
కోడి గెలుస్తుందా..కోర్టు గెలుస్తుందా?
సంక్రాంతి బరులపై హైకోర్టు పిడుగు. నిబంధనలు అతిక్రమిస్తే అధికారులపైనే చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి బరుల వద్ద పుంజుల కేకల కంటే ముందే ఈసారి హైకోర్టు హెచ్చరికలు మార్మోగుతున్నాయి. అటు కుక్కుట శాస్త్రం.. ఇటు భారత న్యాయస్థానం.. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న యంత్రాంగానికి హైకోర్టు ఈసారి 'వార్నింగ్' బెల్ మోగించింది. పందెం రాయుళ్ల కత్తుల పదును కంటే.. జంతు హింస, జూద నిరోధక చట్టాల పదును పెంచుతూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
సంక్రాంతి కోడిపందాల విషయంలో ఈసారి రాజీ పడే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తేల్చి చెప్పింది. జంతు హింస, జూద నిరోధక చట్టాలను బేఖాతరు చేస్తే.. చివరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలే వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప సంచలన ఆదేశాలు జారీ చేశారు. తహసీల్దార్లు, పోలీసు అధికారుల నిర్లక్ష్యాన్ని ఇకపై సహించబోమని, అవసరమైతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేస్తూ.. బరులపై నిఘా ఉంచేందుకు హైకోర్టు ఒక 'మెగా యాక్షన్ ప్లాన్'ను సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో ఈ సంక్రాంతికి 'కోడి' గెలుస్తుందా? లేక 'కోర్టు' ఆదేశాలు గెలుస్తాయా?" అనేది ఆసక్తికరంగా మారింది.
చట్టాల కఠిన అమలు (Zero Tolerance)
సంక్రాంతి సందర్భంగా ముఖ్యంగా ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విస్తృతంగా జరిగే కోడి పందేలను అరికట్టడానికి రెండు ప్రధాన చట్టాలను కఠినంగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. జంతు హింస నిరోధక చట్టం-1960 ప్రకారం పుంజుల కాళ్లకు కత్తులు కట్టడం, అవి రక్తం ఓడేలా హింసకు గురిచేయడం పూర్తిగా నిషేధం. అలాగే, ఏపీ జూద నిరోధక చట్టం-1974 కింద పందాల పేరుతో బెట్టింగ్‌లు నిర్వహించడం, భారీగా నగదు లావాదేవీలు జరపడం శిక్షార్హమైన నేరాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ చట్టాలను ఉల్లంఘించే వారిపై కనికరం చూపవద్దని పేర్కొంది.
సంయుక్త తనిఖీ బృందాల (Joint Task Force) బాధ్యత
నిఘా పటిష్టం చేసేందుకు ప్రతి మండలంలో ప్రత్యేక సంయుక్త తనిఖీ బృందాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను న్యాయస్థానం ఆదేశించింది. ఈ బృందంలో తహసీల్దార్‌తో పాటు ఎస్‌ఐ (సబ్ ఇన్‌స్పెక్టర్) స్థాయికి తగ్గని పోలీసు అధికారి ఉండాలి. వీరితో పాటు భారత జంతు సంక్షేమ బోర్డు ప్రతినిధి లేదా గుర్తింపు పొందిన జంతు సంరక్షణ సంస్థ (NGO) ప్రతినిధి సభ్యులుగా ఉండాలి. తనిఖీలను పక్కాగా రికార్డ్ చేయడానికి ఒక ఫోటోగ్రాఫర్, భద్రత కోసం ఇద్దరు పోలీసులను ఈ బృందానికి కేటాయించాలని కోర్టు ఆదేశించింది.
అధికారులకు కోర్టు ఇచ్చిన పవర్‌ఫుల్ వార్నింగ్
చట్టాల అమలులో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హైకోర్టు హెచ్చరించింది. జిల్లాలో ఎక్కడైనా కోడిపందాలు జరిగినా లేదా జూదం సాగినా దానికి ఆ జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్ లేదా ఎస్పీలను వ్యక్తిగతంగా జవాబుదారీని చేస్తామని పేర్కొంది. నిబంధనల అమలులో విఫలమైన తహసీల్దార్లు, పోలీసు అధికారులపై తక్షణమే శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
బరుల ధ్వంసం, ఆస్తుల జప్తు
కేవలం పందాలు జరిగే సమయంలోనే కాకుండా, ముందస్తుగా నిఘా ఉంచాలని కోర్టు సూచించింది. గ్రామాల్లో బరులు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? పందాలకు ఎక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి? అనే వివరాలను సేకరించి ఆ ప్రాంతాలను తనిఖీ బృందాలు సందర్శించాలి. అవసరమైతే జనం గుమికూడకుండా సెక్షన్ 144 కింద ఉన్న అధికారాలను ఉపయోగించాలని ఆదేశించింది. పందేల్లో ఉపయోగించే కత్తులు, ఇతర పరికరాలతో పాటు, బెట్టింగ్ రూపంలో వసూలు చేసిన నగదును అక్కడికక్కడే జప్తు (Seize) చేయాలని అధికారులకు పవర్ ఇచ్చింది.
కోర్టు ఆందోళన: ఆస్తులు కోల్పోతున్న యువత
కోడి పందేల ముసుగులో జరుగుతున్న జూదం వల్ల యువత ఆకర్షితులవుతున్నారని, అది వారి కుటుంబాలను ఆర్థికంగా ఛిన్నాభిన్నం చేస్తోందని పిటిషనర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వినతి పత్రాలు ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదన్న ఫిర్యాదులపై స్పందించిన న్యాయమూర్తి, ఈసారి అమలు విషయంలో రాజీ పడకూడదని తేల్చి చెప్పారు.
చట్ట ప్రకారం పోలీసులు ప్రజలను చైతన్యపరుస్తున్నారని ప్రభుత్వం వాదించినా.. క్షేత్రస్థాయిలో పందాల సందడి ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు హైకోర్టు 'వ్యక్తిగత బాధ్యత' అనే నిబంధన పెట్టడంతో అధికారుల్లో కలవరం మొదలైంది. మరి ఈ సంక్రాంతికి 'బరి'లో కోడి ఆధిపత్యం ఉంటుందా లేక 'కోర్టు' ఆదేశాలదే పైచేయి అవుతుందా అనేది చూడాలి.

