రాయలసీమ‌ ప్రాజెక్టులపై వివక్ష ఎందుకు?
x
నంద్యాల సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాట్లాడుతున్న బొజ్జా

రాయలసీమ‌ ప్రాజెక్టులపై వివక్ష ఎందుకు?

రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు 2026–27 బడ్జెట్‌లో రూ. 8,000 కోట్లు కేటాయించాలని బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు.


రాయలసీమ వ్యవసాయాభివృద్ధికి కీలకమైన SRBC, తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీనీవా వంటి సాగునీటి ప్రాజెక్టులు నాలుగు దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ పూర్తికాకపోవడం దురదృష్టకరమని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యవసాయ యోగ్యమైన భూమిలో 42 శాతం రాయలసీమలో ఉన్నప్పటికీ, సాగునీటి నిధుల కేటాయింపుల్లో తీవ్ర అసమతుల్యత కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం నంద్యాల సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో బొజ్జా మాట్లాడుతూ.. ప్రభుత్వ అంచనాల ప్రకారం రాయలసీమలో ఉన్న పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ప్రాజెక్టుల ఆధునీకరణకు సుమారు ₹60,000 కోట్ల రూపాయల నిధులు అవసరం ఉందని ఆయన తెలిపారు. అయితే గత పది సంవత్సరాల్లో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు సగటున ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టింది కేవలం ₹1,508 కోట్ల రూపాయలు మాత్రమే అని వెల్లడించారు. ఈ విధంగానే నిధులు కేటాయిస్తే, ప్రాజెక్టు నిర్మాణ వ్యయాలు పెరగవు అని ఊహించినా కూడా రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి కావడానికి ఇంకా 40 సంవత్సరాలు పట్టే పరిస్థితి ఉందని అన్నారు.

ఈ నేపథ్యంలో 2026–27 బడ్జెట్‌లో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు కనీసం ₹8,000 కోట్లు కేటాయించి, ఒకే సంవత్సరంలో 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా డిస్ట్రిబ్యూటరీలు, పంట కాలువల నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ₹1,250 కోట్లు పంట కాలువల నిర్మాణానికి కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే గుండ్రేవుల, వేదవతి, RDS నిర్మాణాలకు, PABR, హంద్రీనీవా, గాలేరునగరి, తెలుగుగంగ, ప్రాజెక్టుల్లో ఉన్న పెండింగ్ పనులు పూర్తి చేయడానికి, గోరుకల్లు, అలుగనూరు, అన్నమయ్య ప్రాజెక్టుల మరమ్మతులకు, ఎస్సార్ బీసీ కాలువలో 22,000 క్యూసెక్కుల సామర్థ్యంతో నీటిని తరలించి గోరకల్లు రిజర్వాయర్ కు తీసుకోవడానికి ఉన్న అడ్డంకులు తొలగించడానికి కలిపి సుమారు ₹6,750 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరారు.
రాయలసీమ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడానికి, ప్రాజెక్టుల ఆధునీకరణకు, అలాగే చెరువుల పునరుద్ధరణకు ప్రత్యేక నిధులు కేటాయించి చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టులను 3 లేదా 4 సంవత్సరాలలో పూర్తి చేయడానికి SPV ఏర్పాటు చేసి, టైమ్‌బౌండ్ కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల సంక్షేమం కోసం కలిసి పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రెండు రాష్ట్రాలకు ప్రయోజనకరమైన గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరారు. అలాగే రాయలసీమ, తెలంగాణ, కోస్తా ప్రాంతాలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు పూడికతో జీవితకాలం తగ్గిపోకుండా ఉండేందుకు, శ్రీశైలం రక్షణకు అవసరమైన సిద్ధేశ్వరం అలుగు నిర్మాణాన్ని తెలంగాణ ముఖ్యమంత్రిని ఒప్పించి చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
రాయలసీమ సాగునీటి సమస్య పరిష్కారం కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన అంశం కాదని, ఇది రాష్ట్ర వ్యవసాయ భద్రత, త్రాగునీటి భద్రత, ప్రాంతీయ సమతుల్యత, సమగ్ర అభివృద్ధితో నేరుగా ముడిపడి ఉన్న కీలక అంశమని బొజ్జా దశరథరామిరెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు ఏరువ రామచంద్రారెడ్డి, నంది రైతు సమాఖ్య అధ్యక్షులు బెక్కం రామసుబ్బారెడ్డి, న్యాయవాది అసదుల్లా, భాస్కర్ రెడ్డి, జానో జాగో మహబూబ్ భాష, బిజ్జల క్రిష్ణమోహన్ రెడ్డి, రాఘవేంద్ర గౌడ్, పట్నం రాముడు, మహమ్మద్ ఫర్వేజ్, నిట్టూరు సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Read More
Next Story