భారతీయ విద్యావేత్త రూబుల్ నగి‌కి గ్లోబల్ పురస్కారం..
x

భారతీయ విద్యావేత్త రూబుల్ నగి‌కి గ్లోబల్ పురస్కారం..

ప్రైజ్ మనీగా రూ. 8 కోట్లు


Click the Play button to hear this message in audio format

ప్రపంచ వేదికపై భారత్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక 2026 GEMS ఎడ్యుకేషన్ గ్లోబల్ టీచర్ అవార్డుకు భారతీయ విద్యావేత్త, కళాకారిణి రుబాల్ నగి ఎంపికయ్యారు. దుబాయ్‌లో జరిగిన కార్యక్రమంలో దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ హమ్‌దన్ బిన్ మహమ్మద్ బిన్ రశీద్ మక్తుం, గ్లోబల్ టీచర్ ప్రైజ్ వ్యవస్థాపకుడు, వర్కీ ఫౌండేషన్ ఛైర్మన్ సున్నీ వర్కే (Sunny Varkey) నగికి ట్రోఫీతో పాటు ప్రైజ్ మనీగా రూ.8 కోట్లను అందజేశారు. పేదలు నివసించే ప్రాంతాల్లో బడికి దూరమైన, అసలు బడికి వెళ్లని పిల్లల కోసం పాఠశాలలు తెరిచి చదువు చెప్పిస్తున్నారు.


రూబల్ నగి ఎవరు?

జమ్మూ, కశ్మీర్‌లో 1980 జూలై 8న జన్మించిన రూబల్ నగి ఒక ప్రముఖ శిల్పి, చిత్రకారిణి, సామాజిక కార్యకర్త. రూబల్ నగి ఆర్ట్ ఫౌండేషన్, రూబల్ నగి డిజైన్ స్టూడియో స్థాపకురాలు కూడా. ఇప్పటివరకు 800కు పైగా కుడ్యచిత్రాలు (మ్యూరల్స్) గీశారు. 150కుపైగా కళా ప్రదర్శనలు నిర్వహించారు. ముంబైలో కళ ద్వారా సామాజిక పరివర్తనకు ఆమె చేసిన కృషికి విశేష గుర్తింపు లభించింది.

ముంబైలోని పేదలు నివసించే ప్రాంతాల్లో పేదరికం, అస్థిరత కారణంగా పాఠశాల విద్యకు దూరమైన పిల్లలను నగి గమనించారు. ముఖ్యంగా ధారావి లాంటి ప్రాంతాల్లో పిల్లలకు చదువుకోవాలని ఉన్నా.. అందుకు తగ్గ సౌకర్యాలు లేకపోవడాన్ని ఆమె గమనించారు. ప్రభుత్వ సాయం కోసం వేచి చూడకుండా.. స్వయంగా ఉచిత అభ్యాస కేంద్రాలను ప్రారంభించి చదువు చెప్పడం మొదలుపెట్టారు. బడి మానేసిన లేదా ఎప్పుడు బడికి వెళ్లని పిల్లలను గుర్తించి బడికి అలవాటు చేశారు. ఇక్కడ ఉపాధ్యాయులు కేవలం పాఠాలు బోధించడమే కాకుండా మార్గదర్శకులుగా, కౌన్సెలర్లుగా, సమాజ శ్రేయస్సు కోరుకునే వ్యక్తులుగా కూడా వ్యవహరిస్తుంటారు. రూబల్ నగి ఆర్ట్ ఫౌండేషన్ ద్వారా ఆమె తన కార్యక్రమాలను దేశవ్యాప్తంగా విస్తరించారు. 800లకుపైగా అభ్యాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వినూత్న ఆలోచనలో భాగంగా పబ్లిక్ గోడలపై అక్షరాలు, సైన్స్ బొమ్మలు, సామాజిక విలువలు, పర్యావరణ సందేశాలను చిత్రీకరించారు. కళ ద్వారా పిల్లల్లో ఆసక్తి పెంపొందించడం, సమాజ విశ్వాసాన్ని పెంచడం ఆమె విధానం.


సుమారు 5 వేల మంది పోటీ..

2026 GEMS ఎడ్యుకేషన్ గ్లోబల్ టీచర్ అవార్డుకు 139 దేశాల నుంచి 5వేల నామినేషన్లు రాగా.. రూబల్ నగి మాత్రమే ఈ అవార్డు అందుకున్నారు. ప్రైజ్ మనీగా తనకు అందిన రూ. 8 కోట్లను విద్యా విస్తరణకు వినియోగిస్తానని చెప్పారు. ముఖ్యంగా జమ్మూ, కశ్మీర్‌లో మరికొన్ని కొత్త అభ్యాసనా కేంద్రాలను ప్రారంభిస్తానని తెలిపారు. అలాగే నైపుణ్య ఆధారిత శిక్షణ, డిజిటల్ లెర్నింగ్ కార్యక్రమాలను విస్తరించనున్నట్లు పేర్కొన్నారు.

రూబల్ నగి విజయం ప్రపంచ వేదికపై భారత్‌కు గౌరవాన్ని తీసుతెచ్చింది. కళను విద్యా ఉద్యమంగా మలిచి వేలాది పిల్లల జీవితాలను మార్చిన ఆమె కథ ఇప్పుడు ప్రపంచానికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

Read More
Next Story