
బాబుకు బాబే క్లీన్ చిట్ ఇచ్చుకుంటారా?: సతీష్ రెడ్డి
దమ్ముంటే రాయలసీమ నీటి పారుదల పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎం చంద్రబాబుకు సతీష్ రెడ్డి సవాల్ విసిరారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనపై ఉన్న అవినీతి కేసులకు తానే 'క్లీన్ చిట్' ఇచ్చుకోవడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో రూ.372 కోట్ల అవినీతికి సంబంధించి సీఐడీ వద్ద పక్కా ఆధారాలు ఉన్నప్పటికీ, సీఎం చంద్రబాబు ప్రభుత్వం కేసులను నీరుగార్చేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. 'దోషిగా ఉన్న వ్యక్తి.. దర్యాప్తు సంస్థలను శాసించడం విడ్డూరం' అని వ్యాఖ్యానించిన సతీష్ రెడ్డి, అటు రాయలసీమ ప్రాజెక్టుల విషయంలోనూ ప్రభుత్వం సాగిస్తున్న నిర్లక్ష్యంపై నిప్పులు చెరిగారు. ప్రాజెక్టులు నిరర్థకమంటూ ప్రచారం చేస్తున్న సీఎం చంద్రబాబు, దమ్ముంటే రాయలసీమ నీటి పారుదల పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు.
స్కిల్ కేసుపై న్యాయపోరాటం
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో రూ. 372 కోట్లు పక్కదారి పట్టినట్లు సీఐడీ వద్ద పక్కా సాక్ష్యాలు ఉన్నాయని ఎస్వీ సతీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక కేసులో ప్రధాన దోషిగా ఉన్న చంద్రబాబు నాయుడు, అధికారంలోకి రాగానే తన కేసుకు తానే క్లీన్ చిట్ ఇచ్చుకోవడం ప్రజాస్వామ్యంలో విడ్డూరమని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వంలో ఉన్నాం కదా అని అధికార బలాన్ని ఉపయోగించి కేసులను మాఫీ చేసుకోవడం ఏమాత్రం సబబు కాదన్నారు. చంద్రబాబు నిజంగా నిర్దోషి అయితే న్యాయపరంగా కేసును ఎదుర్కొని నిరూపించుకోవాలి తప్ప, ఇలా పక్కదారి పట్టించి నీరుగార్చడం అభ్యంతరకరమని హితవు పలికారు. ఈ అంశాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, దీనిపై వైఎస్సార్‌సీపీ తరపున గట్టిగా న్యాయ పోరాటం చేస్తామని సతీష్ రెడ్డి ప్రకటించారు.
రాయలసీమ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం - శ్వేతపత్రానికి సవాల్
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రభుత్వం సర్వనాశనం చేస్తోందని ఎస్వీ సతీష్ రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. సీమ ప్రాజెక్టులు నిరర్థకం అని ఒకవైపు ప్రచారం చేస్తూనే, మరోవైపు క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలించేందుకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ నేతలను ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటోందని ఆయన నిలదీశారు. రాయలసీమ ప్రాజెక్టుల కోసం రూ. 8 వేల కోట్లు ఖర్చు చేశామని చెబుతున్న సీఎం చంద్రబాబుకు దమ్ముంటే ఆ ఖర్చుల వివరాలపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. ముఖ్యంగా కేవలం రూ. 800 కోట్లు ఖర్చు చేస్తే ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేసే వెలుగొండ ప్రాజెక్టును కూడా ప్రభుత్వం పక్కన పెట్టిందని, దీన్ని బట్టే రాయలసీమ పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోందని ఆయన విమర్శించారు.

