
అక్షర జైళ్లకు చెక్..ఆదివారం సెలవిస్తారా?
ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ర్యాంకుల వేటలో యంత్రాలుగా మారుతున్న విద్యార్థుల జీవితాల్లో ఇకపై ఆదివారం ఆటవిడుపు కానుంది. ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. గంటల తరబడి క్లాసులు, సెలవుల్లేని షెడ్యూళ్లతో పసిప్రాణాలపై పెరుగుతున్న మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వం సరికొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ కోచింగ్ సంస్థల నిబంధనలు, 2026ను విడుదల చేసింది. ఇకపై చదువుల జైళ్లలో బందీలుగా ఉన్న విద్యార్థులకు స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే అవకాశం కల్పిస్తూ, కార్పొరేట్ విద్యా సంస్థల నిరంకుశ పోకడలపై ప్రభుత్వం గట్టి కొరడా ఝుళిపించింది. ఆదివారం అంటే కేవలం క్యాలెండర్‌లో ఒక తేదీ మాత్రమే కాదు, అది విద్యార్థి ఆత్మవికాసానికి దొరికిన అపురూపమైన విరామమని ఈ కొత్త మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి.
పనివేళలు..సెలవుల నియంత్రణ
విద్యార్థులు రోజంతా కోచింగ్ సెంటర్లకే పరిమితం కాకుండా, రోజుకు గరిష్ఠంగా 5 గంటలు మాత్రమే తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే, పాఠశాలలు లేదా జూనియర్ కళాశాలలు నడిచే సమయాల్లో (School Hours) ఎలాంటి కోచింగ్ తరగతులు నిర్వహించకూడదు. దీనివల్ల ఏళ్ల తరబడి విద్యా వ్యవస్థను పీడిస్తున్న డమ్మీ స్కూల్ సంస్కృతికి అడ్డుకట్ట పడనుంది. అలాగే, ప్రతి ఆదివారం, ప్రభుత్వ సెలవు దినాల్లో తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ఆదేశించడం ద్వారా విద్యార్థులకు కాస్తంత స్వేచ్ఛ, విశ్రాంతి లభించనున్నాయి.
ర్యాంకుల వ్యాపారంపై వేటు, గోప్యత..ఆత్మగౌరవం
ఇకపై కోచింగ్ సెంటర్లు విద్యార్థుల మార్కులు, ర్యాంకులు లేదా ఫోటోలను నోటీసు బోర్డులు, వెబ్‌సైట్లు లేదా ప్రకటనల్లో బహిరంగంగా ప్రదర్శించకూడదు. ర్యాంకుల పేరుతో జరిగే అనారోగ్యకరమైన పోటీని తగ్గించడానికి, ఫలితాలను కేవలం విద్యార్థులకు, తల్లిదండ్రులకు మాత్రమే వ్యక్తిగతంగా తెలియజేయాలి. ఇది విద్యార్థులపై ఉండే సామాజిక ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తుంది.
మానసిక ఆరోగ్యమే ముఖ్యం.. వెల్నెస్ సెల్స్ (Wellness Cells)
కోచింగ్ సెంటర్లలో విద్యార్థుల ఆత్మహత్యలు, మానసిక కుంగుబాటును నివారించడానికి ప్రభుత్వం ప్రతి సెంటర్లో ఒక వెల్నెస్ సెల్ ఏర్పాటును తప్పనిసరి చేసింది. ప్రవేశం పొందిన 30 రోజుల్లోపు విద్యార్థులకు మానసిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం ద్వారా వారి సమస్యలను ముందుగానే గుర్తించే అవకాశం కలుగుతుంది.
ఫీజు వాపస్.. సర్టిఫికెట్ల రక్షణ
విద్యార్థుల ఆర్థిక హక్కులను కాపాడుతూ, ఒకవేళ విద్యార్థి మధ్యలో కోర్సు మానేస్తే, మిగిలిన రోజులకు సంబంధించిన ఫీజును 10 రోజుల్లోపు వాపస్ చేయాలని నిబంధన విధించారు. అలాగే, విద్యార్థులను తమ వద్ద బందీలుగా ఉంచుకోవడానికి కోచింగ్ సెంటర్లు వాడుకునే ఒరిజినల్ సర్టిఫికెట్ల అస్త్రాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను కోచింగ్ సెంటర్లు తమ వద్ద ఉంచుకోవడం నేరంగా పరిగణించబడుతుంది.
పర్యవేక్షణ..కఠిన జరిమానాలు
ఈ నిబంధనల అమలును పర్యవేక్షించడానికి ప్రతి జిల్లాలో కలెక్టర్ అధ్యక్షతన, ఎస్పీ.. డీఈవోలతో కూడిన జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ (DLMC) పనిచేస్తుంది.
నిబంధనలు ఉల్లంఘిస్తే
మొదటిసారి: రూ. 50,000 జరిమానా.
రెండోసారి: రూ. 1,00,000 జరిమానా.
మూడోసారి: ఏకంగా రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు.
విద్య అంటే వికాసం.. విక్రయం కాదు అనే సూత్రాన్ని ఈ నిబంధనలు గుర్తు చేస్తున్నాయి. 50 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న అన్ని సంస్థలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆదేశించడం ద్వారా, ప్రభుత్వం ప్రైవేట్ కోచింగ్ రంగాన్ని తన పర్యవేక్షణలోకి తీసుకువచ్చింది. ఇది విద్యార్థుల భద్రతకు, తల్లిదండ్రుల నమ్మకానికి ఒక పెద్ద భరోసా. అయితే ఈ నిబంధనలు ఎంత మేరకు అమలవుతాయనేదే అసలు ప్రశ్న. నిబంధనలు విడుదల చేసినంత సులువుగా వాటిని అమలు చేయడంలో ఎంత మేరకు చిత్తశుద్ధిని ప్రదర్శిస్తుందనేది కూడా చర్చనీయాంశంగా మారింది.
Next Story

