ఏపీ బడ్జెట్ విద్యకు ప్రాధాన్యం ఇస్తుందా!!!
x

ఏపీ బడ్జెట్ విద్యకు ప్రాధాన్యం ఇస్తుందా!!!

ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చినట్టు జీవో 77 ను రద్దుచేసి ఉన్నత విద్యకు ఊతం ఇవ్వాలని టీచర్లు, విద్యార్థి సంఘాలు కోరుతున్నారు


గత కొన్నేళ్లుగా విద్యకు ప్రభుత్వ కేటాయింపులు తగ్గిపోవటంతో విధ్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలకు దూరం అవుతున్నారు. విద్యలో సంస్కరణల పేరుతో జరుగుతున్న మార్పులు ప్రభుత్వం తన బాధ్యతల నుండి తప్పుకుని విద్యారంగాన్ని ప్రైవేట్ పరం చేయటానికి దారితీస్తోంది.

అధికారంలో ఉన్నప్పుడు విమర్శించే పార్టీలు తాము పరిపాలనకు రాగానే అవే విధానాలను అమలు చేస్తున్నాయి. ప్రభుత్వ విద్యా సంస్థలలో నాణ్యత తగ్గి విద్యార్థులు రాష్ట్రంలోనూ, రాష్ట్రం వెలుపల లేదా విదేశాలకు ఎక్కువ సంఖ్య లో వెళ్తున్నారు.

ఇండియన్ స్టూడెంట్ మొబిలిటీ రిపోర్ట్ ప్రకారం 1999 లో విదేశాలకు వెళ్ళిన విధ్యార్థుల సంఖ్య 55,444 నుండి 2016 నాటికి 2,55,030 కి పెరిగింది. ఈ నివేదిక ప్రకారం అమెరికా లో ఉన్న విధ్యార్థులలో 12.5 శాతం తెలుగు విద్యార్థులే. అక్కడ మాట్లాడే 350 భాషలలొ, అత్యంత ఎక్కువ మంది మాట్లాడే భాషలలొ తెలుగు 11 వ భాషగా నిలిచింది.

ఏపీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 11 న మొదలవుతున్నాయి. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ సారి విద్యకు కేటాయింపులు ఎలా ఉంటాయి అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. విద్యకు ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్ లో 16 శాతం ఉన్న కేటాయింపు 10 ఏళ్ల వైఎస్ఆర్సీపీ, టీడీపీ పాలనలో 11 శాతానికి దిగజారింది.

వైసీపీ ప్రభుత్వం జీవో 77 జారీచేసి విద్యారంగాన్ని విధ్వంసం చేసిందని ఎయిడెడ్ కాలేజీలు, ప్రైవేట్ పీజీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ పునరుద్దరిస్తామని, కాలేజీలకే రుసుము చెల్లించి సర్టిఫికేట్లు విద్యార్థులకు జారీలో చిక్కులు లేకుండా చేస్తామని వాగ్దానం చేసిన టీడీపీ తన ప్రజాగళం ఉమ్మడి మానిఫెస్టో ని వాగ్దానాలు నిలబెట్టు కోలేదని విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలో అనేక స్కూల్స్ మూతపడటానికి కారణం అయిన జీవో 117 ను రద్దు చేసి, మూతపడిన పాఠశాలలను పునఃప్రారంభిస్తామని చెప్పి ఆరురకాలుగా విభజించిన స్కూల్స్ ను 9 రకాలుగా విడదీసి వాటిలో పిల్లల సంఖ్య తగ్గింపును చూపి వేల స్కూల్స్ మూసివేసే ప్రమాదం ఉందని ఈ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

రాష్ట్రంలో కొన్నేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా మారింది. 2014-15 లో 41.83 లక్షలు ఉన్న విధ్యార్థుల సంఖ్య కరోనా సమయంలో 44 లక్షల వరకు చేరి ఈ ఏడు 29.5 లక్షలకు పడిపోయింది. ఒక సర్వే ప్రకారం గత విద్యా సంవత్సరం 20 మంది విద్యార్థులు కూడా లేని పాఠశాలల సంఖ్య 13 వేలు.

ఈ సమస్యలను పరిష్కరించి విధ్యార్థుల సంఖ్యను పెంచే బదులు కూటమి ప్రభుత్వం జిఓ 117 రద్దు చేసినా ఆరు రకాల స్కూల్స్ ను 9 రకాలుగా విభజించటంతో వాటిలోని విధ్యార్థుల సరాసరి సంఖ్య తగ్గిపోతున్నది. అలా పిల్లలు తగ్గిన స్కూల్స్ ను హేతుబద్ధీకరణ పేరుతో విలీనం చేస్తున్నారు. వీటిలో 9,700 మోడల్‌ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేసి 5 తరగతులకు 5 గురు టీచర్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ప్రాక్టికల్ గా 3 ఎస్జీటీ లను మాత్రమే ఇచ్చారు. కొన్ని యు.పి పాఠశాలలను హైస్కూళ్లుగా మార్చారు.

రాష్ర్టంలోని మొత్తం స్కూల్స్ లో 1/3 వ వంతు మాడెల్ స్కూల్స్ ఉంటాయని యూటీఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పి. బాబు రెడ్డి చెప్పారు. “ఎనిమిదవ తరగతి వరకు ఉండే అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ను బాగా తగ్గించారు. చాలా ప్రాథమిక స్కూల్స్ లో 30 లోపు పిల్లలు ఉంటారు. వీటిలోంచి 3,4,5 తరగతులను హై స్కూల్ లో కలపటంతో 1,2 లో క్లాసులలో తక్కువ మంది పిల్లలు అయ్యారు. వీటిలో పిల్లలు తగ్గడంతో తల్లి దండ్రులకు వీటిపైన నమ్మకం పోతోంది. దీంతో ఇవి పిల్లలు లేక మూతపడతాయి,” అని ఆందోళన వ్యక్తం చేశారు.

2024-25 డైస్ గణాంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 84,54,817 మంది విద్యార్థులు ఉంటే వారిలో ప్రభుత్వ పాఠశాలల్లో 43.09 శాతం (36,43,181), ఎయిడెడ్ పాఠశాలల్లో 0.9 శాతం (7,610) చదువుతుంటే ప్రైవేట్ పాఠశాలల్లో 55.61 శాతం (47,01, 724) మంది విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు అంటే ప్రభుత్వ, పంచాయతీరాజ్, మున్సిపల్, ట్రైబల్ వెల్ఫేర్ మేనేజ్మెంట్లతో బాటు కేంద్రీయ విద్యాలయాలు గురుకులాలు, మోడల్ స్కూల్సు, రెసిడెన్షియల్ స్కూల్సు, ఏకలవ్య పాఠశాలలు, కెజిబివి, మాత్రమే కాకుండా ఓపెన్ స్కూల్ ఇతరత్రా చదువుతున్న విద్యార్ధులను సైతం లెక్కించి చూపారు. కాని వాస్తవానికి ప్రభుత్వ పాఠశాలల్లో 32 లక్షల కంటే ఎక్కువ విద్యార్థులు లేరు.

ఈ విద్యా సంవత్సరం అక్టోబరు నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో 31.50 లక్షల విద్యార్థులు చదువుతున్నట్లు అధికారులు చెబుతున్నా ప్రభుత్వ, పంచాయతీరాజ్, మున్సిపల్, ట్రైబల్ వెల్ఫేర్, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధుల సంఖ్య 29.30 లక్షలు మాత్రమే.

విద్యార్థుల సంఖ్య తగ్గిపోవటంతో ఐదు వేల ఫౌండేషన్‌ స్కూళ్లు, 19 వేల బేసిక్ ప్రైమరీ స్కూళ్లకు భవిష్యత్తు ఉండదని శాసన మండలి మాజీ సభ్యులు కె. ఎస్. లక్ష్మణ రావు చెప్పారు. “ఈ పరిణామాలతో 24,000 పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉంది. ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ప్లస్ 2 తరగతులను తగిన సంఖ్యలో అధ్యాపకులు, తరగతి గదులు, లేకుండానే మొదలు పెట్టడంతో తగిన ఆదరణ రాలేదు. ఇవి కొనసాగుతాయా లేదా అనే సందిగ్ధత ఉంది,” అని ఆయన సంశయం వ్యక్తం చేశారు.

ఈ మార్పులు చేశాక ఏ రకమైన స్కూల్స్ ఎన్ని ఉన్నాయి వాటిలో ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంత వివరాలు ఇవ్వటం లేదని ఏపీటీఫ్ 1938, రాష్ట్ర అధ్యక్షులు, జి. హృదయ రాజు అన్నారు. “ప్రభుత్వం అమ్మ ఒడి పథకం ద్వారా రు. పదిహేను వేలు ఇస్తోంది. ఈ పథకం ప్రైవేట్ స్కూల్ పిల్లలకు కూడా అమలు చేస్తుండటంతో వాళ్ళు తల్లిదండ్రులు రు. పది వేలు ఇస్తే తమ స్కూల్ లో చేర్చుకుంటున్నారు. దీనితో కొంత మంది పిల్లలు ప్రైవేట్ వైపు మళ్ళారు,” అని ఆయన అన్నారు.

ఇది 86వ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన ప్రాథమిక విద్య హక్కు కు భంగకరం. దీని అమలు కోసం 2009 లో జాతీయ విద్య హక్కు చట్టం ఆమోదించారు.

ఈ చట్టం ప్రాధమిక పాఠశాలను ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకు లేదా ఒకటి నుండి ఎనిమిది తరగతులు నిర్వహించే పాఠశాల అని నిర్వచించింది. ఈ చట్టాన్ని సవరించకుండా పాఠశాలలను గత ప్రభుత్వం ఆరు రకాలుగా, టీడీపీ ప్రభుత్వం తొమ్మిది రకాలుగా విభజించటం దాని స్పూర్తికి విరుద్దం.

గత ప్రభుత్వం పాఠశాలల్లో వసతులు కల్పించేదుకు మొదలు పెట్టిన పనులు ఆగిపోయాయి. వాళ్ళు చేసిన చెడును మాత్రం కొనసాగిస్తున్నారు. మంచిని ఆపివేస్తున్నారని, ఆంధ్ర ప్రదేశ్ విద్య పరిరక్షణ కమిటీ, అఖిల భారత విద్య హక్కు వేదిక ఆందోళన వ్యక్తం చేశాయి. వీటి పిలుపు మేరకు విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు ఫిబ్రవరి 1 తారీఖున ధర్నా నిర్వహించాయి.

స్కూల్స్ లో తెలుగు మీడియం లేకపోవడంతో ఇంట్లో ఏ రకమైన తోడ్పాటు అందించలేని కుటుంబాలలోని పిల్లలు ఇబ్బందికి గురవుతున్నారనీ ఆయన చెప్పారు. రాబోయే మూడు సంవత్సరాలలో దీని ప్రభావం కనిపిస్తుంది.

“గత ప్రభుత్వ వైఖరికి భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వం విద్యారంగానికి సంబంధించిన పాలసీ నిర్ణయాలపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చిస్తున్నా దాని ఆలోచనలన్నీ ప్రపంచ బ్యాంకుతో కుదుర్చుకున్న ఒప్పందానికి, జాతీయ నూతన విద్యా విధానం-2020లోని అంశాలకు అనుగుణంగానే ఉంటున్నాయని,” యూటీఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె. ఎస్. ఎస్. ప్రసాద్ అంటూ, దీనివల్ల భవిష్యత్లో ప్రభుత్వ విద్యారంగం బలపడకపోగా ప్రాథమిక విద్యారంగం మరింత కుదేలుబదే ప్రమాదం పొంచి ఉందని భయాన్ని వ్యక్తం చేశారు.

విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ 13 డిసెంబర్ 2024 న ఉపాధ్యాయ సంఘాలతో ఒకే ఒక్క సమావేశం జరిగిందని ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి. ఇంత వరకు ఆయన వారితో ఎటువంటి రివ్యూ లు చేయలేదని అన్నారు. మే నెలలో ఏపీటీఫ్ లాంటి కొన్ని సంఘాలు ధర్నా నోటీసు ఇవ్వడంతో ఆ మీటింగ్ జరిపారని అభిప్రాయపడ్డారు.

ఎస్.ఇ.పి పై పార్టీల వైఖరి:

కేంద్ర విద్యా విధానం (ఎన్.ఇ.పి, New Education Policy) రాష్ట్రాల ఫెడరల్ హక్కుల పైన దాడిచేస్తూ పాఠశాల విద్య నుండి పరిశోధన వరకు కేంద్ర నిర్దేశం ప్రకారమే నడవాలని సూచిస్తోంది. కేంద్రం తయారు చేసిన పుస్తకాలనే రాష్ట్రాలు వాడుకోవాలని చెప్తోంది. వైసీపీ ప్రభుత్వం సిబిఎస్ఈ సిలబస్ ను ప్రవేశపెట్టడమే కాక వాళ్ళు ఏ పాఠాలు తొలగిస్తే అవి తొలగించారని, ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్, రమేష్ పట్నాయక్, ఆవేదన వ్యక్తం చేశారు.

దీంతో ఈ పుస్తకాలలో సంఘ-సంస్కరణల కొరకు జరిగిన ఉద్యమాలు, పౌరహక్కుల గురించి పోరాటాలు లేకుండా రాజకీయ శాస్త్రం, మొఘల్ కాలంలో జరిగిన అభివృద్ది గురించి లేకుండా ఆర్థిక శాస్త్రం, డార్విన్ సిద్ధాంతం లేకుండా జీవ శాస్త్రం, మొండలీవ్ ఆవర్తన పట్టిక లేకుండా రసాయనిక శాస్త్రం బోధిస్తున్నారు.

తమిళనాడు ప్రభుత్వం ఎన్.ఇ.పి ని అమలు చేయమని తెగేసి చెప్పింది. కానీ మన రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కొరకు రాష్ట్రాల ఫెడరల్ హక్కులను బలిచేస్తున్నాయి. ఈ విధానాలను రాష్ట్రంలో అమలు చేయకూడదని విద్యా పరిరక్షణ కమిటీ ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది.

డైట్ కాలేజీల పరిస్థితి:

ఇంటర్మీడియట్ అర్హతతో ప్రాధమిక స్కూల్స్ లో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే 13 డైట్ (జిల్లా విద్యా శిక్షణా సంస్థ) (District Institute of Education and Training) కాలేజీలు లెక్చరర్ ల కొరతతో సతమతం అవుతున్నాయి. వీటిలో మంజూరైన 355 పోస్టులకు గాను కేవలం 19 మంది మాత్రమే శాశ్వత సిబ్బంది ఉన్నారు. వీటికి కనీసం ప్రిన్సిపల్ లు కూడా లేరు. రెండు సంవత్సరాల డిప్యుటేషన్ పై వచ్చిన టీచర్ లతో ప్రస్తుతం ఇవి నడుస్తున్నాయి.

డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా సగం స్టాఫ్ ను తీసుకునే అవకాశం ఉన్నా టీచర్ ల మధ్య ఉన్న ఏకీకృత సర్విస్ సమస్యను సాకుగా చూపుతూ చేయటం లేదని ఆ కళాశాలలో పేరు చెప్పటానికి ఇష్ట పడని సీనియర్ లెక్చరర్ తెలిపారు. ఈ కాలీజీలకు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) నిబంధనల ప్రకారం సీనియర్ లెక్చరర్ లు మాత్రమే ప్రిన్సిపల్ గా ఉండాలి. కానీ విద్యా శాఖలో అడ్మినిస్ట్రేషన్ పోస్టులో ఉండే అసిస్టెంట్ డైరెక్టర్ లను ప్రిన్సిపల్ గా చేస్తున్నారు.

ఈ కాలేజీల లో పోస్టులకు కేంద్ర ప్రాయోజిత ప్రథకం(centrally sponsored scheme) ద్వారా నిధులు వస్తాయని కాలీజీల స్టాఫ్ తెలిపారు. పర్మనెంట్ స్టాఫ్ ఉంటే వారి జీతాల్లో 60 శాతాన్ని కేంద్రం భరిస్తుంది. డిప్యుటేషన్ లేదా ఫారిన్ సర్విస్ పేరుతో బయటి నుండి టీచర్ లను తెచ్చి పాఠాలు చెప్పించటంతో వారి పూర్తి జీతం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది.

మంచి టీచర్లు కావాలంటే సరయిన శిక్షణ ఇచ్చే టీచర్లు అవసరం కదా. కేంద్రం డైట్ లను జిల్లాలో విద్య అభివృద్దికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా తీర్చిదిద్దడానికి రు. పదిహేను కోట్లు కేటాయించింది. మొదటి ఏడు మూడింటిని తీసుకున్న కేంద్రం మరో ఏడు మూడింటిని గుర్తించింది. అన్నీ కాలేజీలు ఈ పథకం క్రింద లబ్ది పొందేందుకు అవకాశం ఉంది అందుకు వాటికి మొదట ప్రిన్సిపల్ లను ఏర్పాటు చేయాలి అని మరో లెక్చరర్ చెప్పారు.

Read More
Next Story