సముద్రంలో కలిసే నీటిపై అభ్యంతరాలెందుకు?
x

సముద్రంలో కలిసే నీటిపై అభ్యంతరాలెందుకు?

తెలుగు జాతి ఒక్కటేనని, నీటిపై రాజకీయం వద్దని, పోలవరం సాక్షిగా పొరుగు రాష్ట్రానికి చంద్రబాబు కీలక సందేశం ఇచ్చారు.


సముద్రం పాలయ్యే నీటిని ఒడిసి పడితే అందరికీ లాభమే.. మరి అభ్యంతరాలు ఎందుకు? రాజకీయాల కోసం భావోద్వేగాలతో ఆటలాడటం ఎవరికి మేలు?" అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొరుగు తెలంగాణ రాష్ట్ర నేతలపై ప్రశ్నల వర్షం కురిపించారు. బుధవారం పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన, తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడాల కంటే 'ఇచ్చిపుచ్చుకునే ధోరణి' మిన్న అని స్పష్టం చేశారు. గోదావరిలో పుష్కలంగా నీరుందని, కలిసికట్టుగా వాడుకుంటే ఇరు రాష్ట్రాలూ సస్యశ్యామలం అవుతాయని ఆయన హితవు పలికారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయ నేతలు పోలవరంపై చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. చంద్రబాబు ప్రసంగంలోని ప్రధానాంశాలు..
అభ్యంతరాల్లో అర్థం లేదు: గోదావరి ఎగువన ఉన్న దేవాదుల నుంచి నీళ్లు వస్తేనే కిందికి పోలవరానికి వస్తాయి. అటువంటప్పుడు అభ్యంతరం చెప్పడంలో అర్థం ఉందా? దేవాదులను మరింత ముందుకు తీసుకెళ్లండి.. మేమెప్పుడూ అడ్డు చెప్పలేదు అని చంద్రబాబు గుర్తు చేశారు.
రాజకీయాల కోసం వద్దు: నీటి విషయంలో రాజకీయ నేతలు పోటీపడి విమర్శలు చేయడం సరికాదని, అక్కడి ప్రజలు కూడా వాస్తవాలను ఆలోచించాలని కోరారు. తెలుగు జాతి ఒక్కటేనని, మన మధ్య విరోధాలు పెరిగితే ఇతరులు ఆనందిస్తారని హెచ్చరించారు.
అనుసంధానమే పరిష్కారం: కృష్ణా నదిలో నీటి కొరత ఉన్నప్పుడు గోదావరిని అనుసంధానం చేసుకోవడమే ఉత్తమ మార్గమని సూచించారు. గోదావరి మిగులు జలాలను సాగర్, శ్రీశైలంలో నిల్వ చేస్తే తెలంగాణకు కూడా ప్రయోజనం ఉంటుందని వివరించారు.
రాయలసీమపై స్పష్టత: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కొందరు అబద్ధాలను వందసార్లు చెప్పి నిజం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. సముద్రంలో కలిసే నీటిని అడ్డుకోవడం వల్ల కలిగే లాభాలను గుర్తించాలని కోరారు. ప్రజల కోసం రాజకీయాలు చేస్తే మంచిది కానీ, భావోద్వేగాలతో కాదు అని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ, తెలుగు రాష్ట్రాల మధ్య సామరస్యపూర్వక వాతావరణం ఉండాలని ఆకాంక్షించారు.
Read More
Next Story