పోలవరంపై ఉండవల్లికి ఎందుకు ఆందోళన?
x

పోలవరంపై ఉండవల్లికి ఎందుకు ఆందోళన?

ఉండవల్లి సీఎం చంద్రబాబుకు ఎందుకు లేఖ రాసినట్టు?


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు విషయంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ మరోసారి గళమెత్తారు. కేవలం రాజకీయ విమర్శలు కాకుండా, పూర్తిస్థాయి సాంకేతిక ఆధారాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆయన బహిరంగ లేఖ రాశారు. సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC), పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (PPA) నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఆయన ఈ లేఖ రాసినట్లు స్పష్టమవుతోంది. ఇంతకీ ఉండవల్లిని అంతలా ఆందోళనకు గురిచేస్తున్న అంశాలేమిటి? ప్రాజెక్టు భద్రతపై ఆయన లేవనెత్తుతున్న అభ్యంతరాలేంటి?

అనుమతులు లేకుండానే పనులా?
పూర్తిస్థాయి సాంకేతిక, డిజైన్ అనుమతులు లేకుండా పనులు కొనసాగించడం డ్యామ్ పటిష్టతకు, ప్రజా భద్రతకు ముప్పు అని ఉండవల్లి తన లేఖలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నది మట్టం కంటే 7.18 మీటర్ల ఎత్తులో నిర్మాణం జరుగుతోందని, సరైన డిజైన్ ఖరారు కాకుండానే పనులు ముందుకు తీసుకెళ్లడం నిబంధనలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ప్రాథమిక అనుమతులు లేకుండా చేసే ఈ నిర్మాణాలు భవిష్యత్తులో సరిదిద్దలేని నష్టానికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
డయాఫ్రమ్ వాల్‌పై కీలక ప్రశ్నలు.. అది పునాది కాదు
ఉండవల్లి లేవనెత్తిన మరో ప్రధానాంశం డయాఫ్రమ్ వాల్. డ్యామ్ కింద ఉండే డయాఫ్రమ్ వాల్‌ను చాలామంది పునాది అనుకుంటారు, కానీ ఉండవల్లి అది కేవలం నీటి సీపేజీని అడ్డుకోవడానికి మాత్రమేనని (Cut-off wall) గుర్తుచేశారు. పునాది లోపభూయిష్టంగా ఉండి, ఇసుక కోతకు గురైతే భవిష్యత్తులో డ్యామ్ పడిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు టెయిల్ వాటర్ లెవల్‌ను +25 మీటర్ల నుండి +16.0 / +13.5 మీటర్లకు ఎటువంటి సరైన కారణం లేకుండా మార్చడంపై CWC అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు.
అంతర్జాతీయ కన్సల్టెంట్ నివేదిక ఎక్కడ?
అంతర్జాతీయ కన్సల్టెంట్ AFRY నుండి రావాల్సిన ఫిల్టర్ డిజైన్, స్లోప్ స్టెబిలిటీ వంటి అత్యంత కీలకమైన పత్రాలు ఇంకా CWCకి అందలేదని ఉండవల్లి వెల్లడించారు. ఇవి లేకుండా పనులు చేయడం అంటే ప్రాజెక్టు భద్రతతో చెలగాటం ఆడటమేనని ఆయన అభిప్రాయపడ్డారు. భద్రతా ప్రమాణాలకు సంబంధించిన కీలక పత్రాలు లేకుండా పనులు ముందుకు తీసుకెళ్లడం ద్వారా ఎవరిని సంతృప్తి పరచాలని చూస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
భూకంపాలను తట్టుకోగలదా?
భూకంపాలను తట్టుకునే సామర్థ్యం (Seismic resilience) విషయంలో పాత నిబంధనలకు, ప్రస్తుత ప్రమాణాలకు మధ్య చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. వీటిని సరిచేయకుండా పనులు పూర్తి చేస్తే, భవిష్యత్తులో ఏదైనా ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన ముఖ్యమంత్రికి వివరించారు. సరిదిద్దలేని నష్టం వాటిల్లక ముందే నిపుణుల కమిటీ సూచనలు పాటించాలని సూచించారు.
రాజకీయాలకు అతీతంగా, ప్రాజెక్టు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉండవల్లి ఈ ప్రశ్నలు వేశారు. పోలవరం అనేది ఒక్క ప్రభుత్వ నిర్ణయం కాదు.. అది కోట్లాది మంది ప్రజల భద్రతకు సంబంధించిన అంశం. మరి ముఖ్యమంత్రి ఈ సాంకేతిక అభ్యంతరాలపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Read More
Next Story