ప్రియుడి మోజులో పడి.. కన్న బిడ్డను అనాథను చేసి
x

ప్రియుడి మోజులో పడి.. కన్న బిడ్డను అనాథను చేసి

భర్త హత్యను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం. భార్య, ప్రియుడి గుట్టు రట్టు చేసిన పోలీసులు.


అక్రమ సంబంధం ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేలా చేస్తుంది అనడానికి అనకాపల్లి జిల్లాలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. కట్టుకున్న భర్తను కాదని, కన్న కొడుకును మరిచి, ప్రియుడితో కలిసి పథకం వేసి భర్తను కడతేర్చిందో కిరాతకురాలు. ప్రమాదం అని నమ్మించాలని చూసినా, పోలీసుల విచారణలో అసలు రంగు బయటపడింది.

అసలేం జరిగింది?

అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం తురువోలు గ్రామానికి చెందిన డేగల చిన్న, కొండమ్మ దంపతులకు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 12 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే, 2024లో పని కోసం తెనాలి వెళ్లిన సమయంలో కొండమ్మకు మేస్త్రీ గణేశ్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయం తెలుసుకున్న భర్త చిన్న.. భార్యను మందలించి స్వగ్రామానికి తీసుకువచ్చేశాడు.

ఫోన్ కాల్స్‌తో మొదలైన చిచ్చు

ఊరికి వచ్చినా కొండమ్మ తీరు మారలేదు. ప్రియుడు గణేశ్‌తో రహస్యంగా ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. దీంతో భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. తన సుఖానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన కొండమ్మ, అతడిని శాశ్వతంగా అడ్డుతొలగించుకోవాలని స్కెచ్ వేసింది.

సినిమా ఫక్కీలో హత్య.. ప్రమాదంగా డ్రామా

కొండమ్మ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఈనెల 14న ప్రియుడు గణేశ్ తన బంధువు శివకుమార్‌తో కలిసి తెనాలి నుంచి చోడవరం వచ్చాడు. చిన్న ద్విచక్ర వాహనంపై వస్తుండగా దారి కాచి, తలపై బలంగా కొట్టి హత్య చేశారు. అనంతరం అది రోడ్డు ప్రమాదంగా అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు.

గుట్టు రట్టు చేసిన పోలీసులు

ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు అనుమానం రావడంతో లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఫోన్ కాల్ డేటా ఆధారంగా ఆరా తీయగా కొండమ్మ అసలు స్వరూపం బయటపడింది. అనకాపల్లి డీఎస్పీ శ్రావణి వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితులు ముగ్గురిని (కొండమ్మ, గణేశ్, శివకుమార్) అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Read More
Next Story