ఇల్లాలు కాదు..హంతకురాలు
x

ఇల్లాలు కాదు..హంతకురాలు

ప్రియుడి కోసం రూ. 50 వేలు సుపారీ ఇచ్చి భర్తను చంపించిన భార్య.


వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. కట్టుకున్న భర్తను, కన్నబిడ్డల తండ్రిని అడ్డు తొలగించుకోవాలని పథకం వేసిన ఓ ఇల్లాలు, ప్రియుడితో కలిసి కిరాయి హంతకులను ఆశ్రయించింది. కేవలం రూ. 50 వేల సుపారీ ఇచ్చి భర్తను అంతమొందించి, ఏమీ తెలియనట్లు పోలీసులకు మిస్సింగ్ ఫిర్యాదు ఇచ్చి నాటకమాడింది. చివరకు పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడటంతో నిందితులంతా కటకటాల పాలయ్యారు.

హత్యకు పథకం ఇలా..

విశాఖలోని పీఎంపాలెం పోలీసుల కథనం ప్రకారం.. బక్కనపాలెం ఎన్టీఆర్ కాలనీకి చెందిన అల్లాడ నాగరాజు(38), రమ్య దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. అయితే, రమ్యకు కంచరపాలేనికి చెందిన సంజీవి వసంతరావుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో నాగరాజును చంపాలని రమ్య, ఆమె ప్రియుడు నిర్ణయించుకున్నారు.
ఇందుకోసం కంచరపాలేనికే చెందిన బాలకృష్ణ, ప్రవీణ్ అనే వ్యక్తులకు రూ. 50 వేలు సుపారీ (హత్యకు నగదు) ఇచ్చారు.
కిడ్నాప్ చేసి.. హత్య చేసి..
పథకం ప్రకారం నిందితులు వసంతరావు, బాలకృష్ణ, ప్రవీణ్ కలిసి నాగరాజును కిడ్పాప్ చేసి మధురవాడ మిథిలాపురి వుడా కాలనీలోని ఒక లాడ్జికి తీసుకెళ్లారు. అక్కడ అతడిని హతమార్చి, మృతదేహాన్ని తిమ్మాపురం రోడ్డులోని బావికొండ సమీపంలో ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు.
మిస్సింగ్ డ్రామా
హత్య జరిగిన రెండు వారాల తర్వాత, ఏమీ తెలియనట్టు రమ్య డిసెంబర్ 17న పోలీసులను ఆశ్రయించింది. తన భర్త మద్యానికి బానిసయ్యాడని, ఇంట్లో ఉన్న రూ. 5 వేల నగదు, బంగారం తీసుకుని వారం క్రితం మాయమయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేసి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది.
పోలీసుల విచారణలో బట్టబయలు
రమ్య పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చిన పీఎంపాలెం పోలీసులు ఆమెను తమదైన శైలిలో విచారించారు. దీంతో అసలు నిజం బయటపడింది. ప్రియుడితో కలిసి తామే హత్య చేయించినట్లు ఆమె నేరాన్ని అంగీకరించింది. బుధవారం పోలీసులు మృతదేహాన్ని పడేసిన ప్రాంతానికి వెళ్లి, కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించి, రమ్యతో పాటు ఆమె ప్రియుడు వసంతరావు, సుపారీ ముఠా సభ్యులు బాలకృష్ణ, ప్రవీణ్‌లను అరెస్టు చేసినట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు.
Read More
Next Story