
పోలీసు స్టేషన్ లో నిందితుడు గణేష్
పాల విషాన్ని చిమ్మిన ఈ గణేష్ ఎవరు?
తెలిసి తెలిసి ఇంత పనికి ఎందుకు ఒడిగట్టాడు?
రాజమండ్రిలో కల్తీపాల కల్లోలం కొనసాగుతోంది. బుధవారం ఉదయానికి అందిన సమాచారం ప్రకారం ఆరుగురు చనిపోయారు. తాజాగా రాజమహేంద్రవరానికి చెందిన ఓ బాలుడు మనోహర్ విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రిలో మంగళవారం రాత్రి మరణించాడు.
మనోహర్‌కు మూత్రంలో ఇబ్బందులు, కిడ్నీ సంబంధిత సమస్య తలెత్తడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు కాకినాడ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడి నుంచి ఈ నెల 18న కేజీహెచ్‌కు తీసుకువచ్చారు. ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి బాలుడికి యూరిన్ రాకపోవడం, కిడ్నీ సమస్య తీవ్రం కావడంతో డయాలసిస్ చేస్తూ వచ్చారు. మంగళవారం ఉదయం నుంచి పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారడంతో వెంటిలేటర్ అమర్చారు. రాత్రి 8 గంటల సమయంలో మనోహర్ మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు.
రాజమండ్రి ఆస్పత్రుల్లో ఇంతకుముందే ఐదుగురు చనిపోయారు. మనోహర్ మృతితో ఆ సంఖ్య ఆరుకి చేరింది. ఇంతటి కల్లోలానికి కారణమని భావిస్తున్న అడ్డాల గణేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇంతకీ ఎవరీ గణేష్...
కల్తీ పాల విక్రయం కేసులో నిందితుడు అడ్డాల గణే్‌షను రెండు రోజుల కిందటే అరెస్ట్ చేశామని పోలీసులు ప్రకటించారు. కోర్టు ఆదేశాలతో రిమాండుకు తరలించారు. ఈ గణేష్ ది కోరుకొండ మండలం నరసాపురం గ్రామం. పూర్తి పేరు అడ్డాల గణేశ్వరరావు. పాల వ్యాపారి. 11 ఏళ్లుగా నరసాపురం గ్రామంలో డెయిరీ నిర్వహిస్తున్నారు. దానిపేరు వరలక్ష్మి డెయిరీ. దీనికి ఎటువంటి అనుమతులు లేవని తెలుస్తోంది. పుష్కర కాలంగా పాల వ్యాపారం చేస్తుంటే ప్రభుత్వ అధికారులు ఏమి చేస్తున్నారో అర్థం కావడం లేదు. పాడి రైతుల నుంచి పాలు సేకరించి ఇళ్లకు వెళ్లి అమ్ముతుంటాుడు. పాల నిల్వ కోసం పెద్ద పెద్ద ఫ్రిడ్జ్ లు కూడా ఉన్నాయి. ఊళ్లో కూడా పాలు అమ్ముతుంటాడు.
ఈ నేపథ్యంలో పది రోజుల కిందట ఫ్రిడ్జ్‌లోని పాలు చూడగా ఒక క్యాన్‌లో అడుగున గడ్డకట్టడం గమనించాడు. అప్పటికే పైన ఉన్న పాలను కొందరికి అమ్మాడు. అవి చేదుగా ఉన్నాయని గణేశ్‌కి వాళ్లు చెప్పారు. గణేష్ ఈ విషయాన్ని నరేంద్రపురంలోని తన బావ డేగల గంగాధర్‌కు చెప్పాడు. వాటిని పారబోయమని గంగాధర్ చెప్పాడు. అయినా నిర్లక్ష్యంతో వాటిని 105 మందికి అమ్మాడు. పాలు కొన్న వారు గొడవకు దిగడంతో మధ్యవర్తుల సమక్షంలో రాజీకి దిగాడని సమాచారం.
రాజమండ్రిలో ఎప్పుడైతే ఈ పాల కల్తీ బయటపడిందో అప్పటి నుంచి గణేష్ కనిపించకుండా తప్పించుకోవాలని ప్రయత్నించాడు. ఈలోగా రాజమహేంద్రవరం నగర శివారు లాలాచెరువు పరిధిలోని చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్‌లో కల్తీపాలు తాగి పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఆదివారానికి చౌడేశ్వరినగర్‌కు చెందిన తాడి కృష్ణవేణి (85), కనకరత్నం (70) మృతి చెందారు. మరో 8 మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సోమవారానికి ఆ సంఖ్య నాలుక్కి చేరడం, 15 మంది ఆస్పత్రి పాలు కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుణ్ణి పట్టుకొచ్చి రాజమహేంద్రవరం పోలీసు స్టేషన్ లో విచారించారు. దాంతో అసలు విషయం బయటపడింది. పాలల్లో కల్తీ జరిగినట్టు గుర్తించారు.
కల్తీపాలు తాగిన వారి రక్తంలో యూరియా, సీరమ్ క్రియాటినిన్ స్థాయిలు అధికంగా ఉన్నట్టు డాక్టర్లు నిర్దారించారు. కల్తీ వల్లే పాలు విషపూరితం అయ్యాయని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ప్రకటించారు. వైద్యఆరోగ్యశాఖ ప్రాథమిక నివేదికలో ఈ విషయం స్పష్టమైంది. ప్రాథమిక ఎపిడెమియాలజికల్ పరిశీలనలో కల్తీ పాల వినియోగమే దీనికి ప్రధాన కారణమని తేలింది.
కల్తీ పాల ఘటనలో ఇంకా 15 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో ఏడుగురు వెంటిలేటర్, డయాలిసిస్ సహాయంతో చికిత్స పొందుతున్నారని కలెక్టర్ చెప్పారు. మిగిలిన వారికి ప్రాణాపాయం తప్పిందన్నారు. జిల్లా పర్యవేక్షణాధికారి, వైద్యనిపుణులు, శాస్త్రవేత్తలు, నెఫ్రాలజిస్ట్‌లతో కూడిన అధికారులతో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. 14 ఫీల్డ్ సర్వేలెన్స్ బృందాలు 679 ఇళ్లను సందర్శించి 957 కుటుంబాలను స్ర్కీనింగ్ చేశాయని, 110 కుటుంబాల్లో 315 మంది రక్తనమూనాలు సేకరించాయని చెప్పారు.
ఇప్పటికే వరలక్ష్మి మిల్క్‌డెయిరీని సీజ్ చేశారు. పాలు, పన్నీర్, నెయ్యి, మంచినీరు, వెనిగర్ నమూనాలు సేకరించారు. ప్రభావిత ఇళ్ల నుంచి కూడా పాలు, పెరుగు నమూనాలు సేకరించారు. వీటిని కాకినాడ జేఎన్‌టీయూ యూనివర్సిటీ, విమ్టా ల్యాబ్‌లకు పంపించినట్టు జిల్లా కలెక్టర కీర్తి చెప్పారు. మరో 41 పాల నమూనాలు, పశువులకు ఇచ్చే ఆహారం, నీటి నమూనాలు సేకరించి వెటర్నరీ బయలాజికల్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు పంపినట్టు తెలిపారు.
కల్తీ పాలు తాగి మృతి చెందిన నలుగురికి ఎక్స్‌గ్రేషియాను కలెక్టర్ కిర్తీ చేకూరి అందజేశారు. తాడి కృష్ణవేణి, తాడి రమణిల కుటుంబానికి రూ.20లక్షలు, నీలా శేషగిరిరావు కుటుంబానికి రూ.10లక్షల చెక్కు అందించారు. మిగతావారికి అందజేసేందుకు చర్యలు చేపట్టారు.
Next Story

