
సోషల్ మీడియా నియంత్రణలు పిల్లల భవిష్యత్తును కాపాడతాయా?
పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలనే ప్రభుత్వ నిర్ణయం ఏపీలో హాట్ టాపిక్ అయింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అసెంబ్లీలో సోషల్ మీడియాపై కీలక వ్యాఖ్యలు చేశారు. 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా అందుబాటులో లేకుండా చేసేలా నియంత్రణలు తెచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకు 90 రోజుల్లోపు చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. 13 నుంచి 16 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు కూడా ఇలాంటి నియంత్రణలు వర్తించాలా అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయని, దీనిపై విస్తృత ఏకాభిప్రాయం తర్వాతే నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు. ఈ ప్రకటన కర్నాటక ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం విధించిన నేపథ్యంలో వచ్చింది. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఈ నిర్ణయం పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఉద్దేశించినదిగా సీఎం వివరించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు పిల్లలను ఆకర్షించేలా రూపొందిస్తున్నారని, ఇది వారి దృష్టి సామర్థ్యాన్ని, చదువును ప్రభావితం చేస్తుందని సీఎం అన్నారు. ఐటీ మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు ఈ ప్రతిపాదనలు రూపుదిద్దుకుంటున్నాయని, మహిళలు, పిల్లలపై సోషల్ మీడియా దుష్ప్రభావాలను తగ్గించేందుకు ఇది అవసరమని చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ నియంత్రణలు ఎలా అమలు చేయాలి?
ఇది ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఉన్న నిషేధాలను అనుసరిస్తుందా? వీపీఎన్‌లు, షేర్డ్ డివైస్‌లు వంటి సాంకేతిక సవాళ్లను ఎదుర్కోవడం ఎలా? ఇవి ప్రధాన ప్రశ్నలు. ప్రభుత్వం మెటా, ఎక్స్, గూగుల్ వంటి ప్లాట్‌ఫామ్‌లతో చర్చలు జరిపి, గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీస్‌లను అనుసరించాలని భావిస్తోంది. అయితే ఈ బ్యాన్ ఎంతవరకు ప్రభావ వంతం అనేది సందేహమే. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రుల ఫోన్‌లు ఉపయోగించడం సాధారణం. మరి డిజిటల్ లిటరసీ లేకుండా నిషేధాలు అమలు కష్టం.
నిపుణుల అభిప్రాయాలు
డాక్టర్ పూజిత జోస్యుల, సైకాలజిస్ట్, విజయవాడ.
ఈ బ్యాన్‌ను సమర్థిస్తూ, పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇది కీలకమని అన్నారు. సోషల్ మీడియా వల్ల ఏర్పడే ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలను తగ్గించవచ్చు. తల్లిదండ్రులు పిల్లలకు ఆఫ్‌లైన్ కార్యకలాపాలు ప్రోత్సహించాలి.
డాక్టర్ వెంకట సుబ్బయ్య, సైకాలజిస్ట్, హైదరాబాద్.
ఈ నిషేధం వైరల్ కామెంట్స్‌లో చర్చనీయాంశమైంది. పిల్లలు సోషల్ మీడియాకు బానిసలవడం వల్ల చదువు, నిద్ర ప్రభావితమవుతున్నాయి. ఈ చర్య సానుకూలం. అయితే అమలు కోసం స్కూల్స్‌లో డిజిటల్ ఎడ్యుకేషన్ అవసరమని సూచించారు.
డాక్టర్ వాసు ప్రదా, సైకియాట్రిస్ట్, విజయవాడ.
పిల్లలు సంకలో ఫోన్‌తో ఉండటం వల్ల జరిగే దుష్ప్రభావాలపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియా నిషేధం వల్ల పిల్లల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. కానీ తల్లిదండ్రులు మార్పు చూపాలని అన్నారు.
డాక్టర్ శ్రీముఖి అనుమోలు, పీడియాట్రిషియన్, నియోనాటాలజిస్ట్, అంకుర హాస్పిటల్స్, విజయవాడ.
ఈ బ్యాన్ సమతుల్య దృక్పథం అవసరం. పిల్లలు సోషల్ మీడియాను సురక్షితంగా ఉపయోగించేలా మార్గదర్శకాలు రూపొందించాలి. పూర్తి నిషేధం కాకుండా ఎడ్యుకేషన్ ఫోకస్ చేయాలని సూచించారు.
ఈ నిర్ణయం పిల్లల డిజిటల్ భవిష్యత్తును రూపొందించడంలో ముఖ్యమైనది. అయితే అమలు, అవగాహన కార్యక్రమాలు, చట్టపరమైన చర్యలు కలిసి రావాలి. లేకుంటే ఇది కేవలం ప్రకటనగానే మిగిలిపోతుంది.

