ఆ ఐదు గ్రామాలు తిరిగి తెలంగాణలో కలుపుతారా?
x
సీఎం చంద్రబాబుతో తుమ్మల నాగేశ్వరావు భేటీ

ఆ ఐదు గ్రామాలు తిరిగి తెలంగాణలో కలుపుతారా?

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇబ్బందులు రాకుండా గతంలో ఐదు గ్రామాలు ఏపీలో కలిపారు. ఈ గ్రామాలు మళ్లీ తెలంగాణలో కలపాలనే చర్చ ఎందుకు వచ్చింది?


ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం సమీపంలోని ఐదు గ్రామ పంచాయతీలైన యేతపాక, కన్నైగూడెం, పిచ్చికులపాడు, పురుషోత్తపట్నం, గుండాల ను తెలంగాణలోకి తిరిగి విలీనం చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. 2014లో విభజన సమయంలో పొలవరం ప్రాజెక్టు కారణంగా ఏపీలోకి మారిన ఈ గ్రామాలు స్థానికుల జీవన విధానాలు, సాంస్కృతిక సంబంధాలు పరిగణనలోకి తీసుకుని పరిష్కరించాలని కోరారు. చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫిబ్రవరి 16 సాయంత్రం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఈ సమావేశం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయం, సహకారాన్ని బలోపేతం చేసే దిశగా ముఖ్యమైనది. తుమ్మల సీఎంతో జరిపిన చర్చల సారాంశం ఇలా ఉంది.

తిరుమలలో తెలంగాణ భవన్

తిరుమలలో తెలంగాణ ప్రభుత్వానికి 5 ఎకరాల స్థలం కేటాయించాలని అభ్యర్థించారు. ఇది తెలంగాణ యాత్రికుల సౌకర్యాలకు ఉపయోగపడుతుందని తెలిపారు.

సాగునీటి ప్రాజెక్టులు

పెద్దవాగు ప్రాజెక్టు సర్వీస్ రోడ్లు, ఇంప్రూవ్‌మెంట్ పనులకు 85 శాతం నిధులు విడుదల చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టు సుమారు 16,000 ఎకరాలకు నీరు అందించే సామర్థ్యం కలిగి ఉంది. (85:15 నిష్పత్తిలో ఏపీ-తెలంగాణ లబ్ధి).

భద్రాచలం గోదావరి రక్షణ గోడ (ఎంబ్యాంక్‌మెంట్) సర్వీస్ పనులు త్వరగా చేపట్టాలని సూచించారు.

రోడ్లు, రైల్వేలు

సరిహద్దు ప్రాంతాల్లో జాతీయ రహదారులు, సర్వీస్ రోడ్లు పూర్తి చేయాలి.

సత్తుపల్లి-కొవ్వూరు, పెనుబల్లి-అమరావతి రైల్వే లైన్లు నిర్మాణం వేగవంతం చేయాలని అభ్యర్థించారు.

తుమ్మల స్పందన

భేటీ అనంతరం మాట్లాడిన తుమ్మల ‘‘రెండు రాష్ట్రాల సరిహద్దు సమస్యలు సమన్వయంతో పరిష్కరిస్తే తెలుగు ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. ఉన్నత స్థాయి సంప్రదింపుల ద్వారా ఇవి త్వరగా ముగిస్తాం’’ అని తెలిపారు. చంద్రబాబు సానుకూలంగా స్పందించి, “పరిశీలిస్తాం, సహకరిస్తాం” అని హామీ ఇచ్చారని వివరించారు.

ఈ చర్చలు విభజన తర్వాతి సమస్యలను పరిష్కరించే దిశగా ముఖ్యమైన అడుగు. తెలంగాణ మంత్రి (మాజీ టీడీపీ నేత) తుమ్మల చంద్రబాబుతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యత ఇచ్చాయి. రెండు రాష్ట్రాల ప్రజల సంక్షేమం కోసం ఈ సహకారం కొనసాగాలని రాజకీయ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Read More
Next Story