జనసేన ఆఫీసుపై దాడెందుకు జరిగిందీ?
x

జనసేన ఆఫీసుపై దాడెందుకు జరిగిందీ?

సెక్యూరిటీ సిబ్బందిపై వేటు, కేసు నమోదు


మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలోకి శుక్రవారం ఓ యువకుడు ప్రవేశించి బీభత్సం సృష్టించాడు. కారు అద్దాలను పగలగొట్టడం సంచలనం కలిగించింది. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో అతను కార్యాలయంలో చొరబడ్డాడు. సాధారణంగా పార్టీ కార్యక్రమాలు ఉంటేనో.. లేదంటే పార్టీ కార్యాలయ సిబ్బంది ముందస్తు అనుమతి తీసుకుంటే తప్ప మీడియా ప్రతినిధులను సైతం భద్రతా సిబ్బంది జనసేన పార్టీ కార్యాలయంలోకి అనుమతించరు. అయితే ఆ వ్యక్తి ఎలా లోపలకు ప్రవేశించాడన్న దానిపై పార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేశారు.
భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని పట్టుకుని మంగళగిరి పోలీసులకు అప్పగించినట్టు సమాచారం. ఘటన జరిగిన సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ కార్యాలయంలోనే ఉన్నారు. ఈ ఘటనపై గుంటూరు ఐజీ, ఎస్పీ ప్రత్యేక విచారణ జరుపుతున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం సాయంత్రం అడిషనల్‌ డీజీ మహేశ్‌ చంద్ర లడ్డా భేటీ అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఘటనకు పాల్పడిన వ్యక్తి శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం ఖాజూరుకు చెందిన నారద నీలాద్రి (39) నారం నీలాద్రిగా సమాచారం.
అతనికి మతిస్థిమితం లేదని అంటున్నారు. పార్టీ కార్యాలయంలో భవన నిర్మాణ పనులు కొనసాగుతుండగా, ఆ వ్యక్తిని కార్మికుడిగా భద్రతా సిబ్బంది భావించడం వల్లే లోపలకు రాగలిగాడని చెబుతున్నారు. గత ఏడాది మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంపై డ్రోన్‌ కలకలం రేపింది. మూడు రోజుల క్రితం మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఓ జనసేన నేత ‘జనసేన పార్టీని మంగళగిరి నియోజకవర్గంలో ఎదగనీయకుండా ఉండేందుకు కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని, దానికి జనసేన పార్టీలో కొందరు మద్దతు ఇస్తున్నారని ఆరోపణలు చేయడం గమనార్హం.
ఈ ఘటనను భద్రతా విభాగం వైఫల్యంగా భావిస్తున్నారు. ఐదుగురిని మాతృశాఖకు పంపారు. రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.పెంటారావుతోపాటు నలుగురు కానిస్టేబుళ్లను మాతృవిభాగంలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు.
నారద నీలాద్రి జనసేన కేంద్ర కార్యాలయంలోకి చొరబడి కార్లు ధ్వంసం చేయడం కలకలం రేపింది. డిప్యూటీ సీఎం కాన్వాయ్‌లోని రెండు వాహనాలను ధ్వంసం చేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు.
Read More
Next Story