
భర్తను డ్రైవర్‌గా పంపింది..ప్రియుడితో కలిసి ప్రాణం తీసింది
గుండెపోటుతో భర్త చనిపోయాడని నాటకమాడి దొరికిపోయిన కిరాతక భార్య మాధురి.
వివాహేతర సంబంధం ఓ పచ్చని సంసారంలో చిచ్చుపెట్టడమే కాదు.. కట్టుకున్న భర్తను కాటికి పంపేలా చేసింది. ప్రియుడి మోజులో పడి భర్తనే అడ్డు తొలగించుకోవాలనుకున్న ఓ భార్య.. అతడిని చంపి, గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేసి చివరకు పోలీసులకు చిక్కింది. గుంటూరు జిల్లా చిలువూరులో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
ప్రేమ వెనుక గోపి ప్లాన్
వివరాల్లోకి వెళితే.. చిలువూరుకు చెందిన శివనాగరాజు(45), లక్ష్మీ మాధురికి 2007లో వివాహమైంది. శివనాగరాజు ఉల్లిపాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే, విజయవాడలో పనిచేస్తున్న సమయంలో భార్య మాధురికి సత్తెనపల్లికి చెందిన గోపితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ప్రియుడు గోపికి దగ్గరగా ఉండాలనే ప్లాన్‌తో, తన భర్త ఉల్లిపాయల వ్యాపారం మానిపించి, హైదరాబాద్‌లో ట్రావెల్స్ నడిపే గోపి వద్దే డ్రైవర్‌గా చేర్పించింది మాధురి.
కళ్లెదుటే కనిపించిన అక్రమ సంబంధం
హైదరాబాద్‌కు కాపురం మార్చాక.. ఒకరోజు గోపి-మాధురి ఏకాంతంగా ఉండటం శివనాగరాజు కంటపడింది. దీంతో షాక్‌కు గురైన ఆయన భార్యను నిలదీసి, వెంటనే తిరిగి సొంత ఊరైన చిలువూరుకు తీసుకువచ్చేశాడు. గోపితో మాట్లాడవద్దని గట్టిగా హెచ్చరించాడు. అయినా మాధురి తీరు మారలేదు. భర్త కళ్లుగప్పి అక్రమ సంబంధం కొనసాగిస్తూనే ఉంది. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి, అతడిని శాశ్వతంగా తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి మృత్యు స్కెచ్ వేసింది.
నిద్రమాత్రలు.. ఆపై హత్య
జనవరి 18న పక్కా ప్లాన్ ప్రకారం భర్త తినే భోజనంలో మాధురి నిద్రమాత్రలు కలిపింది. ఆయన గాఢ నిద్రలోకి జారుకోగానే ప్రియుడు గోపిని ఇంటికి పిలిపించి, ఇద్దరూ కలిసి శివనాగరాజును ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. హత్య తర్వాత గోపి అక్కడి నుంచి పరారు కాగా.. మాధురి ఏమాత్రం చలించకుండా రాత్రంతా నీలిచిత్రాలు చూస్తూ గడిపింది. తెల్లారాక తన భర్త గుండెపోటుతో మరణించాడంటూ ఏడుస్తూ నాటకం మొదలుపెట్టింది.
ముసుగు తొలగించిన పోలీసులు
శివనాగరాజు ఒంటిపై గాయాలు ఉండటం, మాధురి గత ప్రవర్తనపై అనుమానం రావడంతో మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా, మాధురి అసలు నిజం ఒప్పుకుంది. ప్రియుడి కోసమే భర్తను చంపినట్లు అంగీకరించింది. ప్రస్తుతం మాధురిని అరెస్ట్ చేసిన పోలీసులు, పరారీలో ఉన్న ప్రియుడు గోపి కోసం గాలిస్తున్నారు.

