది. ’ఒక వైపు భోగాపురం ఎయిర్‌పోర్టుకు వెళ్తే రెండో వైపు ఖాళీగా రావలసి వస్తుంది. అందువల్ల వైజాగ్ నుంచి భోగాపురానికి రూ.2500 తీసుకుంటేనే గాని గిట్టుబాటు కాదు’ అని సంతోష్‌కుమార్ అనే ట్యాక్సీ డ్రైవర్ ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధికి చెప్పాడు.
పెరుగుతున్న వాహనాలు.. ప్రయాణికులు..
భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు మొదలయ్యాక ఏడు లక్షల వాహనాలు పెరిగాయి. రోజుకు పది వేల కార్లు భోగాపురం ఎయిర్‌పోర్టు వైపు ప్రయాణిస్తున్నాయి. ప్రతి నెలా ఎనిమిది వేల కొత్త వాహనాలు రిజిస్టర్ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరగనుంది. మరోౖÐð పు ఉమ్మడి విశాఖ జిల్లాలోని సెజ్‌ల్లో పరిశ్రమలు, టెక్స్‌టైల్స్ పార్కులు, సుమారు 150 ఫార్మా కంపెనీలు, వీఎస్‌ఈజెడ్, స్టీల్‌ప్లాంట్, హెచ్‌పీసీఎల్, ఈస్ట్రన్ నేవల్ కమాండ్, షిప్‌యార్డు వంటి వాటిలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులున్నారు. వీటిలోని ఉన్నతోద్యోగులు, వ్యాపారవేత్తలు విమానాల్లో ప్రయాణిస్తుంటారు. విశాఖలో గూగుల్, ఐటీ సంస్థలు వస్తున్నాయి. కొత్తగా నక్కపల్లిలో ఆర్సెలార్ మిత్తల్, బల్క్ డ్రగ్ పార్కులు కూడా ఏర్పాటవుతున్నాయి. ఇవి కూడా అందుబాటులోకి వస్తే వాహనాలు, విమాన ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగనుంది. ఫలితంగా విశాఖలో ట్రాఫిక్ సమస్య మున్ముందు మరింత జటిలం కానుంది.
గోవా మాదిరిగా రెండు ఎయిర్‌పోర్టులు..
విశాఖ విమానాశ్రయం ద్వారా ఏడాదికి సగటున 30 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రముఖ పర్యాటక ప్రాంతం గోవాలో రెండు విమానాశ్రయాలున్నాయి. గోవా ఎకానమీ 16 బిలియన్ డాలర్లు. విశాఖ ఎకానమీ 48 బిలియన్ డాలర్లు. అంటే గోవాకంటే వైజాగ్ ఎకానమీ మూడు రెట్లు అధికం. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని గోవా మాదిరిగా భోగాపురంతో పాటు వైజాగ్ ఎయిర్‌పోర్టును కొనసాగించాలన్న డిమాండ్ విమాన ప్రయాణికులు, వ్యాపారవేత్తల నుంచి ఉంది. లేనిపక్షంలో భోగాపురానికి పూర్తి స్థాయిలో కనెక్టివిటీ వచ్చే దాకా వైజాగ్ ఎయిర్‌పోర్టును కొనసాగించాలని కోరుతున్నారు.
ఏటీఏ వైస్ ప్రెసిడెంట్ ఒ.నరేష్‌కుమార్
వైజాగ్ ఎయిర్‌పోర్టును కొనసాగించాలి..
‘విశాఖకు సీఎం చంద్రబాబు ఎక్కువగా పెట్టుబడులు తెస్తున్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టును స్వాగతిస్తున్నాం. కానీ అక్కడకు వెళ్లేందుకు ఒక్క హైవే తప్ప మరో కనెక్టివిటీ లేదు. బీచ్æ కారిడార్.. 12 ఫ్లైఓర్ల నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలి. ఉమ్మడి విశాఖలో కొత్తగా ఐటీ కారిడార్, గూగుల్, కొత్త స్టీల్‌ప్లాంట్, బల్క్ డ్రగ్ పార్కు వంటివెన్నో వస్తున్నాయి. విశాఖకు కొత్తగా మరో లక్ష మంది ఐటీ ఉద్యోగులు వస్తున్నారు. అందువల్ల గోవా మాదిరిగా వైజాగ్ ఎయిర్‌పోర్టును కొనసాగించాలి. జీఎమ్మార్‌కు చెల్లించాల్సిన యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు (రూ.750) వైజాగ్ ఎయిర్‌పోర్టులోనూ వసూలు చేసుకోమంటున్నాం. దీంతో విమాన ప్రయాణికులకు సొమ్ముతో పాటు సమయం ఆదా అవుతుంది’ అని ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ (ఏటీఏ) వైస్ ప్రెసిడెంట్ ఒ.నరేష్‌కుమార్ ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి’కి చెప్పారు.
ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు
ఆరు వందేభారత్‌లు కావాలిః ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు
‘వైజాగ్ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఇన్నోవాలో రూ.4 వేలు, చిన్న కారులో రూ.2500 చార్జి వసూలు చేస్తామంటున్నారు. విశాఖ నుంచి ఏటా 30 లక్షల మంది విమాన ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వీరు భోగాపురం ట్యాక్సీల్లో వెళ్లడానికి చాలా ఖర్చవుతుంది. విశాఖ ఎయిర్‌పోర్టును డొమెస్టిక్‌గా కొనసాగించాలి. విశాఖ నుంచి విజయవాడ, హైదరాబాద్, తిరుపతి నగరాలకు కనీసం ఆరు వందేభారత్ రైళ్లు నడపాలి. విజయవాడకు నాలుగైదు గంటల్లో ట్రైన్‌లో వెళ్లాచ్చు. విమాన ప్రయాణికులు భోగాపురానికి రెండు గంటలు ముందుగా బయల్దేరాలి. మరో గంటన్నర ముందుగా ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలి. విమాన ప్రయాణం గంటతో కలుపుకుంటే రైల్లోనే తక్కువ సమయం, ఖర్చుతో విజయవాడ వెళ్లిపోవచ్చు. భోగాపురానికి కనెక్టివిటీ రోడ్లు పూర్తి కాకపోతే చాలా ఇబ్బంది అవుతుంది’ అని విశాఖ ఉత్తర (బీజేపీ) ఎమ్మెల్యే పెన్మెత్స విష్ణుకుమార్‌రాజు స్పష్టం చేశారు.
చార్టర్డ్ అకౌంటెంట్ ఆకుల చంద్రశేఖర్
టన్నెల్ మార్గంతో కనెక్టివిటీ మెరుగు..
విశాఖ నగరం నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు వెళ్లడానికి నర్సింహనగర్–అడవివరం టన్నెల్ మార్గం ఉత్తమం. ఈ టన్నెల మార్గం ఏర్పాటు చేసి శొంఠ్యాం వరకు వెళ్లేలా గతంలో ప్రతిపాదించారు. ఏవో కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే అక్కయ్యపాలెం నుంచి నేరుగా సింహాచలం ఐదు నిమిషాల్లోను, మరో 20 నిమిషాల్లో శొంఠ్యాం చేరుకోవచ్చు. శొంఠ్యాం నుంచి అనకాపల్లి–ఆనందపురం హైవేకి సర్వీసు రోడ్డు నుంచి కనెక్ట్ చేయాలి. దీనివల్ల రోజుకు 15 వేల వాహనాలకు పైగా నగరంలోని మద్దిలపాలెం, హనుమంతవాక మధురవాడ మీదుగా వెళ్లక్కర్లేదు. దీంతో రద్దీతో పాటు 8 కి.మీల దూరం తగ్గుతుంది. ప్రయాణికులకు ఇంధనం, సమయం ఆదా అవుతుంది. పర్యావరణం మెరుగుపడుతుంది. సరైన కనెక్టివిటీ లేకపోతే రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతుంది’ అని విశాఖలోని SARC– అసోసియేట్స్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆకుల చంద్రశేఖర్ ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధితో చెప్పారు.