
అజిత్ పవార్ విమానం ఎందుకు కూలింది?
అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ఎయిర్‌పోర్టులో తక్కువ విజిబులిటీ కారణంగా కూలిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. పూర్తి దర్యాప్తు కొనసాగుతోంది.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదంపై కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ప్రమాద సమయంలో బారామతి ఎయిర్‌పోర్టులో విజిబులిటీ తీవ్రంగా తగ్గిపోయినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తేలిందని ఆయన వెల్లడించారు.
విమానం ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న సమయంలో రన్‌వే స్పష్టంగా కనిపిస్తున్నదా లేదా అని బారామతి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారులు పైలట్లను ప్రశ్నించారు. అయితే రన్‌వే కనిపించడం లేదని పైలట్లు సమాధానమిచ్చారని తెలిపారు. దీంతో విమానం కొంతసేపు గాల్లో చక్కర్లు కొట్టినట్లు (గో-అరౌండ్) ఆయన చెప్పారు.
తర్వాత రెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించినప్పుడు కూడా రన్‌వే కనిపిస్తుందా అని ఏటీసీ అడిగినట్లు సమాచారం. ఈసారి పైలట్లు సానుకూలంగా స్పందించడంతో ల్యాండింగ్‌కు ఏటీసీ క్లియరెన్స్ ఇచ్చిందని, ఆ వెంటనే విమానం కూలిపోయినట్లు కేంద్ర మంత్రి వివరించారు.
ఈ ఘటనపై మరింత సమాచారం సేకరిస్తున్నామని, పారదర్శకంగా పూర్తిస్థాయి దర్యాప్తు చేపడతామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఇందుకోసం ఇప్పటికే డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్), ఏఏఐబీ (ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో) బృందాలు పుణెకు చేరుకున్నాయని తెలిపారు.
డీజీసీఏ వర్గాల ప్రాథమిక అంచనా
ఇదే అంశంపై డీజీసీఏ వర్గాలు స్పందిస్తూ, ల్యాండింగ్ సమయంలో రన్‌వేను గుర్తించడంలో పైలట్లకు ఇబ్బందులు ఎదురైనట్లు పేర్కొన్నాయి. అయితే ప్రమాద సమయంలో పైలట్ల నుంచి అత్యవసర పరిస్థితిని సూచించే మేడే కాల్స్ (Mayday Calls) రాలేదని వెల్లడించినట్లు సమాచారం.
సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి
అజిత్ పవార్ విమాన ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనలో వాతావరణ పరిస్థితులు, పైలట్ల నిర్ణయాలు, ఏటీసీ క్లియరెన్స్ ప్రక్రియ వంటి అంశాలపై పూర్తి స్థాయి నివేదిక వెలువడిన తర్వాతే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

